పుట:కాశీమజిలీకథలు -04.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలభద్రుని కథ

127

లేగముఁడి మెచ్చుకొనుచు వారికిఁ దగిన పారితోషికము లిప్పించి యతని నప్పుడే రత్నమాల యంతఃపురమున కనిపెను.

తనభర్త యున్మత్తవికారములంబాసి నిరామయుండై యున్నవాఁడను వార్తవిని యా రత్నమాల యత్యంత ప్రహర్షంబుఁ జెందుచు నతని కెదురుచని పాదంబులఁగడిగి తడియొత్తి రత్నపీఠంబునం గూర్చుండఁబెట్టి పూసురటిచే వీచుచు నార్యపుత్రా! ఇప్పటికైనను మీ చిత్తవికారము దీఱినదా? నాయందక్కటికము గలిగినదా? మీ వికారము వాయనిచో నే నేమైపోవుదునోకదా? యని వెక్కి వెక్కి యేడువఁదొడంగినది. అప్పుడతం డయ్యంగనను జేరఁదిగిచి యక్కునం జేర్చికొనుచు నుత్తరీయమునఁ గన్నీరు దుడుచుచు ముద్దాడి బోఁటీ! విచారింపకుము. మా సోదరులమాట జ్ఞాపకము వచ్చుటచే నీతోఁ జెప్పకయే యఱిగితిని. అది నాతప్పగును. ఉన్మత్తవికార మనుచుంటివి. ఆ మాట నాకర్దమైనదికాదు. అదియే మనవుఁడు నచ్చేడియ వితర్కించి తన వికారం బెఱుఁగడు కావున నట్లడుగు చున్నాడని నిశ్చయించి “పోనిండు ఇప్పుడామాట స్మరింపనేల? తలంచినంతనే నా గుండె ఝల్లుమనుచున్న" దని పలికినది. అప్పుడతం డది యేదియో చెప్పక తీఱదని నిర్భంధించిన నయ్యించుబోఁడి వెనుక గృష్ణుఁడు కావించిన కృత్యములన్నియు వక్కాణించి ప్రాణేశ్వరా! నేనప్పుడు మీపాదంబులఁబడినను గుఱుతుఁబట్టక నీవు నాకుఁ దల్లి వని పలికితిరి. అప్పుడు నేనేమి చేయతగినదో చెప్పుఁడు. భగవంతునిమీఁదనే భారము వైచి యారాధింపుచుంటినని యా కథ యంతయుం జెప్పినది. అతండప్పుడు ముక్కుపై వ్రేలిడుకొనుచు “అన్నన్నా! యేమి యాశ్చర్యము నేనీ నడుమ మీయూరు రానిదే వచ్చి యేమేమో యంటినని చెప్పుచున్నావే. ఇంతకన్న వింతయేమున్న" దనుటయు నా కలకంఠి మీకా మాట జ్ఞాపకమే యుండినచో నన్నప్పుడట్లేల యందురు. అదియొక యవస్థగదా! అప్పటి చర్యలేమియు నిప్పుడు జ్ఞాపకముండవు. దానినేకదా యున్మత్తవికారమని చికిత్స చేయించితిమని పలికినది.

అప్పుడుడతండు అయ్యో! నా వృతాంతముఁ జెప్పినను మీరు నాకుఁ బిచ్చియెత్తినదని పలుకుచున్నారు వినుము. నేను నీతోఁ జెప్పక యల్లనాఁడు తెల్లవారుజామున బయలుదేరి పురమెల్ల వెదకి మాతమ్ముడు గానక తెరువునంబడి పది దినములు నడిచితిని మఱి యొకనాఁడు చంద్రకాంతమను పట్టణముఁ జేరితిని. అందు నన్నుఁజూచి రాజుగారి యల్లుఁడనని యెల్లరు మన్నింప దొడగిరి. తరువాత రాజుగారు వచ్చి తీసికొనిపోయి తన యల్లుఁడనని కూఁతు నంతఃపురమునకుఁ బంపిరి. ఆ వనిత నన్నే భర్తయనుకొని యేమేమో సంభాషించినది. నే నేమియు వినిపించుకొనలేదు. ఆమీద నానాతికిఁ గుమారుఁడు గలిగెను. అప్పుడంతయు విమర్శింప మా తమ్ముఁడు గృష్ణుఁడను వాఁడు దానిం బెండ్లియాడినట్లు దెలిసికొని యా తెఱంగు