పుట:కాశీమజిలీకథలు -04.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

ఆమాటలు విని యాబోటి నేలంబడి మూర్ఛఁబోయినది. కుమారుండు సేదఁదేర్చి అమ్మా ! వీరిమాటలువిని నీవిట్లు మోహమందెదవేల ? నేను నేఁటి యుదయమునఁ బాఠశాలలోఁ జదివిన శ్లోకమును వినిన నీకు వైరాగ్యము గలుగక మానదు. వినుము.

శ్లో॥ రోగశోకపరితాపబంధనవ్యసనానిచ
      ఆత్మాపరాథవృక్షాణాం ఫలాన్యేతాని దేహినాం॥

శోకము, మోహము బంధనములలో నగు వ్యసనములు తాను గావించిన యపరాధములను వృక్షముల ఫలములని తెలిసికొనుము వాని ననుభవింపకతీరదు.

తానుజేసిన కర్మయే తన్ను శిక్షించును. తన కర్మయే తన్ను రక్షించును. ఒరులెన్నడును గర్తలుగారు. లోకప్రవృత్తి యెఱింగియు నిట్లు చింతించుట యవివేకము కాదా ? మఱియు వినుము.

శ్లో॥ నిపపతు శిఖరా దద్రేర్మజ్జతు జిలధౌ హుతాశనం
      విశతుక్రీడతు భుజంగమై ర్వా నాకాలెకస్యచి న్నారళః॥

క. గిరి యెక్కి పడిన ధర సా
   గరమున మునిఁగినను బావ • కముఁ జొచ్చిన ధీ
   కరఫణులతోడ నాడిన
   మరణకాలమున రాదు . మహి నెవ్వనికిన్.

అని యుపదేశించిన కుమారుని వివేకవచనమునకు మిక్కిలి వెఱఁగు పడుచుఁ జారుమతి ధీరమతియై మాఱుమాట పలుకక శోకముపసంహరించుకొని పెండ్లికిఁ బోవునట్లు సంతోషింపుచుఁ గుమారునితోఁ గూడఁ గింకరనిర్దిష్టమగు స్యందన మెక్కినది. రాజభటు లర్దరాత్రంబున నొరులెఱుఁగకుండ వారిం గాంతారమునకుం దీసికొనిపోయి దుఃఖముతో రాజశాసనముఁ బూర్తిగా జదివి వినిపించిరి. అప్పుడు చారుమతి ధైర్యమాపఁజాలక మోహ మందుచు "అయ్యో ! నాముద్దులపట్టి మరణము నేను జూడజాలను. నన్ను ముందు వధింపుఁడు" అని కుమారు నక్కునం జేర్చుకొని కన్నీటిచేఁ శిరంబు దడుపుచు శిరము మూర్కొని ముద్దాడి తండ్రీ ! యిది కడపటి ముద్దుంగదా ? యిఁక నిన్నుఁజూచు భాగ్యములేదు.

అక్కటా ! నీ సుగుణంబులు మీతండ్రి కెంత విపరీతములుగాఁ దోచినవి? మనము పూర్వజన్మమునం దెట్టిపాతకము గావించితిమోకదా ! ఆహా ! మీతాతయే యుండిన నీ సుగుణంబుల కెంత మెచ్చుకొనునో ? యెంత గారాబముగాఁ జూచునో? యని యనేక ప్రకారముల విలపించుచుండ వారించుచుఁ గుమారుండు మందహాస శోభితవదనారవిందుఁడై అమ్మా : వినశ్వరంబగు నీ కళేబరంబున నాస్త విడువుము. "కానున్నది కాకమాన"దను నిశ్చయమే మనంబునఁ గలిగియున్న విచారమేల యుండెడిది. పోనిమ్మని పలికి కృతము నేఱవేర్చుకొనుఁడని కింకరుల కానతిచ్చెను .