పుట:కాశీమజిలీకథలు -04.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలభద్రుని కథ

131

వేగమం బాడి పసుపుబట్టలతోనే గుఱ్ఱమెక్కి కరవాలాది సాధనంబులు ధరించి చతురంగబలములు సేవింప సంగరమున కరిగెను.

కృష్ణార్జునులకుం బోలె సుగుణసాగరునకును బలభద్రునకు నద్భుతమైన ద్వంద్వయుద్ధము జరిగినది. వారొండొరుల నేయు నేరుపు, కాచుకొను పాటవము, పొడుచు ప్రవీణత, తప్పించుకొను నైపుణ్యము, లంఘించు లాఘవము, గతిచాతుర్యముఁ జూచి చూపఱులు మిక్కిలి యగ్గించిరి.

వారలట్లు ఘోరంబుగఁ బోరుచుండ సుగుణసాగరుని గుఱ్ఱము ముందరి కాలునకుఁ గత్తిపోటు దగిలి యది నేలం గూలినది. దానంజేసి యతండు సంగరదమను డగుటయు బలభద్రుండు సమయ మరసి పెండ్లికొడుకు గావున జంపనిష్ట పడక పట్టుకొని పెడకేలు గట్టి కృష్ణుని వశముఁ జేసి యున్న సైన్యమునెల్లఁ పరాజయము నొందించెను. హతశేషుల వలన సుగుణసాగరుఁడు పట్టుబడెనను వార్త విని యతని భార్య పెండ్లికూఁతురు మిగులరోషముఁ దెచ్చుకొని గంధమాల్యాలంకారములు దీసి కాశికోకలు బిగియించి కరవాలాది సాధనంబులు ధరియించి మించిన సంభ్రమముతో నశ్వారూఢయై రణభూమి కరుదెంచి విచిత్రగతులతో దన గుఱ్ఱ మును నడిపింపఁ జొచ్చినది.

తద్గతివిశేషంబు లరసి బలభద్రుండు విస్మయము నొందుచుఁ గృష్ణనితోఁ దమ్ముఁడా! రాచబిడ్డల పౌరుష మెట్టిదో చూచితివా? ఈ చిన్నది వీని భార్య కాఁబోలు? పాపము వివాహాంతరముననే సాంపరాయకము తటస్థించినదే? యీచేడియ బవరంబుల గడితేరినట్లు తోఁచుచున్నది. కాచికొని యుండుమని పలుకుచు నా యువతితోఁ గలియబడి పోరుగావింపఁ జొచ్చెను.

విచిత్రప్రహరణంబుల నా యిద్దఱు పెద్దతడవు దురము గావించిరి. కాని యెవ్వరికిని నోటును, గెల్పును గలిగినది కాదు. అప్పుడొండొరుల మెచ్చికొనుచుఁ బోరు సాలించి నిలువంబడిరి అప్పుడు బలభద్రుండు సాధ్వీమణీ! నీవెవ్వని కూఁతురవు? నీ పేరేమి? నీవీ విద్య యెవ్వని యొద్ద నేర్చుకొంటివి? మా గురువే నీకీ విద్య నేర్పినట్లు తోఁచుచున్నది. కానిచో మదీయప్రహరణంబులకు నాగ నొరులకు శక్యమా? యని పలికిన నక్కలికి యిట్లనియె. సౌమ్యా! నీవు కృష్ణా యని పిలుచుచున్నావు. అతండు నీ తమ్ముఁడా యేమి? అట్లయిన నీపేరు బలభద్రుడు కావలయును. ఆ మాట సత్యమేయైనచో నా వృత్తాంతము జెప్పెదనని పలికినఁ గంఠధ్వని గుఱుతుపట్టి మా ముద్దుచెల్లెలు సుభద్రా యేమి? అవును సందియములేదు. కానిచో నీ యుద్దనైపుణ్యము మఱియొకరికి రాదని వక్కాణించెను.

అప్పుడా చిన్నది గుఱ్ఱము డిగ్గనుఱికి యాయుధములఁ బాఱవైచి అన్నలారా! మీరా! ఆహా! నా భాగ్యమేమని చెప్పఁదగినది. మీ జాడ దెలియలేదని