పుట:కాశీమజిలీకథలు -04.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిగమశర్మ కథ

155

దండించును. మనము వీరి కుపకారము చేయఁదలచుకొంటిమిగదా ? అట్టివారి కపకార మెట్లుచేయుదును ? మనకు ద్రోహముచేసిన పాపమువారినంటకుండ దైవమును బ్రార్థింపుచున్నాఁడ నది వారి దోషముగాదు. దారిద్ర్యదోషము. మన మిక్కడుండరాదు. మరియొక యూరికిఁ బోవుదము రమ్ము. రాజుగారు వీరి కెద్దియేని యుపకారము చేయగల'రని పలికి యెవ్వరికిఁ దెలియకుండఁ దల్లితోఁగూడ నాఁటి వేకువజామున మఱియొక యూరికింబోయెను.

మఱియొకనాఁడు నిగమశర్మ రాజునొద్ద కరిగి దేవా ! దేవర ప్రకటించిన ప్రకారము జరిగింపవలయును. నేను మీపుత్రికం దీసికొనివచ్చి యర్పించితిని. ప్రభువులే దబ్బర లాడినచోఁ బ్రజ లేమిచేయుదు? రని యడిగిన నాఱేఁడు 'మాకలభాషిణి తన్ను విడిపించిన వాఁడవు నీవు కావని చెప్పుచున్నది. నీ మాటలు వినినను నసందర్భముగానేయున్నవి. నిన్నొక్కనిఁజూచి పదుగురు పారిపోయిరని చెప్పుచుంటివి. ఇది లోకవిరుద్ధము కాదా ? నిజము దేలువఱకు నేమి చెప్పుటకు వీలు లేదనుటయు నతండిట్లనియె. ఱేఁడా ! మీకొమార్తె నేను బ్రాహ్మణపుత్రుండననియు నననుకూలుండ ననియు నన్నుఁ బెండ్లియాడుట కిష్టములేక యిట్లు బొంకుచున్నది. పోనిండు. ఆమె చెప్పిన చిన్నవాడు మీరడిగిన సమ్మతించెనా ? మాయింట నున్నపుడాచిన్నవానిఁజూచి వరించి యట్లనుచున్నది నిజము దెలిసికొని న్యాయము చేయుఁ డని కోరికొనెయెను. అతని మాటలు విని రాజు పోపొమ్ము నా కొమరిత యసత్యము లాడునదికాదు. న్యాయమే విచారించి కావించెద'నని పలికి యతనినంపి తానంతఃపురమున కరిగి కలభాషిణి కిట్లనియె.

అమ్మా ! నీవు చెప్పిన చిన్నవాఁడును దల్లియు నా బ్రాహ్మణుని పెరటి నూఁతిలోఁ బడియున్నారు. నేనుబోయి దైవవశమున నానూతియొద్దకరిగి చూచి వారిం బయటికిఁ దీయించి మాటాడితిని. నీ ప్రశంస యేమియుఁ దనకుఁ దెలియదని చెప్పిరి. పోలికలు చూచిన నీ వన్నట్లేయున్నారు. ఆ పాఱులే వారి దానిలోఁ బడఁద్రోసిరని తలంచి యడిగితిని. అదియేమియుంజెప్పక తమంతటఁదామే కాలుజారి పడితిమని నుడివిరి. అప్పుడు నేనేమిచేయుదును ? ఈ బ్రాహ్మణబుత్రుఁడు నన్నూరక నిందింపు చున్నాఁడు. నిజముఁ జెప్పుమని యడిగిన నప్పఁడతి యిట్లనియె.

తండ్రీ ! నేను నీతో దబ్బఱ లాడుదునా ? ఆ చిన్నవాఁడు కడు మంచివాఁడు ? తల్లి యు నట్టిదే. వారితో నేను నాలుగు దినములు పయనము చేసితిని. వారికిఁ గల భూతదయ మఱియొకరికి లేదు. నన్నెంతయో దయతోఁ జూచి నన్ను యీ యూరు దీసికొని వచ్చిరి మేము పండుకొనిన యింటిపాఱునిదారిద్ర్యమునకు మిక్కలి వగచుచు వారి కెద్దియేని నుపకారముఁ జేయవలయునని మొన్న ప్రొద్దున్న దల్లి తోఁ జెప్పుచుండ నేను వింటిని. ఆ పిమ్మటనే వారు నాకు ప్రొద్దున్న గనంబడలేదని యా వృత్తాంతమంతయుం జెప్పినది. చంద్రగుప్తుండును సంశయడోలాయిత హృదయుండై