పుట:కాశీమజిలీకథలు -04.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3]

పండితరాయలకథ

17

వ్రాసి యిచ్చెదనని చెప్పుచుండఁగనే ఢిల్లీనుండి విత్తసహితముగాఁ గొందఱువచ్చి యొకయుత్తరము మా పెద్దఫకీరున కిచ్చిరి.

ఆఫకీరు వీరుండు వినుచుండ నాయుత్తరము విప్పియిట్లు చదివెను. కాశీ పట్టణంబునఁగల మసీదు ఫకీరున కనేకసలాములుచేసి డిల్లీ పాదుషాగారి వజీరు (మంత్రి) విన్నవించునది యేమనగా మనపాదుషా గారికి లవంగియనుకూఁతురగలదు. అచిన్నది యిప్పుడు పదియాఱేడుల ప్రాయముకలిగియున్నది. చిన్నతనమునుండియు హిందూమతము నందభిమానము గలదగుటచే నావిద్యలయందే యెక్కువ పరిశ్రమ చేసినది.

ఈ నడుమఁ గాశీఖండమను గ్రంధమును జదివినదఁట అప్పటి నుండియుఁ గాశీయాత్ర సేవింపవలయునని మిగుల వేడుకపడుచున్నది. రేపు రాఁబోవు శివరాత్రి కచ్చటికి వచ్చి విశ్వేశ్వరునికి స్వయముగా నభిషేకము చేయునఁట. తనయభిలాష నాయోషారత్నము తండ్రితోఁ జెప్పికొనఁగా పాదుషాగారు మీ కిట్లు వ్రాయమని యానతిచ్చిరి. ఇదివరకు మనపాదుషాగారికి వరుసగా నేడ్గురు పుత్రికలు పుట్టి యే డేండ్ల వరకు పెరిగి కాలముచేసిరి. ఇప్పుడీమె యెనిమిదివ సంతానమై యొక్కరితయే యున్నది. దానంజేసి పాదుషాగా రీకోమలిని గారాబముగాఁ జూచుచు నేమికోరినను గాదనక తీర్చుచుందురు. కావున నందలి హిందువుల యభిప్రాయము లెట్లున్నవో తెలిసికొని వ్రాయవలయును. బలవంతమునైనను నాకార్యము సేయింపక మానము.

అనియున్న యుత్తరవు రెండుసారులు చదివి యాపెద్దఫకీరు వీరునితో నప్పా! ఈయుత్తరము నీవువింటివిగదా? ఈయూర మీతండ్రి యన్నింటికిం జాలియున్నవాఁడు. ఈయుత్తరములోసంగతు లాయనకుం జెప్పి యేమిని వ్రాయవలయునో సత్వరముగాఁ దెలిసికొనిరమ్ము. చివరవాక్యమున కర్దము గ్రహించితివిగద. పాదుషాగారి శాసనమున కడ్డుసేయువాఁడు గలఁడా యని పలికినంత మందహాసము చేయుచు వీరుం డిట్లనయె.

ఏమేమీ? హిందూదేవాలయములోనికి వచ్చి యవనపుత్రిక యభిషేకము చేయునా? చాలు చాలు నిందులకు మామతస్థులు సమ్మతింపరు. మీమతంబులో నన్ని మతములవారి గలుపుకొందురు. మేమెవ్వరినిం జేర్చుకొనుటకు మాశాస్త్రములు సమ్మతింపవు. బలాత్కారముగాఁ జేయించుటకు పాదుషా యంత యెక్కుడు వీరుఁడా యేమి? యిచ్చటమాత్రము బలవంతులు లేరా యని పలికిన నా పెద్దఫకీరు వెండియు నిట్లనియె .

అప్పా! పాదుషాగారివృత్తాంతము నీ వెరింగినచో నిట్లనవు. భూమండలమంతయు నతనిదేసుమీ? ఈ రాజులెల్ల నాయనకుఁగప్పములు గట్టుచుందురు. ఆచక్రవర్తి తలంచకుండిన నేకార్యము సాగకుండెడది. అతనితోఁ బగసాధింప విప్రునికి సాధ్యము గాదు, మీతండ్రికిం జెప్పి వడిగా రమ్ము ప్రత్యుత్తరము వ్రాయవలయు ననుటయు