పుట:కాశీమజిలీకథలు -04.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వాండ్రు "మాది మధుమన్నగరము. వీఁడేమి తప్పుజేసెనో మాకుఁ దెలియదు. మేము జెఱసాల గాచియుండ మమ్ము మఱపించి పారిపోయి వచ్చె "నని యా వృత్తాంతము జెప్పిరి. అప్పుడు కృష్ణుండు మిక్కిలి సంతోషించుచు నతనితో నీ వేమి నేరముఁ జేసితివని యడుగఁగా నతండు బలభద్రుని గుఱుఁతుపట్టక "అయ్యా! నే నేమియు నేరము చేయలేదు. నిరపరాధుని బట్టుకొని యీ పట్టణములో బాధింపుచున్నారు. ఇంత యన్యాయ మెందైనం గలదా?" యని యా కథ యంతయుం జెప్పెను.

అప్పుడు బలభద్రుఁడు నిలువలేక తమ్ముఁడా! నీ విట్లు చిక్కుల బడుచున్నావా? అయ్యో ! నీ కొఱకు నేను బలుదేశములు తిరుగుచున్నాను. నేను మీ యన్నను బలభద్రుఁడనని పలుకుచు గుఱ్ఱము దిగి యతనిం గౌఁగలించుకొనియెను. అతండును పరమానందముతో నన్నను గౌఁగిలించుకొనియె. నూత్నసమాగమప్రీతి సూచింపుచు నిరువురు మాటాడికొనుచున్న సమయంబున రాజభటులు చటులముగా నలుగుచు బాగు బాగు. మీ నిమిత్తమై మేమిం దెంతసేపు వేచియుందుము. రమ్ము రమ్ము అని కృష్ణుని చేయిపట్టుకొని లాఁగుచుండఁగ బలభద్రుం డలుగుచుఁ గరవాలము దీసికొని యొక వ్రేటున వారి కరములు ఖండించెను. అది చూచి యున్నవారెల్లఁ దల్లడిల్లుచు బాఱిపోయి యా దారుణము చమూపతి కెఱింగించిరి. అతండు పలువురు భటులతోఁ గూడుకొని వారిఁ బట్టికొనుటకై యరుదెంచెను. ఈ లోపున రాజకుమారు లిరువురు యుద్దసన్నదులై కరంబునఁ గరవాలంబుల ధరించి భయంకరాకారములతో నలుదెసలు దిరుగుచుండిరి. సేనానాయకుఁడు వీరిం బట్టుకొనుటకుఁ బ్రయత్నముఁ జేయుచు నాయుధములఁ ద్రిప్పుకొనుచు వచ్చినంజూచి రాజపుత్రు లిద్దఱు త్రుటిలో వారినెల్లం గడతేర్చి వారి యాయుధంబుల లాగికొనిరి. ఆ ఘోరకృత్యముఁ జూచి పౌరులెల్లఁ దల్లడమందుచు వారికి భయపడి తలుపులు వైచికొని దాగికొనుచుండిరి.

అప్పట్టణాధిపతియైన విక్రమసేనుఁ డా వార్త విని వెఱఁగుపడుచు సేనల నెల్లనంపి వారింబట్టుకొని తీసికొని రండని నియమించెను. భేరీభేంకారాదినినాదములతో నబ్బలములు మూఁగికొని పోరొనరించుటయు నయ్యిరువురు తురగారూఢులై కరవాలంబులఁ ద్రిప్పుచు విచిత్రగమనంబుల నరిగి యరిబలంబునెల్ల చీకాకు నొందించి ముహూర్త కాలములోఁ పీనుగుఁ పెంటలు గావించిరి. కాందిశీకులైన తమ వీరుల పరాజయము విని విక్రమసేనుండు మిక్కిలి చింతించుచుఁ దనకుమారుడు సుగణసాగరునిం జేరి "వత్సా! నీవు పెండ్లికుమారుండవై యుంటివి. ఆ వీరు లెవ్వరో తెలియదు. మన బలంబులనెల్ల సదమదంబుఁ జేయుచున్నారు. మన రాజ్యంబు గైకొందురేమో యని వెఱపు గలుగుచున్నది. నేను వృద్ధుండ. యుద్ధము సేయనోప. ఇప్పుడు వారితో సంధిచేయుటయే యుచితమని తోచుచున్నది. నీయభిప్రాయమే మనవుడు. నతండు సమ్మతింపక సీ! మన పరాక్రమమింత యలఁతియే? ఇరువురకు మన మోడినఁ బ్రజలు నవ్వరా? నే నరిగి వారిం బట్టించికొని వచ్చెదఁ జూడుమని