పుట:కాశీమజిలీకథలు -04.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పోనిస్తు రాజుగారి కూఁతురు ఏలాంటిదైతే మాకేమి? వూరుకో పెద్ద మనుష్యులు స్తానానికి వస్తున్నారు.

రామా - ఆక్షేపించితివి గనుక నేవద్దని చెప్పితిని. లేకున్న మీ జోలి మా కేల?

సోమి - సరి సరి. ఆక్షేపిస్తున్నారని సాక్ష్యమిస్తావా యేమిషి, చాలు చాలు మావారికి తెలిస్తే చంపివేస్తారు రామలక్ష్మీ! వేగము పోదాము రమ్ము ఈలాటి మాటలే కొంపలంటుకునేవి అని నిష్క్రమించిరి.

వారి మాట లన్నియు బలభద్రుని చెవిని బడినవి. పిమ్మట నతండచ్చోటు బాసి పురంబునఁ బ్రవేశించి రాజమార్గంబున నరుగునప్పుడు సువర్ణలేఖ సఖురాలు సునంద యారాజనందనునిఁ గృష్ణుం డనుకొని చేయి పట్టుకొని రాజపుత్రా! నన్నెఱుంగుదువా యని యడిగిన నతండు తెల్లఁబోయి పరిశీలించి చూచి నా కేమియుజ్ఞాపకము లేదు. నా పరిచయ మెక్కడఁ గలిగినదో నీవె చెప్పుమని పలికెను. అప్పుడా చిన్నది పోనిమ్ము నీ వెప్పుడైన నీయూరు వచ్చిన జ్ఞాపక మున్నదా? రాజుగారిచ్చిన ప్రశ్నమున కుత్తరము జెప్పితివా లేదా? నాఁటి రాత్రి విశేషము లేమనం గంటిరా లేదా నిజముఁ జెప్పుమన నతండు మీ రాజెవ్వఁడు? ప్రశ్న మెట్టిది? పుట్టిన తరువాత నీ పట్టణము రాలేదు. నా కేమియుం దెలియదు. నన్నెవఁరనుకొని మాట్లాడుచున్నావు? నీ మాటలేమియు నా కర్దము కాలేదని యుత్తరముఁ జెప్పెను అప్పు డది వెఱగుపడుచు మఱియు మఱియు నిదానించి చూచి యతండగా నిశ్చయించి రాజపుత్రా! నాఁటి రాత్రి నిన్నుఁ గపటముగా శుద్ధాంతమునకుఁ దీసికొని పోయితిని. అది స్వప్న మనుకొనుచున్నా వేమో సుమీ! కాదుకాదు. యథార్థమే నీకుఁ గుమారుఁడుదయింపఁ గలడు. నగరికిఁబోవుదము రమ్ము. సామంతరాజులు మా రాజుపైఁ గల యీసున నేమేమోయని యాక్షేపించుచున్నారు. పరిహాసముకైన నిది నే నెఱుఁగ నంటివేని ప్రజలు నిజమే యనుకొందురు. స్త్రీచాపల్యంబుస నాఁ డట్టిపని గావించితిమి. నీవే పెండ్లి యాడుదువుగదా యని సాహసించితిమి. వలపు నిదానము గలుగనీయదుగదా యని యా కథయంతయుం జెప్పిన నతండు నవ్వుచు నిట్లనియె.

బోఁటీ! నీ మాటలు బూటకములో యథార్థములో నాకుఁదెలియవు. నన్ను నీ వెఱుంగక యేమేమో చెప్పుచున్నావు. నీ మాటలకేమని యుత్తర మిత్తును. నీ దారి నీవు బొమ్మని చేయి విదలించుకొని యతండు మఱియొక వీథికిఁ బోయెను అప్పు డమ్మగువ దిగులుపడి సెగులుతో నంతిపురి కరిగి యవ్వార్త సువర్ణలేఖ కెఱింగించెను. అప్పల్లవపాణి డెందంబు గొందలమంద నత్తెఱంగు తండ్రి కెఱింగించెను. అప్పు డప్పుడమిరేడు దూతలంబుచ్చి దరించి యతనిఁ దన యాస్థానమునకు రప్పించుకొని సముచిత సత్కారంబులఁ గావింపుచు నల్లన నిట్లనియె.. రాజపుత్రా ! యనేక రాజకుమారవర్గంబులో నెక్కుడు బుద్ధిమంతుడుగను నుడువదగినవాఁడు నీవు నాతోఁ జెప్ప