పుట:కాశీమజిలీకథలు -04.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నతం డిట్లనియె. అతండెట్టివాఁడైనను మతవిరుద్ధములగు కార్యములు చేయఁబూనినచోఁ బ్రజలు సమ్మతింతురా? ఇదియా చక్రవర్తియగుటకు ఫలము? గానిమ్ము నాకింత చెప్ప నేల మావారితో విచారించి రేపు ప్రత్యుత్తర మిచ్చెద ననిపలికి యప్పుడే తండ్రి యొద్దకుంబోయి యా వృత్తాంతమంతయుం జెప్పెను.

పాదుషాగారిశాసనమువిని పండితభట్టు వెఱచుచు నాయూరిలోఁ బేరుపొందిన వారికెల్ల నాకథచెప్పి వారితోగూడాఁ గాశీరాజు నొద్దకుంజని పాదుషాగారి యుద్యమ ప్రకారమంతయుం జెప్పెను. ఆవిషయము విమర్శింపఁ గాశీరాజు మఱునాఁడు విశ్వేశ్వరుని దేవాలయములో నొక సభఁజేసెను. ఆ సభకుఁ గాశీలోనున్న వారందరు వచ్చిరి. ఆ సభలోఁ బండితభట్టు నిలువంబడి పాదుషాగారి కూతురు శివరాత్రి వచ్చి స్వామికి స్వయముగా నభిషేకము చేయునఁట మనము వలదంటిమేమి బలత్కారముగా నప్పని సేయింతురట. దీనికిప్పుడు మనమేమి చేయవలయునో మీ మీ యభిప్రాయములు చెప్పవలయునని యుపన్యసించెను.

అప్పుడు కొందరు ఫాదుషాగారితోఁ బగఁబూని మనము నిలువఁజాలము గావున నడ్డము చెప్పవలదనియు మఱికొందరు వినయముతో నాయన కిట్టిపనిచేయుట మా మత విరుద్ధమగుట మానపింపుఁడని ప్రార్దనపత్రికలు పంపవలయుననియు నొకరు మనరాజుగారి యభిప్రాయ మెట్లో యట్లు చేయవలయుననియు మఱియొకరు ప్రాణములు విడచియైన మానముఁ గాపాడుకొనవలయు ననియుఁ దలయొకరీతిం బలికిరి. పిమ్మటఁ గాశీరాజు సభలో నిలువంబడి పాదుషాగారు మనకందఱకు జక్రవర్తియై యున్నవాఁడు వారిశాసనము తిరస్కరించుట మాబోటులకు శక్యమైనదికాదు. ఆయన యధీనములో ననేక లక్షల సైన్యమున్నది. రెండులక్షల సైన్యముగల నే నాయనతోఁ బగబూని నిలువగలనా? ప్రార్ధనాపత్రికఁ బంపుటయే యుచితమని నాకుఁదోఁచినదని యుపన్యసించెను.

అప్పుడు వీరుఁడు లేచి సభలో నిలువంబడి నలుదశలఁగలయఁ గనుం గొ'నుచు గంభీరస్వరంబున నిట్లనియె. “సభ్యులారా! పాదుషా చక్రవర్తియని మీరందరు వెఱచుచున్నారు. అతనికి మనలో నొక సామాన్యునకుఁ గల బలము లేదని నమ్ముఁడు. విశ్వేశ్వరలింగము హిందూమతస్థులకెల్ల ప్రాణమువంటిది. ఆ లింగము గాపాడుట మనకేగాక మన హిందూదేశమున కంతకు నావశ్యకమైయున్నదిఁ అల్పసారముగల తృణములు కూడికొని యేనుఁగును బంధించుచున్నవి. మన దేశమంతయు నేకమైనచో నీపాటి పాదుషాలు పలువురైన నేమియుఁ జేయలేరు. మానముకన్న ప్రాణము లెక్కుడికావు. దేశముమాట యటుండనిండు. ఈ పట్టణమంతయు నొక నూలిమీఁద నుండినజాలదా? మన రాజుగారు పాదుషాకు వెఱచిరి. ఆయనతోఁ బని లేదు. రెండులక్షల సైన్యమును నాయధీనము చేయుమనుఁడు. శివరాత్రినాఁడు