పుట:కాశీమజిలీకథలు -04.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

దగినయుపాయ మాలోచింపఁ దగినదే. వీనిమాట తీసివేయఁగూడదు. వీరుండిన నెప్పటికైనఁ దెలియక మానదు. మన పెరటిలోనున్న నూఁతిలోవీరిం బడద్రోసితిమేని బ్రహ్మకుఁ దెలియదు రాజ్యలోభంబున నెంతెంతవా రెంతెంత పనులుచేసిరో పురాణములలో మనము వినుచుండలేదా ? యని యుపాయముఁ జెప్పినది.

ఆమాట వినిపించుకొనక యాబ్రాహ్మణుఁ డెక్కడికోపోయెను. తరువాత నాఁటి సాయంకాలమున నాబ్రాహ్మణి విజయభాస్కరుం జూచి నాయనా ! మా పిల్ల లెవ్వరు నింటిలోలేరు. అవ్వలి దొడ్డిలోనున్న నూఁతిలోఁ జేఁదపడిపోయినది. తీసి పెట్టెదవా ? యని యడిగిన నా రాజపుత్రుండు అవ్వా ! దీనికి నన్నింత బ్రతిమాలవలయునా ? దారిచూపుము తీసి పెట్టెదనని చెప్పెను. అప్పు డా బ్రాహ్మణి విజయభాస్కరుని మిక్కిలి యగాధమగు పెరటిలోని నూఁతియొద్దకుఁ దీసికొని పోయినది. రాజకుమారుం డందు దొంగిచూచుచు అవ్వా ! చేద గనఁబడలేదు. నీళ్ళు లోఁతుగానున్నవి. గాలము గావలయునని పలుకుచుఁ జూచుచున్న సమయంబున నంతకు మున్న యందు వేచియున్న నిగమశర్మ వచ్చి యారాజపుత్త్రుని రెండు పాదములు పట్టుకొని యెత్తి నూఁతిలోఁ బడద్రోసెను.

అప్పుడా బ్రాహ్మణి చారుమతి యొద్దకఱిగి “అమ్మా! మీపిల్లవాఁడు చేఁద తీయబోయి కాలుజారి నూఁతిలోఁ బడియెను. నాకేమియుం దోచకున్నది. తీయుదువు గాని రమ్మని" పలికిన నాయిల్లాలు ఉల్లము ఝల్లుమన గుండెలు బాదుకొనుచు నెక్కడెక్కడనని యడలుచు నానూఁతియొద్ద కరిగి తొంగిచూచుచుండ నిగమశర్మ చాటున నుండి వచ్చి యీసాధ్వీరత్నమునుగూడ పాదములుపట్టుకొని నూఁతిలోఁ బడవేసెను. దుర్జనులకుఁ జేయరాని కృత్యములుండవు. రాజపుత్త్రుఁడు. మొదట నూఁతిలోఁబడి మునుంగక యందువ్రేలాడుచున్న మఱ్ఱిమొక్క పట్టుకొని నూఁతిగోడంజేరి నిలువఁ బడియుండెను. ఇంతలోఁ జారుమతి నూఁతిలోఁ బడినది. అతండా సంగతి గ్రహించి తల్లి యని నిశ్చయించి మునుఁగనీయక చేతులతోఁ దరిమి పట్టుకొని లేవనెత్తి అమ్మా ! నీవు వెఱవకుము. మనకుఁ భ్రాణభయములేదు. ఆ బ్రాహ్మణుల కపటము దెలిసికొన లేకపోయితిమి. మనము రాజుతో నిక్కముఁ జెప్పుదుమని మనల వీరిట్లు చేసిరి. కానిమ్ము భగవంతుఁడే మనల రక్షించును అని యోదార్చుచు మునుపు చదివిన శ్లోకమునే మఱలఁజదివెను.

క. గిరియెక్కి పడిన ధర సా
   గరమున మునిఁగినను బావ • కముఁ జొచ్చిన భీ
   కరపణులతోడ నాడిన
   మరణ మకాలమున రాదు . మహినెవ్వనికిన్.

తగినట్లు నూఁతిలోఁ బడద్రోసి నిగమశర్మయుఁ దల్లియు నాపెరటి తలుపుపైచి లోపలికిఁ బోయి యిఁక మన గుట్టు తెలియఁజేయువారు లేరు.