పుట:కాశీమజిలీకథలు -04.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యెంతయో నైపుణ్యముగా మాటాడినది. ఆ మాటలువిని కృష్ణుం డొక్కింతతడవు విచారించి సాధ్వీ! నీవు నన్నెప్పుడు పెండ్లియాడితివి? నన్నింతకుమున్నెన్నఁడైనఁ జూచితివా? యీ కల్పనలు నాకుఁ బిచ్చియెత్తింపుచున్నవి. నీవు నన్నెఱింగిన గుఱుతు లేమైనం గలిగెనేని చెప్పుమనుటయు నా యువతి చురచురంజూని యిట్ల నియె.

ఆర్యపుత్రా ! పురుషుల నెన్నఁడును నమ్మరాదుగా ? వినుండు మీరు మా యూరి సత్రములోనున్న మదీయ చిత్రఫలకముఁ జూచినప్పుడు కావించిన కృత్యంబులు -

శా. చూచు న్వేమఱుఁ జేతిచిత్తరువుఁ జూ • చుం దానిపై నున్న రా
     కాచంద్రాస్యను బిమ్మట న్మఱిశిరః • కంపంబు గావించు సం
     కోచం బందుచు వెండియుస్గనుఁ గలం • గున్నిక్కమంచున్ రతిన్
     జూచుం జేతులఁ గౌఁగిలింప నతఁడా • శ్చర్యంబు సంధిల్ల గాన్.

అని మా పరిచారికలువచ్చి చెప్పిరి. అట్టి మీ చర్యలేమైన జ్ఞాపకమున్నవియా? మఱియు వినుండు.

మ. కలలోఁగన్న వధూటియే యిదియ ని • క్కం బొక్కటేరూపమా
     లలనారత్నము గాలిలో నెగిరి యీ • లావచ్చెనా ? దీని క
     వ్వల నారూపు పటంబులోన లిఖయిం • పం గారణం బేమి యా
     కలయేనా యిది లేక నాకిటు తదా • కారంబు గన్పట్టెనా.

అని మఱియు నందున్న నన్నుద్దేశించి -

ఉ. ఓ పికవాణి ! యోఘనప • యోధర ? యోహరినీలవేణి ! నీ
    వీపగిదిం బటస్థితి వహించితి • వేమిటి కిందు సత్యమౌ
    రూపముదాచి తెందునసు • రూపమే నీకు ననున్ స్మరాగ్నిసం
    తాపముపాలు సేయ వల • దా కృపపల్క విదేమె కోమలీ.

చ. అమరులు దానవు ల్గలిసి • యంబునిధి న్మధియించి కన్న య
    యమృతముకన్నఁ జాలరుచి • యౌఁజుమి నీయధారామృతం యో
    రమణి ! యొకింత గ్రోలితి భ • రంబగు మోహనముగల్గె మేసితా
    పము గడు హెచ్చె బుద్ధిపరి • పాటి యడంగె గుణంబదేమెటో.

అని యున్మత్తుక్రియఁ బలవరించిన మాటయు స్మరణకు రాకుండెనా యనుటయు నతండు ముక్కు పై వ్రేలిడికొని అయ్యారే ! యిదియేమి యింద్రజాలము అని విస్మయ మభినయించుచుఁ దరువాత నేమి జరిగినదో జెప్పుమనియె. అప్పు డా చిన్నది మేల్కొనియున్నవాని నెవ్వరు లేపఁగలరు ? అయినను జెప్పెదను వినుండు. పిమ్మట నా వార్త నేనువిని మీ చిత్రఫలకము దెప్పించుకొనిచూచి మున్నుగలఁలో గన్న వాఁడేకదా యీతం డని నిశ్చయించి మా తండ్రికి నా యుద్యమ మెఱింగించి