పుట:కాశీమజిలీకథలు -04.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

లకుం బోవుచు వ్యూహమును గాపాడుచుండెను. హిందువుల యుద్యమము వజీరునకుఁ దెలియమిచేఁ బదివేల యవన సైన్యముతో లవంగిని హుసేన్‌బాదు కోటలోని కనిపెను.

లవంగి కథ

యవనసేనానాయకుఁడు తన సైన్యమంతయు హుసేన్‌బాదు చుట్టును నిలువంబెట్టి కాశీవిశేషములం దెలియ వేగులవారినంపి వారిచే హిందువుల సన్నాహము విని వెఱఁగుపడుచు లవంగి కొక యుత్తరమిట్లు వ్రాసికొనియెను. “రాజపుత్రీ! మన రాకఁ దెలిసికొని హిందువులు కాశీపట్టణము చుట్టును గాపుపెట్టుకొనిరి. వారి బలము మన బలముకన్న నధికముగానున్నది. ఈ విషయము తెలియక మేము సామాన్య సన్నాహముతో వచ్చితిమి. ఇప్పుడే మరికొంత సైన్యమును బంపుమని వజీరునకు వ్రాసితిని. ఆసేన వచ్చువరకు శివరాత్రి మిగిలిపోవును. ఇప్పటి బలముతో వారిం ద్రోసికొని పోవంజాలము. కావున సంగతి విశదపఱచుకొంటిని. సేవకునికు గర్తవ్యమెద్దియో యాజ్ఞాపింప వలయును.”

ఆ యుత్తరముఁ జదువికొని లవంగి యొక్కింతతడపు వివశయై మాటలు తడబడ 'సఖీ! సంగీతచంద్రిక! ఇటురా. ఈ యుత్తరముఁ జూడుము; అభాగ్యులకు సుకృతకార్యములు లభించునా? అయ్యో! గంగాస్నానము విశ్వానాథదర్శనముఁగలుగునని యెంతయో యభిలాషతో వచ్చితిమి. ఏదియు లేకపోయెను. ఈపాడుకులంబున నేమిటికిఁ బుట్టితిని. మాతండ్రియొద్ద సేనలు లేకపోయెనా? ఇంత యల్పముగాఁ బంపనేల? అదియు నా దురదృష్టమే. ఇప్పుడేమి చేయుదుము. మనప్రాణసఖి కుందలతిక యెక్కడ నున్న 'దని పరితపించుచున్న లవంగి నూరడించుచు సంగీతచంద్రిక యిట్లనియె.

'సఖీ ! మాకీవార్త నిన్ననే తెలిసినది. నీవు విచారింతువని నీతోఁ జెప్ప లేదు. నిన్నెట్లయిన రేపు గంగాస్నానముఁ జేయించి విశ్వనాథుని యాలయమునకుఁ దీసికొని పోవుదుము. నీవు విచారింపకుము. మేమిరువురము నాలోచించుకొంటిమి. నేఁటియుదయమునం గుందలతిక కాశీపురంబున కరిగినది. అచటి రహస్యములం దెలిసికొని రాఁగలదు. వచ్చినతరువాత యుక్తానుసారము గావింత'మని పలుకుచుండఁగ కుందలతిక యచ్చోటికి వచ్చినది. లవంగి యాయింతింజూచి సంతోషముతో 'వయస్యా! ఏమి ఏర్పాటు చేసికొని వచ్చితివి. మనము రేపు పోవుట సాగునా? మీవంటి యాప్తులుండ నాకుఁ గొదువయే'మని పలికిన విని కుందలతిక యిట్లనియె.

'బోటీ! నేను మాఱువేషముతోఁ గాశీపురమున కరిగితిని. కావలివారల యానతి లేక నావీటిలోఁ జీమైనం దూరశక్యము గాదు. పట్టణముచుట్టును వీథివీథులను రాజభటులు కాచి యున్నారు. యాత్రార్ధులైన హిందువులు నిరాటంకముగాఁ బోవ