పుట:కాశీమజిలీకథలు -04.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిగమశర్మ కథ

157

మా గుట్టుఁ దెలిసికొని మా యింటనున్న చిన్న దాని నెత్తుకొని పోయితివి. మా శక్తి యాహారము చెడఁగొట్టిన పాతక మూరకపోవునా ? మిమ్ము నందఱ నిప్పుడు మా తల్లి కి బలియిచ్చుచున్నారము. మీ యిష్టదైవమును బ్రార్థించుకొనుడని పలికిన విని గడ గడ వడఁకుచు నిగమశర్మ యిట్ల నియె.

బాబులారా ! నే నేమియు నెరుంగను. ఎవ్వఁడో యొక చిన్నవాఁడా చిన్నదానిని మా యింటికిఁ దీసికొని వచ్చి రాజుగారి కప్పగించుమని చెప్పెను. ధన మందలి యాసచే నేనే తీసికొని వచ్చితినని బొంకితిని. అందు వలన బ్రయోజనము లేకపోయినది. ఆ చిన్నది తండ్రితో యదార్థముఁ జెప్పుటచే నతం డనుమానముఁజెంది నా మాటలు నమ్మలేదు. ఇంతయు నిక్కువము ; నిరపరాధుల మమ్మేల చంపెదరు? రక్షింపుడు, రక్షింపుడని వేఁడుకొనిన సమ్మతింపక యాదస్యులు కత్తులు వారి కుత్తుకలపై వ్రేయఁ గమకించు సమయంబున వలదు, వలదు. వీరిఁ జంపకుఁడు. నే నింతటి నుండి మాంసోపహారముల నంగీకరింపను. కందమూల ఫలాదులే భుజింపుచుందు. నా యెదుట జీవహింస చేయరాదని యా శక్తి వారితోడఁ బలికినది

ఆ మాట విని చోరులు కత్తులు నేలఁ బాఱువై చి బాపనయ్యలారా! . బ్రతికి బోయితిరి. మా తల్లికి మీ యందు దయవచ్చినది. మిమ్మిచ్చటనుండి కదలనీయము. పశువులం బోలెఁ గట్టి మేపుచుందుమని చెప్పి యట్లు చేయుచుండిరి. సజ్జనులఁ బాధించిన పాతక మూరకపోపునా ? యని యెఱింగించి యప్పటికి వేళ యతిక్రమించుటయు నమ్మణిసిద్ధుండు తదనంతరోదంతంబు దరువాతి మజిలీయందిట్లు చెప్పఁ దొడంగెను.

నలువదియ మజిలీ

గోపా ! విను మట్లు విజయభాస్కరుండు దల్లి తోఁ గూడఁ జంద్రప్రస్థ నగరము విడిచి యడవి తెరువునంబడి నడిచి నడిచి కొన్ని పయనంబులకుఁ జిత్రకూటంబను నగ్రహారముఁ జేరెను. అయ్యగ్రహారంబు సకల విద్యావిలాసభాసురులగు భూసురులచే నలంకరింపఁబడి యున్నది. దూర మార్గగమన శ్రమచే డస్సినిట్టూర్పులు నిగుడింపుచు నా రాజనందనుఁ డందొక ధరణీ బృందారకుని మందిరము దాపున నిలువంబడి వాకిటికి వచ్చిన యాయింటి యజమానురాలిం జూచి అమ్మా ! మేము పరదేశులము. ఈమె మా తల్లి . దూరము నడుచుటచేఁ గడు డస్సినది. ఈ పూఁట మీ యింట మా కాతిధ్యమిత్తురే ? యనుటయు నా యిల్లాలు "రండు రండు. మీ వంటి వారూరక మా యింటికి వత్తురా ? మేము కృతార్థుల మయ్యెదము గదా ?" యని పొగడుచు నర్ఘ్యపాద్యాదులం దెచ్చి యిచ్చి యర్చించుచుఁ దమయరుఁగు పయిం గూర్చుండఁబెట్టి త్రుటిలో వంటఁజేసి భోజనమునకు లెండని నియమించి స్నానార్దమై యరుగుచున్న విజయభాస్కరునివెంటఁ దటాకముఁ జూపుటకై తన పుత్త్రుగుణ సాగరుఁ డనువాని నంపినది.