పుట:కాశీమజిలీకథలు -04.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

సోమ - శకుంతల దుష్యంతుని గాంధర్వవివాహంబున వరించి భరతునిం గనినది. కావున నది నిర్దుష్ట మైనది. ఇక్కడ పతి యెవ్వడు ?

సుధీ -- ఎవ్వఁడో యున్నాడష కాదు ?

సోమ - ఎవ్వఁడును లేకున్న గర్భమెట్లగును? వారనిన వాఁడు నేనెఱుఁగనని చెప్పుచున్నాఁడు.

సుధి - ఘట్టిచిక్కే వచ్చినదే నాకు వ్రాసిన చీటిలో రాజకుమారుని కెవ్వనితో పెండ్లి చేయ నిశ్చయించుకొన్నా రనియు ముహూర్తము దవ్వుగా నాండుటచే నీ లోపున వధూవరులు కలిసికొనిరనియు నంతలో నతండు చెప్పకయే వెళ్ళిపోయె ననియు నా చిన్నది గర్భవతి యయ్యెఁ గావున ధర్మశాస్త్రము చూడవలయునని వ్రాసిరి.

సోమ - ఆ మాటలెంత సందర్భముగా నున్నవియో యాలోచింపుఁడు? ఆ రాజకుమారుఁ డా చిన్నదానితో గలిసికొని మఱునాఁడు పారిపోవుటకు గారణమేమి యున్నది. ఆ నాతిని భూత మనుకొనియెనా యేమి?

విబుధమౌళి - ఎవ్వడో యొక రాజకుమారుఁడు రాజు ప్రశ్నమునకు సదుత్తరమిచ్చి కొన్ని దినంబులుండి పెండ్లి చేయఁ దలంచుచుండ నెవ్వరికి దెలియకుండ వెళ్ళిన మాట సత్యమగును.

సోమ - ఆ మాటకు సామంతరాజు లందఱు నొప్పుకొనుచున్నారు. అది కాదు. ఈ గర్భమున కతండే కారణమైనట్లు నిశ్చయము తేలవలయును.

విబుధ - సువర్ణలేఖ మహాసాధ్వి యని వాడుకయున్న దే.

సోమ - అయ్యా! స్త్రీల చేష్టితముల నెప్పుడును నమ్మఁగూడదనుకోండి.

శ్లో॥ అస్యం, సాహసం, మాయా, మాత్సర్యం, చాతిలుబ్దతా
     నిర్గుణత్వ, మశౌచత్వం, స్త్రీణాందోషాస్వభావజాః॥

అని యుండఁగా వారి మాటల నేల నిశ్చయింపపలయును.

విబుధ -- అట్లనరాదు. ఒక రాత్రి సునంద యందలముపైఁ బచ్చన్నముగా నతని నంతఃపురమునకుఁ దీసికొని పోవుచుండఁగా నా భార్య యేమిటికో వాకిటకుఁబోయి చూచినదఁట. ఆ సంగతి నిశ్చయమే కావచ్చును.

సోమ - (సోల్లాసముగా) ఆ మాట నిశ్చయమే యెవ్వనినో తీసికొనక పోయిన నా యింతికి గర్భమెట్లగును ? పెండ్లి చేయ నిశ్చయించుకొనినవాఁడు కాడని మా వాదము. మా వాదానికి దృష్టాంత మతండేమియు నే నెఱుఁగనని చెప్పుటయే.

విబుధ - అతం డీయూరెప్పుడు రాలేదని చెప్పుచున్నాఁడు. ఆ మాట నిజమా అబద్ధమా?

సోమ - ఆ సంగతి విమర్శింప మాకవసరము లేదు.