పుట:కాశీమజిలీకథలు -04.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అంతలోఁ జారుమతి మెల్లన లోనికిం జని యామెచే వేయఁబడిన పీట పయిం గూర్చుండి "సాధ్వీ ! నీకు బిల్ల లెందరు ? పతి యెక్కడి కేగెను ? భాగ్యమే పాటి ? వృత్తియేమి ? యీ యూరు పేరేమని యడిగిన నామె యిట్లనియె. అమ్మా ! నాకు నెనమండ్రు మగ పిల్లలు. నా భర్త గ్రామాంతరం బరిగిరి. ఇప్పుడే రావలయును. "బ్రాహ్మణస్య ధనం భిక్షం" అనినట్లు మాకు భిక్షమే వృత్తి మా భాగ్యము నీకుఁ గనంబడుచుండలేదా ? యీ యగ్రహారములలో మేమే పేదవారము.

పూర్వ మొకప్పుడు విక్రమార్క మహారాజు దేశాటనముఁ జేయుచు నిచ్చటికి వచ్చి యొక విప్రునింటఁ గుడిచి వారి యుపచారములకు సంతసించుచు నీ యగ్రహారము కొని వారికిచ్చెను. దీని పేరు చిత్రకూటమండ్రు. అప్పుణ్యాత్ముఁడు దానమిచ్చినవారి యిల్లు వేయు మొదళ్లైనది. వారందఱు భాగ్యవంతులే మే మొక్కరమే యీ యూర బేదవారమని యా కథయంతయు జెప్పినది. అంతలో రాజపుత్రుఁడు గుణసాగరునితోఁ గూడ స్నానముఁ జేసి యింటికి వచ్చెను. ఆ యిల్లాలు వారికి సంతృప్తిగా భోజనము పెట్టినది. కుడిచిన తరువాత రాజపుత్రుఁడు తల్లి తో రహస్యముగా "అమ్మా ! వీరి వృత్తాంతము నీవు వింటివా ? ఈ యగ్రహారము మా తాత యిచ్చినదేయఁట పాప మీ యూరిలో వీరే భాగ్యహీనులఁట. ఈ యిల్లాలి కెనమండ్రు పుత్త్రులు. తలయొక పనిమీఁదను బోయిరి. అందఱు చదువుకొనిరఁట. నాతో స్నానమునకు వచ్చిన గుణసాగరుఁ డొక్కఁడే విద్యరాని వాఁడట. అన్నదమ్ములందఱు వానిం గొట్టుచుందురఁట. మనతో వత్తునని చెప్పుచున్నాఁడు. వారి పరివేదనము విన లేక పోయితిని. చాల జాలి వేసినది. ఏమి చేయుదును ? మా తాతకు రాజ్యమున్నది. కావున భోజనముఁ జేసిన విశ్వాసమున నీయగ్రహారమిచ్చెను. నాకంతకంటెనెక్కుడు విశ్వాసమున్నది. నిర్ధనుండ నైతిని గదా ? యని విచారించిన విని తల్లి దుఃఖింపుచు "తండ్రీ దైవము మనల నిట్లు చేసెను. కానిమ్ము . ఎల్లకాల మిట్లే యుందుమా ? ధన మబ్బినప్పుడు జ్ఞాపక ముంచుకొని వీని కుపకారము చేయుదువుగానిలే" యని యోదార్చినది. చారుమతి కాలిలోని పొక్కులు చూచి యా యిల్లాలు వారి నా పూట కదల నిచ్చినది కాదు. రాజపుత్త్రుఁడు సాయంకాలము వఱకుఁ దల్లి యడుగు లొత్తుచు గమన శ్రమవాయ నుపచారములు చేయుచుండెను.

ఆ రాత్రి కాయింటి యజమానుఁడు దేవభట్టు వచ్చి వాకిట జారుమతిని బుత్రునిగాంచి లోని కరిగి వీరెవ్వరని భార్య నడిగెను. ఆమె వారి యాగమన ప్రకార మెఱింగించినఁ నలుగుచు నోహో ! యీ యూర నిందఱు భాగ్యవంతులుండ మనము గనంబడితిమా ? యని యడిగిన భార్య పోనిండు. ఇంతకన్న దారిద్ర్యము రాదుగదా వారు గడుమంచివారు. ఱేపు పోవుదురని చెప్పి మగని సమాధాన పరచినది ఆ రాత్రి భోజనానంతరమున విజయభాస్కరుఁడు దల్లి యు వాఁకిటి యరగుపయి బండుకొనిరి. ఆ యిల్లాలు భర్తతో మీరు మధ్యాహ్నమునకు వచ్చితిరి గారేమి ? యెక్కడనుంటిరని