పుట:కాశీమజిలీకథలు -04.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చారుమతియుఁ గలభాషిణియు నిదురించిరి. విజయ భాస్కరుఁడు ఖడ్గపాణియై నిద్రఁ బోవక యందొక దెసఁ గూర్చుండియుండెను. అప్పు డాయింటి బ్రాహ్మణుఁడును బ్రాహ్మణియు నిట్లు వాదించుకొనిరి.

నిగమశర్మకథ

బ్రాహ్మణి - నాధా ! మనకు డెబ్బదియేండ్లు నిండవచ్చినవి. ఇంటి నిండ సంతానము గని పాఱవై చితిమి. ఒక్కరికిని బెండ్లికాలేదు. ఇల్లుచూడఁ గడు నిప్పచ్చరముగా నున్నది దినదినము గండమగుచున్నది. మీరు వీధిలోనికింబోయి యేమియు సంపాదనఁ జేసికొని రాలేరు గదా ? ఆడుదాని వలె నా కెదురుగా నింటిలోఁగూర్చుండి కబురులు చెప్పుదురు. ఈ కాపుర మెట్లు జరుగును ?

బ్రాహ్మణుఁడు - నీవు కొడుకుల నేమియు ననక నన్నే సర్వదా కొఱికి కొని తినుచుందువు. ఒక్కనికైఁన జదువు సంధ్య లంటినవియా ? ఆఁబోతువలెఁ గుడిచి యూరువెంబడి దిరుగుచుందురు. నే నేమి చేయుదును ? ఒంటిఱెక్క మీఁద నీ కాపుర మెన్నాళ్ళీడ్చుకొని రాఁగలను. తినుటకు గడుపునిండ నన్న ముండినం గదా పెండ్లి మాట యాలోచించుకొనుట : నీ మూలముగనే కొడుకు లందఱు పఱమ నిర్భాగ్యులై పోయిరి.

బ్రాహ్మణి - మీరెప్పుడు వాండ్రనే తిట్టుచుందురు. ఇంతకన్న మఱేమియుం జేతఁగాదు. తెల్ల వారినంత దద్దినము. పిల్ల లకుఁ బురిటి దినములు. చేతఁ గా సైనను లేదు. అబ్బా ! యీ సంసార సాగరమెట్లు తరించుదాననో తెలియదు.

బ్రాహ్మణుఁడు - నన్నేమి చేయమనెదవు ? నాశక్తికొలఁదిఁ దిరిగి ముష్టి యెత్తుకొని వచ్చుచునే యుంటిని. పలువుర నొక్కఁడు పోషించఁగలఁడా ? ఎక్కడికిఁ బోయినను పెద్దమ్మ యెదురు వచ్చుచున్నది.

బ్రాహ్మణి - ఈ నడుమ వెంకటసోమయాజులు యజ్ఞము చేయుదునని చెప్పి దేశాటనముఁ జేసి యెంత ద్రవ్యము సంపాదించికొని వచ్చెను? మగవానికిఁజెప్ప వలయునా ?

బ్రాహ్మణుఁడు - అవును. అప్పటికి వితరణగుణ సాగరుండగు విక్రమార్క మహారాజున్నాఁడు కావున నతని డబ్బరలు సాగినవి. అప్పుణ్యాత్ముండు స్వర్గస్థుఁడయ్యెను. ఇప్పుడాలాగున నిచ్చువాఁ డెవ్వడునులేఁడు.

బ్రాహ్మణి – ఆయనకుఁ బుత్రులు లేరాయేమి ?

బ్రాహ్మ - ఒక పరమ నిర్భాగ్యుఁడున్నాఁడు. తెలియక కొందఱీనడుమ వాని యొద్ద కరిగి యెద్దియో యాచించిరఁట. అప్పుడు చోరులవలె వారిం పట్టుకొని చెఱసాలలోఁ బెట్టించెనఁట. నేనుఁ బోయిన నట్లేయగును.