పుట:కాశీమజిలీకథలు -04.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వారి చర్యల నరసికొనిరండని గూడచారులను నియమించెను. నిగమశర్మయు నేను దగని వాఁడనని కొమార్తెచే బొంకింపుచు మన రాజు ధర్మముఁ దప్పి ప్రవర్తించుచున్నాఁ డని పట్టణమంతయు జాటింపుచుండఁ బౌరులు వాని మాటలు సత్యములని నమ్మి రాజును నిందింపఁ దొడంగిరి.

అది యట్లుండె నరణ్యములో నాఁటి రాత్రి మ్రుచ్చులట్లు గమ్యస్థానమున కరిగి తిరిగి వచ్చి శక్తి గుడిముంగిట నబ్బాలికం గానక నలుమూలలు వెదకి యొరులు వచ్చిన గుఱుతులు గనంబడినఁ దొట్రుపడుచు నోహో ? మోసము వచ్చినది ఎవ్వడో మన మర్మము దెలిసికొని వచ్చి యచ్చిగురుఁబోడిం దీసికొని పోయెను ధనమేమియు ముట్టలేదు. వాఁడబ్బాలికకు దగ్గర చుట్టము కావలయును వానిం బట్టికొని పరాభవింపనిచో మనగుట్టు బయలు పడకమానదు.చంద్రప్రస్థ నగరమున కరిగిన నంతయుఁ దెల్లమగునని యాలోచించుకొని ----------- భిక్షకులవేషము వైచుకొని యా రాజధానికిం జనివీధులం దిరుగుచుండ నొకచోటఁగొందఱు కూర్చుండి మనరాజుయాడి దప్పెంగదా? పాపము నిగమశర్మ రాజపుత్రికను జోరులబారినుండి తప్పించి తీసికొనివచ్చెను. తాను బ్రకటించిన ప్రకార యా బాలికను నిచ్చి బెండ్లి జేయవలసినదే ? అట్టివాఁడు మొదట నట్లు చాటింప నేల ? యని చంద్రగుప్తుని --------మాటాడుకొను చుండిరి. ఆ పాటచ్చరులా మాటలు విని బాటసారులవలె నిగమశర్మ యింటికిం జని యతనితోఁ బరిచయముఁ జేసి యార్యా ! నీవు తస్కరులచేఁ బట్టువడిన రాచపట్టిం బట్టితెచ్చి రాజు గారి కిచ్చితివఁటే ఆతండు నీ కామిత మేమిటికిఁ దీర్పలేదు. నీవుపేక్షించితివేల ? ఆ విషయము తగవు పెట్టవలసినదే యని యడిగిని నా భూసురకుమారుండు నేను విడిచితినా ? అతండే పిలిచి యిచ్చునని చూచుచున్నాను మఱి కొన్ని దినములు విమర్శించి పిమ్మటఁ దగవు పెట్టెదను. న్యాయమునకుఁ గాలము గాదుగదా ? నే నప్పుడు పేక్షించితినేని నప్పంక జాక్షి ఈ పాటికా పాటచ్చరులకుఁ బరిచారికగా నుండకపోవునా ? అని చెప్పిన విని వాండ్రు క్రమ్మఱ నిట్లనిరి.

అయ్యా ! ఆ దొంగల నివాస దేశమెచ్చట ? నీకెందు గనంబడిరి. ఆ బాలిక నెచ్చటినుండి తీసికొనివచ్చితివని యడిగిన నతండు 'అబ్బో ? దానికి బెద్దగాధ యున్నది. ఇప్పుడు చెప్పుటకు దీరుబడిలేదు. నాకుఁ బనియున్న 'దని పలికియక్కడి నుండి యెందేనిం బోయెను. వీఁడే మనగుట్టు దెలిసికొని వచ్చినవాఁడు. సకుటుంబముగా వీనిం బట్టికొని తీసికొనిపోయి మన యమ్మవారికి బలియిత్తమని నిశ్చయించుకొని వాండ్రొకనాఁటి రాత్రి నా బ్రాహ్మణ కుటుంబము వారి నందఱిని ఱెక్కలు విరిచికట్టి యొరు లెఱుంగకుండఁ దెల్లవారక పూర్వము తమ యునికి పట్టునకుఁ దీసికొనిపోయిరి.

పెక్కండ్రు రాజభటులచేఁ గాపాడఁబడుచున్న కోటలోఁ బ్రవేశించి దోఁచికొని పోయిన యా గజదొంగలకు నా బాపనయ్యలఁ దీసికొని పోవుట యేమి లెక్క ? అందమ్మవారి ముఖమండపమున వారినెల్లఁ బరుండబెట్టి నిగమశర్మతో నోరీ ? నీవు