పుట:కాశీమజిలీకథలు -04.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలభద్రుని కథ

133

లని విని యతండు మిక్కిలి సంతోషించుచుఁ దదీయ శౌర్య సాహసాది గుణంబులఁ బలు తెఱంగుల నగ్గించెను.

పిమ్మట వారి నగరికిం దీసికొనిపోయి సుగుణసాగరుండు తండ్రితో నా వృత్తాంత మంతయుం జెప్పెను. విక్రమ సేనుండు మొదట సుభద్ర వలననే తన కులము నిలిచినదనియు నిప్పుడు సైత మాచేడియ మూలమున బలము నిలిచినదనియు బలుకుచు నా యింతిని వారిని నెక్కుడుగా శ్లాఘించెను. మునుపటి కంటె నెక్కుడు వైభవముగా నా వివాహ శేషము జరిగించిరి. బలభద్ర కృష్ణుల భార్యల నిరువుర నచ్చటికి రప్పించి. వారి వృత్తాంతమంతయు విని యచ్చటి ప్రజలు మిక్కిలి యబ్బురముఁ జెందుచుఁ గీర్తనలుగను బద్యములుగను బాటలుగను వారి చరిత్రము రచించి గానముఁ జేయుచుండిరి. మిగుల వైభవముతోఁ గొన్ని దినములచ్చటఁ గడిపి వారు తమతల్లి దండ్రులు తమ కొఱకు విచారింపుచుందురని తలంచి చిత్రసేను ననుజ్ఞగొని సుగుణసాగరుఁడు తోడరాఁ జతురంగ బలపరివృతులై కతిపయ ప్రయాణంబుల దేవ దుర్గపురంబునకుం జనిరి. అందు బుధవర్మ పుత్రుల జాడఁ దెలియక చింతాకులస్వాంతుండై భార్యతోఁ గూడికొని సదాశివయోగి యను మహాయతీశ్వరుని చెంతఁ దత్త్వోపదేశములఁ బొంది వైరాగ్య ప్రవృత్తితోఁ గాలక్షేపముఁ జేయు చుండెను. అట్టి సమయంబునఁ దనబిడ్డలు ఘనవైభవముతో వచ్చిరను వార్త విని బ్రహ్మానందముఁ జెందుచు వారి నెదుర్కొనుటయు భార్యలతోఁ గొడుకులుసు భర్తతోఁగూతురును నతని పాదంబులఁబడి నమస్కరించిరి వారినెల్ల గ్రుచ్చి యెత్తి వేఱు వేఱ వారి వారి వృత్తాంతము లడిగి తెలిసికొని సంతోష విస్మయంబులు మనంబునం బెనఁగొనఁ దత్సుగుణ సంపత్తి నభినందించెను. మఱియు వారెల్ల దాము గ్రామము విడిచినది మొదలు నాఁటి తుదివఱకు జరిగిన కథయంతయుఁ బూసగ్రుచ్చినట్లు తల్లి దండ్రులకే కాక చూడ వచ్చిన పౌరులకెల్ల వక్కాణించుచు దైవమాయ నెవ్వరు నతిక్రమింపలేఁరని సిద్ధాంత పరచిరి.

పిమ్మట బుధవర్మ కుమారుల చరిత్ర విని తన గురువగు సదాశివ యోగిని రప్పించి పుత్రుల నతని పాదంబుల బడవైచి మహాత్మా వీరు నా పుత్రులు. హరిహర శక్తి దేవతాతారతమ్యముఁ దెలియఁగోరి నాకు దెలియకుండఁ దీర్థయాత్రలు సేవింప బోయిరి. అందుఁ దమ కేమహిమయుఁ గనంబడమి దైవంబుల నిందించిరి. ఆ రాత్రి మహాంధకారములో బడి చింతింపుచు నొక బిలములోఁ బడిపోయిరఁట. అందు మువ్వురకు మూఁడు వింతలు గనఁ బడినవని యా యుదంతమంతయు జెప్పి యోగీంద్రా ! యిట్టి వింత లెందును గనివిని యెఱుంగము. అది యట్లుండ నిమ్ము. ప్రవాహములో శంఖచక్రాది సాధనధరులైన వైష్ణవులు వేనవేలు కొట్టుకొని పోవుచున్న ట్లొకనికి జంఝామారుతములోఁ ద్రిశూలధారులైన మహేశ్వరులు కొట్టుకొనిపోవుచున్న ట్లొకనికి మహాగ్నిజ్వాలలో మహాశక్తులు మువ్వురు బిడ్డలఁ జంకనిడికొని యెగిరిపోవు చున్నట్లు