పుట:కాశీమజిలీకథలు -04.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

బలభద్రుండు మిక్కిలి సంతోషించెను. బలభద్రుండు కొన్ని దినములుమాత్ర మందుండి కృష్ణునిఁ దీసికొనివత్తునని చెప్పి యప్పుడమిఱేని యనుమతివడసి యటఁ గదలి భార్యంజూచి మఱియుం బోవలయునని తలంచి వెండియు మధుమంతమను నగరమునకుం బోయెను. బలభద్రుండు వీటిలోఁ బ్రవేశించినతోడనే చూచి రాజభటులు సంతసించుచు ఔరా! యెంతమోసము జేసితివి? నీకతంబున మాకుఁ జెఱసాల నుండవలసివచ్చెనుగదా? తస్కరులకన్న నధికుఁడవని తోఁచుచున్నది. ఎందఱిని గనుమూసి పాఱిపోయితివి? అని పలుకుచు నతని చేతులకు నిగళములఁ దగిలించిరి.

అయ్యో? ఇదియేమికర్మము. నేనేమినేరముఁ జేసితిని నా యిష్టము వచ్చినట్లు పోయితిని. అది తప్పుగా గణించితిరా? రాజుగారి యల్లుడననియు నిదానింపవలదా? యని యెన్నియో ప్రతికూలవాక్యములు జెప్పెను. కాని వానిమాట లేమియు వినుపించుకొనక రాజభటులతనిఁ గారాగృహంబునకుఁ దీసికొనిపోయి యందుంచిరి. అప్పుడు చికిత్సచేయుచున్న వైద్యులువచ్చి వానింజూచి "యెక్కడికిఁ బాఱిపోయితివి నీయున్మత్తవికారంబు లింకనుం దగ్గలేదా? ఇప్పుడైన నీవు రాజుగారి కల్లుఁడవని యొప్పుకొనియెదవా?" యని యడిగిన నతం డిట్లనియె. నాకు మా గ్రామము జూడవలయునని యభిలాష జనించినఁ బోయితిని. ఇది తప్పుగా గణించితిరా? నా భార్యను జూడవలయునని తలంపుగలిగి యిప్పుడు వచ్చితిని. నా యున్మత్తవికారము మీరేమి గ్రహించితిరి? నేను రాజుగారికి నల్లుఁడను గానని మీతో జెప్పితినా యేమి? అల్లుఁడననియే కాఁబోలు, నన్నిట్టి మర్యాదచేయుచున్నారు. మా మామగారితోఁ జెప్పి మిమ్మేమి చేయించెదనో చూడుఁడని బెదరించెను.

అతని మాటలువిని వైద్యులు పిచ్చి కుదిరినదని నిశ్చయించుచుఁ దమకుఁ బారితోషికము వచ్చునని సంతసించుచు నతని నిళగంబులు విప్పించి సగౌరవముగాఁ గొల్వుకూటంబునకుఁ దీసికొనిపోయి దేవా! మీ యల్లుని నిరామయుం జేసితిమి. ఈతని బుద్ధి చక్కఁబడినది. పరీక్షించుకొనుఁడని నుడివిన సంతసింపుచు నా రాజిట్ల నియె. ఆర్యా! యిప్పుడు నీ మనస్సు కుదురుగా నున్నదియా? నీవు నాకేమి యగుదువు? నీ పూర్వవృత్తాంతము స్మరణకు వచ్చినదియా? యని యడిగిన నతండు విస్మయమునొందుచు నన్నిట్ల డగు చున్నా రేమి? నేను మీ యల్లుండను గానా? మీ పుత్రిక రత్నమాలను నేను బెండ్లి యాడలేదా? క్రొత్తవానిగాఁ జూచుచుంటి రేమిటికి? నేను మీ యల్లుండననియైనను జూడక వీరు నన్ను లేనిపోని తప్పుడు గణించి చెఱసాలం బెట్టిరి. దీనికై వీరిం దండింపవలయునని చెప్పెను. ఆ మాటవిని యా రాజు సంతోషపారావారవీచికలఁ దేలియాడుచుఁ నా వైద్యులం గౌఁగిలించుకొని యార్యులారా! మీరు చేసిన యుపకార మెన్నఁటికిని మఱువఁజాలను. నా యల్లుని నిరామయుం జేసితిరి. చూచితిరా! వీనికిఁ బూర్వస్మృతి యేమియు