పుట:కాశీమజిలీకథలు -04.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిగమశర్మ కథ

149

బ్రాహ్మణి - అంత మహానుబావుండా ?

బ్రాహ్మణుఁడు - అది యొకటియేనా ? మఱియొకటి వినుము వాని భార్యయుఁ బుత్రుండును మంచి గుణములు గలవారు. అర్ధుల పరితాపము వినలేక యా యిల్లాలు పుత్రునిచేత రహస్యముగా ధనము పంచి పెట్టించినది. ఆగుట్టు తెలిసికొని యా పాపాత్ముఁడు వారిరువురను జంపించెనఁట.

బ్రాహ్మణి - శివశివా ! యెంత కఠినాత్ముఁడో కదా ! తఱచు మంచి వాండ్రకుఁ జెడ్డబిడ్డలు పుట్టుచుందురు.

బ్రా - నా కెట్టివాండ్రు పుట్టితిరో చూచితివా? ఆలాగుననే-

బ్రాహ్మణి - (నవ్వుచు) అవును. మీ పాటి విద్యా గుణములు మీ పిల్ల లయందు లేవు. మీరే చెప్పుకొనవలయును.

అని యా దంపతులు మాటలాడుకొనుచు గొంతసేపటికి నిద్రఁబోయిరి. ఆ మాటలన్నియు విని విజయభాస్కరుఁడు వారి దారిద్రమును గుఱించి మిక్కిలి పరితపించుచు "అయ్యో ! ఆ చోరుల యిండ్ల లోనుంచి కొంత ధనమైనం దీసికొనివచ్చితిని గానేమి ? దాని వలన వీరుదృప్తిఁ బొందుదురుగదా ? ఇప్పుడు వీరికి నే నేమి చేయగలను ? వీరి దారిద్ర్య మెట్లుపోవు ? నని ధ్యానించుచు నెట్టకే నా రాత్రి గడపెను.

మఱునాఁడు ప్రాతఃకాలమునఁ దల్లి తో వారి సంవాదమంతయుం జెప్పి వీరి దారిద్ర మెట్లుపోవునని యలోచించున్న సమయంబున వీధిలో నెద్దియో చాటింపు వినంబడినది. అది యేమి యని రాజపుత్రుఁ డాయింటి బ్రాహ్మణు నడిగిన నాపాఱుం డిట్లనియె.

మా పట్టణపు రాజుగారి కోటలోఁ గొన్ని దినముల క్రిందట దొంగలు ప్రవేశించి యెక్కుడు రొక్కముఁ దస్కరించుటయే కాక పదిరెండేఁడుల ప్రాయము గల యమ్మహారాజు కూతురు కలభాషిణిని దీసికొని పోయిరి. ఆ చిన్న దానిం దీసికొనివచ్చిన వానికిఁ బుత్రికతోఁ గూడ రాజ్యము నర్పింతునని మా రాజు చంద్రగుప్తుఁడు చాటింపించుచున్నాఁడు. ఇదియే దీని వృత్తాంతమని పలికిన విని యా నృప కుమారుఁడు సంతోషించుచుఁ దల్లి యనుమతి వడసి యా బ్రాహ్మణుని చెవిలో నేదియోచెప్పెను.

అప్పు డాపాఱుం డపార ప్రమోదకూపారంబున మునుంగుచు "గుమారా ! నీ యౌదార్య మార్యజనస్తోత్రపాత్రంబై యున్న యది నీ పేరు స్మరించుకొని చిరకాలము మేము సుఖింతము. మదీయ దారి ద్రాంధకారమునకు నీవు లోకబాంధవుండ వైతి" వని పెక్కు తెరంగుల వినుతింపుచుఁ బెద్దకుమారునిం బిలిచి వానికిఁ జేయఁ దగిన కృత్య మంతయు బోధించెను. నిగమశర్మ యను పేరంబరఁగు నా విప్ర కుమారుండు తండ్రి మాటలన్నియు విని యుబ్బి గంతులు వై చుచు నప్పుడే మంచి