పుట:కాశీమజిలీకథలు -04.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

రాజుగారితోఁ జెప్పుమని చెప్పినది. వాఁడుపోయి యామాటఁ జెప్పెను. రాజు నవ్వుచుఁ గానిమ్ము బెండ్లియైన తరువాత బెట్టు చేయవచ్చును. ఇప్పటికి రమ్మని చెప్పుము. రాకున్న శిక్షింతుననుటయు నామాటలు విని నిగమశర్మ వడివడి లేచి రాజుయొద్దకు వచ్చెను. అతని యలంకారము వేషముఁజూచి మున్నెఱెంగినవారెల్ల బకబకనవ్వసాగిరి. అప్పుడు రాజు విప్రకుమారా ! మీయింటికి నొక యాఁడుది చిన్నవాఁడు వచ్చిరఁట. వారెక్కడనున్నారని యడిగినఁదడఁబడుచు నాకుఁ దెలియదు. మాయమ్మ నడుగుఁడని యుత్తరముఁ జెప్పెను.

అప్పు డామెను బిలిపించి యడిగిన మాయింటి కెవ్వరును రాలేదనియు వారెవ్వరో మే మెఱుఁగమని చెప్పినది. ఆ మాటలలోఁ దొట్రుపాటుగ్రహించి యా భూభర్త మీ యిల్లేబాటిదో చూడవలయునని పరివారముతోఁ గూడ లోపలఁ బ్రవేశించి యిల్లు నలుమూలలు వెదకి పెరటిలోని కరిగి పరికించి యా నూతియొద్దకుఁ బోయి తొంగిచూచెను. అందులో నిరువురు మనుష్యుల మొగములు నీటిపైఁ దామరపద్మముల వలెఁ గనంబడినవి. వానింజూచి యతఁడు విస్మయసంభ్రమములతో రజ్జునిశ్రేణికలం దెప్పించి పరిచారకుల దింపి వారిఁ బైకిరప్పించెను. వారు స్మృతితో నుండుటకు రాజు సంతసించుచు, గట్ట గ్రొత్తబట్టల నిప్పించి శీతము వాయ నుపచారములు సేయించెను. అప్పు డా బ్రాహ్మణినిఁ బిలిచి రాజు "వీరెవ్వరు మీనూఁతిలో నెట్లుపడి "రని యడిగిన నామె విస్మయం బభినయించుచు “అయ్యో ! వీరెవ్వరో నేనెఱుంగను. మానూతిలోని కెట్లు వచ్చిరోకదా ?” యని యుత్తరము జెప్పినది. ఈలోపల నిగమశర్మ వారు తన గుట్టు బయలుబెట్టుదురని యొంటి ప్రాణముతోఁ దెల్లపోయి చూచుచుండెను.

పిమ్మట రాజు విజయభాస్కరునిఁ బిలిచి "కుమారా ! మీరెవ్వరు ? ఇచ్చటి కెప్పుడు వచ్చితిరి ? మిమ్మీనూఁతిలో నెవ్వరు పడఁద్రోసిరి. నిజముఁజెప్పు" డని యడిగిన దయగలహృదయుఁడగు నా రాజపుత్రుఁడు ఆ బ్రాహ్మణుల బెదరుఁజూచి జాలివొడమ "దేవా ! మేము మార్గస్థులము. మమ్మెవ్వెరు దీనిలోఁ బడద్రోయలేదు. కాలు జారి నేను బడితిని. నానిమిత్త మామె పడినది. ఇదియేనిజ" మని చెప్పెను. ఆ మాటవిని రాజు “మహారణ్యములోఁ గలభాషిణియను బాలికను దొంగలబారిదప్పించిన వాఁడవు నీపు కావా ? యని యడిగిన నావృత్తాంతమేమియు నేనెఱుంగను, కలభాషిణి యెవ్వతియో నాకుఁ దెలియదని యతడు ప్రత్యుత్తరముజెప్పెను. ఎన్నిసారులడిగినను నడిగించినను విజయిభాస్కరుఁ డామాటయే చెప్పెను. కాని యదార్దముఁ జెప్పఁడయ్యెను. అప్పుడా రాజేమి చేయుటకుందోచక కానిండు ఱేపు విమర్శింతము. ఇప్పుడు మిగిలిన దేమియున్నదని పలికి పరివారముతోఁగూడ యధాగతముగా నింటికింబోయెను. అప్పుడు విజయభాస్కరుఁడు తల్లితో "అమ్మా ! యీ కలభాషిణి మనవృత్తాంతముఁ దండ్రితోఁ జెప్పినది కాఁబోలును. నన్నతండు గ్రుచ్చియడుగఁ జొచ్చెను. నిజము చెప్పినచో నిగమశర్మకుఁ బిల్ల నియ్యపోవుటయే కాక వీరినెల్ల