పుట:కాశీమజిలీకథలు -04.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

గీ. వల్కలపటంబు కటి నింపు • గుల్కమిగులఁ
   బ్రధితసౌందర్యలలితలా • వణ్యకలిత
   ఘనతపోవ్రతహితమోని • కన్యయొకతె
   గానఁబడె ఱేని కొకయశో • కంబుచెంత.

సఖీ సహాయమై పుష్పదామంబులఁ గూర్చుచున్న యమ్మించు బోడింగాంచి పంచశరవిద్దహృదయుండై యా నృపాలుండు "అయ్యారే: యీ జవ్వనియెవ్వతయో ? నా చిత్తముత్తల పెట్టుచున్నది. దివసంబున నస్తమించిన చంద్రకాంతిరూపుఁ గై కొని తపం బొనరింప నిచ్చటికి వచ్చినదా ? ఆహా ! యీ మోహనాంగి నాతో మాటాడినఁ గృతార్థుండ నగదుఁ గదా ? పోయి పల్కరించెద" నని తలంచుచు నల్ల న నప్పల్ల వ పాణిచెంత కరిగెను. అక్కలికియు నృపతిలకునిం జూచి తదీయ సౌందర్యాతిశయమునకు విస్మయముఁ జెందుచు "ఔరా ? యీ మహారణ్యమున కరుదెంచిన యీ మనోహరుండు సిద్ధుఁడో : సాధ్యుఁడో : కావలయును. వీని చక్కఁదనముఁ జూచుటచే మదీయ నేత్రములు కృతార్థములై న" వని తలంచుచు దిగ్గునలేచి సిగ్గుచే నించుక తలవంచి యోర చూపులం జూచుచుఁ దొలఁగి చనఁబోయిన నప్పుడమిఱేఁ డిట్ల నియె.

యువతీ ! భవదీయ దర్శనమే ఫలముగా నెంచి యరుదెంచిన యీ యతిధిని స్వాగతమడుగక దూరముగాఁ బోయెదవేల ? ఈ యాశ్రమ మెవ్వరిది ? నీచే నెవ్వారి వంశము పవిత్రము చేయఁబడినది. శ్రోత్రానందస్యందములగు భవదీయనామాక్షరముల నుచ్చరింపుము. కుసుమసుకుమార మగు నీ శరీరము నేను గోర యిట్టి వ్రతములచేఁ గ్లేశపఱచు చుంటివి ? ఈ విజనారణ్యమున నొక్కరిత వేమిటికి వసించితివి? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన నప్పడఁతి లజ్జావశంబున నేమియు మాటాడినది కాదు.

అప్పుడు తత్సఖురాలు తదీయ మృదుమధుర వచన రచనల కెంతయు సంతసించుచు నార్యా ! యీ చిన్నది మేనకయను నచ్చర కూఁతురు దీనిపే రిందీవరప్రభ యండ్రు. ఆ దేవకాంత యీ బాలికంగని యి యడవిఁ బడవైచి దివి కరిగినది. దేవవ్రతుండను సిద్ధుం నాశిశివుం జూచి జాలిపడి తన యాశ్రమమునకుం దీసికొనిపోయి పుత్రికా నిర్విశేషముగాఁ బెంచి పెద్దదానిం జేసెను. ఇచ్చటికి స్నానార్దమై యరుదెంచినది. ఆ సిద్ధుని యాశ్రయ మిచ్చటి కనతి దూరములో నున్నదని యమ్మదవతి వృత్తాంతమంతయుం జెప్పినది. అప్పొలఁతి చరిత్రము విని నరపతి యుబ్బుచు గొబ్బునఁ దురగమెక్కి యా సిద్ధుని యాశ్రమంబున కరిగి తచ్చరణ సరసిజమ్ములకు మ్రొక్కుచు నతండడుగఁ దన వృత్తాంతమంతయు నెఱింగించుటయు నాలించి సిద్దుం డిట్లనియె.

రాజా ! సంసారమునఁ బ్రాణులకుఁ మృత్యువు వలనం గలిగెడు భయం బెఱుంగుదువు గదా ? నిష్కారణముగా నీ మృగముల నేమిటికి హింసించెదవు ?