పుట:కాశీమజిలీకథలు -04.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలభద్రుని కథ

125

విబుధ - ఇంత యేల? నిందాక యా కలికి నొప్పులు పడుచున్నదని చెప్పుకొనుచున్నారు. పుట్టినపట్టి పోలికంబట్టి నిశ్చయింప వచ్చునుగదా.

సూరి కేసరి - కుమారుఁ డుదయించినది. మీ రెఱుంగరు. కాఁబోలు? రెండు గడియలైనది. అప్పుడే కోటలో ఫిరంగి వైచిరి.

విబుధ - ఆ ధ్వని యదియేనా? అయ్యో ! మంచి సమయము మిగిలి బోవుచున్నది. వేగముగా భోజనము చేయుడు. కోటలోనికిం బోవుదుము. పుత్రోత్సవము పంచి పెట్టుదురు గదా.

సోమ - అగు నిదియే సమయము. ఈ యపకీర్తి మాపుకొనుటకై రాజు ద్రవ్యమెక్కుడు గానే ఖర్చు పెట్టును. పోవుఁదము రండు అని మాటాడుకొనుచు భోజనము చేసి నిష్క్రమించిరి.

బలభద్రుం డామాటలన్నియు విని ఔరా! ఇది కడు చిత్రముగానున్నది. ఆ చిన్నది యుత్తరములు వలెఁ గనంబడుచున్నది. ఎవ్వఁడో నన్నుఁబోలినవాఁడీ చర్యలఁ గావించి యుండవలయును లేకున్న నింత విపరీత ముండునా? అతండు నా తమ్ముఁడు కృష్ణుండు కాఁడుగదా? రాజు తానిచ్చిన ప్రశ్నమున కెవ్వఁడో యుత్తరము వ్రాసినట్లు చెప్పుచున్నాఁడు. ఆ వ్రాఁత జూచినఁ దేటవడునని తలపోయుచు నా రాత్రి నిద్రఁబోయెను.

కనకాంగదుండును రాత్రి పండుకొని మఱునాఁ డుదయమున నా ప్రశ్నమున కిచ్చిన యుత్తరము వ్రాలు చూడవలయునని తలంచి యుదయమున లేచి సభఁ జేసి యా సభకు బలభద్రుని రప్పించి మంత్రి సామంతహితపురోహితాదులు చూచు చుండ నా పత్రికం దెప్పించి యిది నీవు వ్రాసినది కాదా ? యని యడిగెను. అతండాపత్రికం జూచి మేను ఝల్లుమన అయ్యో! యిది మా తమ్ముఁడు కృష్ణుండు వ్రాసినది. నా పేరు కృష్ణుఁడు కాదు. బలభద్రుఁ డందురు. దీనం దెల్లమైనది కదా! ఎంతమోసము. నన్నూరక నిర్భంధించితిరి. అతం డీ యూరెప్పుడు వచ్చెను. అతని నిమిత్తమే నేను దిరుగుచుంటినని గద్గదకంఠముతోఁ బలికి యా పత్రికను ముద్దు పెట్టుకొనియెను. ఆ మాటలు వినిసభాసదులెల్ల వ్రాసిన బొమ్మలవలెఁ జేష్టలుడిగి యూరక చూచుచుండిరి. ఆ రాజు విస్మయం బభినయించుచు ఏమీ! మీ తమ్ముఁ డొకం డుండెనా? అన్నన్నా? మీయిరువురకు యించుకయున్ను భేదములేదుగదా? దుర్మార్గులు నీవేమియు నెఱుంగనని పలికినది మొదలూరక నిందించుచున్నారు. నేను రాజపుత్రికచారిత్ర మెఱింగినవాఁడ గావున నింత విమర్శించితి. కానిచో నెంత ప్రమాదము రాఁగలదు అని పెక్కుగతుల వాక్రుచ్చుచు మీతమ్ముఁ డెందున్నవాఁడని యడిగెను. అతండును వారికి సంక్షేపముగాఁ దమవృత్తాంతమంతయుఁజెప్పి వానిని వెదకి తీసికొనివత్తునని శపథముజేసెను. అతని పరస్త్రీపరాజ్ముఖతకు సభ్యులెల్ల వేతెఱంగుల స్తోత్రములు చేసిరి. సువర్ణలేఖకుఁబుట్టిన పట్టి కృష్ణుని బోలియుండుటఁ