పుట:కాశీమజిలీకథలు -04.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

దుస్తులు ధరించి రాజపుత్రిక నొక యందలముపైఁ గూర్చుండ బెట్టుకొని విజయభాస్కర దత్తంబగు ఖడ్గంబు చేతం బూని యా యందలము ప్రక్కనడచుచు గంభీర స్వరంబునఁ దస్కరులఁ బరమార్చి రాజపుత్రికం దెచ్చితినని పలుకుచు జూచువారి కచ్చెరువు గలుగఁ జేయుచుఁ సత్వరముగాఁ జంద్రగుప్తుని యాస్థానమున కరిగెను.

ఆ రాజు చారులవలన నెవ్వఁడో బ్రాహ్మణ కుమారుండు తనపుత్రికను దీసికొనివచ్చుచున్నాఁ డను వార్త విని యపరిమితానందము జెందుచుఁగొంతదూర మెదురు వచ్చి యందలములోనున్న కొమార్తెం జూచి కౌఁగిలించుకొని వియోగ దుఃఖ మభినయించుచుఁ బెద్ద తడవు మన్నించి ముద్దుపెట్టుకొని తరువాతఁ దల్లిం జూచుటకై యా యింతి నంతఃపురమున కనిపెను.

పిమ్మటఁ జంద్రగుప్తుడు నిగమశర్మను మిక్కిలి గౌరవింపుచు విప్రకుమారా నీ పేరేమి ? కాపురం బెచ్చట ? నీవీ బాలిక నెక్కడ గనుగొంటివి ? దొంగలేమైరి ? చౌర్యవస్తువు లేమైనవి ? వారినెట్లు పరిభవించితివి ? చేసిన పనులన్నియు సవిస్తరముగాఁ జెప్పి నా కానందము గలుగజేయుమని యడిగిన నవ్విప్రకుమారుం డిట్లనియె.

దేవా ! నేనుత్తర దేశము నుండి వచ్చుచుండ నొక యరణ్యములోఁ గొందఱు దొంగలు నాకెదురు పడిరి. వారిలో నొకఁడు భర్తృ దారిక నెత్తుకొనియుండె తక్కిన వాండ్ర నెత్తిమీఁద ధనము మూటలున్నవి. వారింజూచి నే నట్టహాసము జేయుచు మీరెవ్వ రెందుఁబోవుచున్నారు ? నిలువుండని యదలించితిని. నా పలుకులకు వాండ్రుబెదరి యమ్మదవతినటదించి తలయొక దారింబాఱిపోయిరి అప్పుడునే నీబాలిక నెత్తుకొని మనవీటికిఁ జనుదెంచితిని. నా పేరు నిగమశర్మ యండ్రు నా కాపుర మీ పురమే యని యెఱింగించెను.

వాని మాటలు విని యారాజు సంశయాకులిత హృదయుఁడై యొక్కనిం జూచి పదుగురు వెఱచి పారిపోవుదురా ? దీనిలో నేదియోవ్యత్యాసమున్న దని యాలోచించి ఆర్యా ! నీ కీ ఖడ్గమెక్కడిది? యింతకుమున్ను నీవు సాముఁ జేసియుంటివా ? నీవు కదురు త్రిప్పగలనా?" యని యడిగిన నతండు "నేను సాముఁ జేయలేదు గాని కదురు త్రిప్పగలను. తఱచు జన్నిదములు వడుకుటచే నలవాటు పడినది ఆ దొంగలలో నొకఁడు బెదఱి యీ కరవాలము నేలం బాఱవైచిపోయె. నేను స్వీకరించితి" నని చెప్పిన నవ్వుచు రాజు అయ్యో ! కదురనఁగా నదికాదు. బాకు అని చెప్పి యా ఖడ్గము పుచ్చుకొని చూడ నందు 'విక్రమాదిత్య ' అని విలాసమున్నది. ఇది చోరుల యొద్దనుండు ఖడ్గము కాదు. రక్షక పురుషులు ధరియించునది. విక్రమార్కుని విలాసము దీనిపై నున్నది. దీని గుఱించి విమర్శింప వలసి యున్నది. ముందు నీకుఁ దెలియ జేయుదుము.

ప్రస్తుత మింటికి దయసేయుఁడని పలికి కొంత పారితోషిక మిచ్చి యశ్వ