పుట:కాశీమజిలీకథలు -04.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పరితపించుచున్న దాననని పలుకుచుండుఁగనే బలభద్రుఁడు గుఱ్ఱము దిగి యమ్మగువ నక్కునం జేర్చుకొని గారవింపుచు నిట్లనియె.

చెల్లీ! కృష్ణుండు నీ వృత్తాంతము కొంతఁ జెప్పెను. అతని విడిచిపోయి నీ వెందెందుఁ దిఱిగితివి? ఏమి చేసితివి? ఇచ్చటి కెట్లు వచ్చితి? నీ వృత్తాంతముఁ జెప్పమని యడిగిన నత్తన్వి తాను బ్రహ్మరాక్షసుని చేతిలోఁ బడుటయు నతని కనుగ్రహము వచ్చుటయు, మందసము గోరికొనుటయు నందు సుగుణసాగరుని రక్షించుటయు లోనగు వృత్తాంత మంతయుం జెప్పి మఱియు నిట్లనియె. అన్నా! సుగుణసాగరుడు నన్నుఁ బురుషుండనుకొని నేను తనకుఁ గావించిన యుపకృతికిఁ గృతజ్ఞతఁ జూపుచు నన్ను సగౌరవముగాఁ దన వీటికి దీసికొని వచ్చెను. మేమీయూరుకు చేరువఱకుఁ బ్రజలందఱు దల్ల డిల్లు చుండిరి బ్రహ్మరాక్షసుఁడు రాజపుత్రు నెత్తుకొని పోయెనను వార్త విని యతని తల్లి దండ్రులు సామంతరాజులు మొదలగు వారెల్ల నిద్రాహారములు మాని పరితపించుచుండిరి. అట్టి సమయమున మేము పట్టణములోఁ బ్రవేశించిన తోడనే రాచపట్టిని గుఱుతు పట్టి ప్రజలెల్ల మూగికొని యెక్కుడుగా నానందింపుచు ముందువోయి రాజుగారి కెఱింగించిరి. అప్పుడు నా వలన నతండు బ్రతికెనని విని యచ్చటిఁ బ్రజలు నన్ను దైవముగాఁ జూచుచుఁ బూజింపుచుండిరి. తల్లి దండ్రుల మాటఁ జెప్పనేల? అట్టి వైభవముతోఁ గొన్ని దినములు గడిపి గుట్టుపట్ట జాలక యొకనాఁడు నా వృత్తాంతమంతయు నీ రాజకుమారుని కెఱింగించి నా యభిప్రాయము వెల్లడించితిని. అతండు మితిలేని సంతసముతో నన్ను మన్నించుచుఁ దండ్రి కెఱింగింపుచు వివాహసన్నాహము గావింప నియోగించెను. దానం జేసి పట్టణమంతయు నలంకరించిరి. ఉత్సవములకు మితిలేదు. నేఁటికి వివాహము జరిగి నాలుగు దినములై నది హృదయమున మీ కొఱకుఁ బరితపించుచునే యుంటిని. ఇంతలో దైవయోగంబున మీరే యిచ్చటికి వచ్చితిరి. దైవమాయ యిట్టిదని తెలియ బ్రహ్మాదులకు శక్యము గాదు. మనకుఁ దెలియునా? చిన్నతనమున నెఱుంగక యట్టి పనికిఁ బూనుకొంటిమి. దానం జేసియే యమ్మహాత్ముఁడు మన కిన్ని చిత్రములు చూపెనని యా కథ యంతయుం జెప్పినది. తరువాత బలభద్రుండు వారు గాంచిన చిత్రములు వారు పొందిన మోహము లోనగు చర్యలన్నియు జెప్పెను. అప్పుడు సుగుణసాగరుని బంధవిముక్తునిఁ జేసి బలభద్ర గృష్ణులు మన్నించుచుఁ దమ వృత్తాంత మంతయుం జెప్పిరి. వారి కథ విని యతండును వెఱఁగు పడియెను.

ఆ వార్త ముఖాముఖిగాఁ బట్టణమంతయు వ్యాపించినది. వారి బలపరాక్రమములు పౌరులెల్లరు నాశ్చర్యముగాఁ జెప్పుకొన దొడంగిరి. సుభద్ర తనయన్నలు సేసిన పరాభవము మన్నింపుఁడని సుగుణసాగరునిఁ బార్ధించినది. వారు తన స్యాలకు