పుట:కాశీమజిలీకథలు -04.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యున్నది. ఆ చిన్నదాని చక్కఁదనముఁ జూచి యతండు మిక్కిలి యక్కజము జెందుచు నౌరా ! యీ యమ్మవారు చోరులు దయమాలి చక్కని బాలికందెచ్చి తనను బలి యిచ్చుట కుద్యోగింప వలదని వారింపక నోరు దెఱచుకొని పెద్దపులివలె మిట్టి గ్రుడ్లతోఁ జూచుచున్న దే : కృపావిహీనయగు నీమె గౌరవ మెవ్వరికిఁ గావలయును. ఈ శక్తిం బరిమార్చినచో వీండ్రి క్రూరకృత్యములు చేయకుందురుగదా ? మూఁడు లోకములుఁ బాలించు మహాశక్తి కీ తుచ్ఛగుణ మేమిటికిఁ బుట్టవలయును ? ఆకులలములు దిని పొట్ట నిండించుకొనరాదా ? యని కోపము జెందుచుఁ గరవాలము --- పించుచు నయ్యమ్మవారి కంఠ ముత్తరింప సత్వరముగాఁ బై కుఱికెను.

వత్సా ! వలదు వలదు. దేవతాద్రోహముఁజేయకుము. నీసాహసముమెప్పు గలుగ జేసినది. ఇంతటినుండి బఱు లంగీకరింపను. రక్షింపుమురక్షింపుము. కందమూల ఫలాదులే భక్షించుచుండెదను. అను మాట యొకటి వినఁబడినది రాజపుత్రుం డామాట విని కరవాలము నేలఁ బాఱవైచి చేతులు జోడింపుచు "దేవీ ! నీవు త్రిలోక పూజ్యురాలవు. నే నపరాధము గావించితిని. నిన్ను రక్షించుటకు నే నెంతవాఁడను ? ఇంతటి నుండి బలు లంగీకరింపనని నాకు వరమిమ్ము. దయమాలి మృగము భాతి మాంసము భక్షించుటకు నీ బోఁటికిఁ దగునా ? యని పలికి యట్టి వరమిచ్చితి ననుమాట విని సంతోషించుచు వెండియు ఖడ్గము ధరించి తనగ్రంబున గొలుసు ద్రెంచి యా బాలిక సంకెళ్ళు విప్పి చేయి పట్టుకొని మెల్లఁగా బాలా ! బైటికిఁ బోవుదము రమ్ము జాగు జేసితివేని జోరులు వచ్చి పట్టుకొనెద రని పలికిన విని యక్కలికి యంతకుమున్న మేల్కొని తన కథయంతయు స్వస్నోపగమం బని తలంచి నలుమూలలు చూచు చున్నది. కావున నా రాజపుత్త్రుని మాటలు విని తటాలున లేచి యతని వెంట నడువఁ జొచ్చినది ఆపద నొందిన వారెవ్వరించుక యూత యిచ్చినను వారి ననుసరించుట సహజము కదా : ఆ రాజనందనుఁ డయ్యిందువదన చే యొక చేతిలోఁ బట్టుకొని రెండవచేత వాలుదాల్చి యా భవనము గడచి మెట్లెక్కి వెనుకటి పుడమి కరుదెంచెను.

అప్పటికిఁ దెల్ల వారినది. ఈ లోపలఁ జారుమతి లేచి ప్రక్కలో గుమారుని గానక పరితపించుచు నలుదెసలం బరికింపుచు మృగములు భక్షించెనేమో : యట యడలుచు విజయ భాస్కరా ! యని పెద్ద యెలుగునఁ బిలువఁదొడంగినది. అంతనీ వెఱవకుము. ఇదిగో వచ్చచున్నవాడనని ప్రతివచన మిచ్చి యతం డచ్చిగురుబోడితోఁ గూడ మాతృపాదమూలమున కరిగి నమస్కరించెను. అప్పు డామె పుత్రుం గౌఁగిలించుకొని "తండ్రీ యెందు బోయితివి. యీ బాలిక యెవ్వతె ? అయ్యో ! నిన్నుఁగానక యమంగళము శంకించుకొంటిని గదా ? అబ్బా ! నా హృదయ మెట్లు కొట్టుకొనుచున్నదో చూడుము బాబూ ! యీ శోకము శత్రువులకైనరావలదుకాక ?" యని పలికిన కుమారుం డిట్లనియె. అమ్మా ! నీవు మొదటి మాట మఱచిపోయి యూరక పరితపించుచుండెదవు ? నీవు నిద్రబోయన తరువాత ఖడ్గపాణినై నేను నిదు