పుట:కాశీమజిలీకథలు -04.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండితరాయలకథ

19

పాదుషాగారి సైన్యమును బొలిమేరకు రాకుండఁ గొట్టెద. నతండు ప్రార్ధనాపత్రికలకు సమ్మతించువాడుఁ కాఁడు. వ్రాసినయుత్తర మట్లున్నదని పలికి యాసభ్యులయుల్లముల వీరరసముఁ బొంగజేసెను.

అప్పుడప్పౌరులందరు వీరునిమాటల మెచ్చుకొని వీరావేశముతో ఫాదుషా గారి కూఁతురు గుడిలోఁ బ్రవేశించుటకు సమ్మతింపము బలవంతము చేసి వచ్చెనేని బ్రాణములకుఁ దెగించి యాబాలవృద్ధముగాఁ బోరెదము. ఈ మహావీరుడే మాకు సేనాధిపతిగా నుండుఁగాక ఇతండు చెప్పినట్లు రెండులక్షల సైన్యము మాయధీనము చేయవలయునని యేకవాక్యముగాఁ బలికిరి. అప్పుడు కాశీరాజునకును రోష మావేశించినది. కావున “నోహో? మీరందఱు వీరులును నేను బిరికివాఁడననియా మీరు తలంచు చుండిరి. ఈవీరునకు సర్వసేనాధిపత్య మొసంగితిని. అతనియిష్టము వచ్చినట్టు చేయవచ్చును. సంగరమయ్యెనేని నేను సహాయుఁడగానుందు" నని పలికెను. ఆమాటల కందఱు సమ్మతించి యప్పుడే యమ్మహావీరుని సేనాధిపతిగా నియమించుకొని యంతటితో నాసభ చాలించిరి.

మఱునాఁడు వీరుండు మసీదునకుం జని ఫకీరుతో “మా మతస్థులు పాదుషా కూఁతురు గుడిలోఁ బ్రవేశించుటకు సమ్మతించినారు కారు. మతవిరుద్దధర్మములఁ జేయఁదగదని మందలించి పాదుషాగారికిఁ బ్రత్యుత్తరము వ్రాయుమని పలికెను. ఆ మాటలువిని ఫకీరు తలపంకించుచుఁ 'గానిండు. మాకేమి మీమేలునకే చెప్పితిమి. హిందువులకు ముప్పు రానైయున్నది. మాన్పింప నెవ్వరితనం' బని పలికి యప్పుడే వజీరున కావిషయములు వ్రాసిపంపెను. మఱికొన్ని దినములకు డిల్లీనుండి మశీదున కొకయుత్తరము వచ్చినది. అట్టిసమయమున వీరుఁ డందే యున్నవాఁడు కావున నందలి సంగతులు తెలిసికొనియెను.

'కాశీపురమునకు నాలుగు క్రోశముల దూరములో హుస్సేన్‌బాదను కోట కలదు. అది ఫాదుషాగారి యధీనములోనున్నది. లవంగి పదివేల సైన్యముతో శివరాత్రికిఁ బూర్వమువచ్చి యా కోటలోఁ బ్రవేశించును. శివరాత్రినాఁడు గంగస్నానముఁ జేసి లింగమున కభిషేకము చేయఁ గలదు. అడ్డమువచ్చినవారిం బరిమార్పవలయునని పాదుషాగారి యాజ్ఞయైనది. మీరును వారికిఁ దగిన సహాయముఁ జేయుచుండవలయు' నని వజీరు వ్రాసిన విషయములు రహస్యములైనను ఫకీరులు వీరునియందుఁ గల విశ్వాసమునఁ దెలియఁజేసిరి.

సంగరోత్సవముఁ గోరుచున్న వీరుఁ డామాటలు విని యుబ్బుచు దమవారి కెల్ల నారహస్యములం దెలియఁజేసి కాశీరాజు నడిగి లక్షసైన్యమును మాత్రము తెప్పించుకొని శివరాత్రికిఁ బూర్వము పట్టణముచుట్టును వీథులమొగలను దేవాలయద్వారములయందును గాపుగా నిలువంబెట్టి చక్రవ్యూహము పన్ని తాను గుఱ్ఱమెక్కి యన్నిచోటు