పుట:కాశీమజిలీకథలు -04.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17]

బలభద్రుని కథ

129

గూడినది. ఇంతటిచోద్యము లెప్పుడై నను జరిగినవియా? యని యా వృత్తాంత మంతయు జెప్పినది.

ఆ రాజువిని మిక్కిలి వెఱగుపడుచు వారివురుసంపత్తినిగుఱించి వేనోళ్ళఁ గొనియాడఁదొడంగెను. ఆవార్తయంతయుఁ బట్టణములో వ్యాపించినది జనులెల్ల నద్భుతంబుగాఁ జెప్పుకొనదొడగిరి. రోగము కుదిర్చితిమని పారితోషికములందిన వైద్యులఁ గుఱించి పరిహసింపఁదొడగిరి. రాజకుమారులను మహర్షిప్రాయులని వినుతింపదొడంగిరి.

బలభద్రుండు కొన్నిదినములుమాత్ర మందుండి సోదరుల వెదకు తలంపుతో వారి యనుమతివడసి వీరవేషము వైచుకోని కరతాలకలితహస్తుండై యుత్తమాశ్వ మెక్కి యవ్వీడువెడలి పురవనపక్కణారణ్య భూములచఱయుచుఁ బోయిపోయి యొకనాడు సాయంకాలమునకు విక్రమనగరమునకుం జనియెను అప్పు డాపట్టణము చక్కగా నలంకరింపబడియున్నది. వీథులన్నియుఁ బందిళ్ళు వేయబడినవి. ముత్తెంబుల తోరణంబులుగట్టిరి. రాజమార్గములన్నియుఁ బన్నీటితోడ దడుపఁబడుచున్నవి. బలభద్రుఁడు కడు వీరావేశముతో గుఱ్ఱముతో నరుగుచుండ రాజభటు లడ్డమువచ్చి "అయ్యా యిప్పుడు మారాజుగారి కుమారుని వివాహమగుచున్నది. పురమంతయు నలంకరించిరి. గుఱ్ఱముతో వీథుల నడుచుటకు వీలులేదు. గుఱ్ఱముదిగి పాదచారులై యేగవలయు"నని చెప్పిరి.

వారి మాటల లెక్కఁగొనక బలభద్రుండు నిలువక వారిం దాటి గుఱ్ఱమును దోలికొని వడిగా వీథిలోఁ బ్రవేశించెను. అతని రౌద్రాకారముఁ జూచి పౌరులు వెఱఁగు పడఁజొచ్చిరి. దారిలో రాజభటు లతనింజూచి రాజబంధుడని నిశ్చయించి వారింపలేక పోయిరి. మఱి కొంతదూరము చనినంత నొకచోటఁ బదుగురు గుంపుఁగూడి కలహపడుచుండిరి. బలభద్రుం డాదాపునకు బోయి యాకోలహల మేమని యచ్చటి వారల నడిగెను. వారు “అయ్యా! ఏ దేశమునుండియో తస్కరుఁ డొకఁడు చెఱసాలనుండి తప్పించుకొని పారిపోయి వచ్చెను. వాని వెదకుచు వచ్చి రక్షకపురుషు లీయూర వానిం బట్టుకొనిరి. వాఁడు వారికి లోఁబడక త్రోసివేయుటయు వాండ్రు తమ రాజశాసన మిచ్చటి యధికారులకుఁ జూపి కొందరు రాజభటుల సహాయముగాఁ దీసికొని వానిం బట్టుకొనుచున్నారు. వాఁడు వీరందఱిని దిరస్కరించి పట్టువడకున్నాఁడు. ఇదియే యా కోలహల" మని చెప్పిరి.

ఆ మాట విని బలభద్రుండు "అతండు కృష్ణుం" డని నిర్ణయించి గుఱ్ఱము వారి గలను దాపుగాఁ దోలి వారినెల్ల నిలువుండని వారించుచు నేమిటికి మీరు వాని నిట్లు వెదకుచున్నారని యడిగెను. వీడుఁ దొంగ చెరసాల నుండి తప్పించుకొని వచ్చెను. ఇచ్చట బట్టికొంటిమి. రమ్మన్న మా వెంట రాఁడు. దీనంజేసి పోట్లాడుచుంటిమని చెప్పిరి. అప్పుడు బలభద్రుడు మీ దేయూరు? వీఁడేమి నేరము చేసెనని యడిగిన