పుట:కాశీమజిలీకథలు -04.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలభద్రుని కథ

123

కయే యరిగితి వేల? స్వదేశంబునకుఁ బోయి వచ్చితివా యేమి? అప్పుడే రాజ్యముతో గూడ నా పుత్రిక నీయధీన యయ్యెనని చెప్పి నీ మెడలోఁ బుష్పమాలిక వేసితిని గదా! ఆ రాత్రియే నీవు నీ భార్యతోఁ గలిసికొంటివఁట. ఆ చిన్నది నీ కొఱకు బరితపించుచున్నది. ముద్దరాలి కెన్ని సుద్దులు తెచ్చి పెట్టితివి? అంతఃపురమునకు బోయి యాయింతి నూఱడించిరమ్ము పొమ్మని పలికిన నతండు నిట్టూర్పు నిగుడింపుచు నిట్ల నియె. దేవా! మీ మాటలు విన నాకు మతిపోయినట్లున్నది. విపణివీథిలో నిందాక యొక చిన్నది యిట్లే పలికినది. ఇంతకుఁ బూర్వ మెన్నడును నేను మీవీడు వచ్చి యుండలేదు. మీ ప్రశ్న యేదియో నే నెఱుఁగను. ఇట్టి నన్నుం బట్టుకొని యేమేమో చేసితినని యడిగిన నేమని సమాధానము చెప్పుదును. పైన మీరే యూహించుకొనుఁడని పలికెను. అప్పు డానృపశిఖామణి యత్యంత కోపంబునఁ గన్ను లెఱ్ఱ జేయుచు సునంద మొగముఁజూచెను. ఆ బోటి భయపడుచు వెనుక తాను వ్రాసిన చిత్రపటము దెచ్చి యెదురఁబెట్టినది. దానికిని బలభద్రునకు నించుకయు భేదము కనంబడలేదు. ఆ చిత్తరువు చేతంబూని యారాజు యిది యెవ్వని రూపో చూచితిరా? నీ వెన్నఁడును మా పట్టణమే రాలేదని చెప్పుచుంటివే నిన్నుఁ జూడక యీ చేడియ దీని నెట్లు వ్రాసినది. కల్లలాడినఁ బ్రయోజన మేమని పలికిన విని యతండాలోచించుకొని తానేమియు నెఱుంగ నని యుత్తర మిచ్చెను.

ఆ రేయి సునంద నృపతి యనుమతి వడసి యతని నంతఃపురమునకుఁ దీసికొని పోయినది సువర్ణలేఖ యతనిం జూచి భర్త యనుకొని యెన్నియో గురుతులు చెప్పినది కాని యతండు తల వాల్చుకుని కూర్చుండి యామె చెప్పెడు మాటలేమియు వినుపించుకొనక స్థాణువువలె వూరకొనియెను. ఏమియుఁ బ్రత్యుత్తర మీయలేదు. అంతలో నా తలోదరికిఁ బ్రసవవేదన యావిర్భవించినది కావున నాసందడిలో నతండు తప్పించుకొని యవ్వలికిం బోయెను.

ఆ రాత్రి యతండు సత్రంబునఁ బరుండియుండఁ గొందఱు బ్రాహ్మణులు భుజింపుచు నిట్లు సంభాషించుకొనిరి.

సోమ - సుధీనిధిగారు! మీరీ యూరేమిటికి విచ్చేసితిరి?

సుధీ - రాజుగారి కూఁతురు వివాహము కాక పూర్వమే యంతర్వత్ని యైనదష. తత్సంతతికి బుత్రత్వసిద్ధి యున్నదా? అను విషయము ధర్మశాస్త్రము చూచి చెప్పుటకు నన్ను రప్పించినారు.

సోమ - ఏమని చెప్పితిరి ?

సుధీ - ఇంతకుఁ బూర్వమేకా నేను వచ్చితిని. ఇంకను సభకుఁ బోవలేదు

సోమ - ధర్మశాస్త్రములో నామె నిర్దోషురాలనియే తేలినదా ?

సుధీ -- సందేహమేలా? వూరు వంశతిలకమగు భరతుఁడే దీనికిఁ బ్రమాణము. దీనికే గాంధర్వవివాహమని పేరు.