పుట:కాశీమజిలీకథలు -04.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణుని కథ

117

పట్టుకొనుటయుఁ గృష్ణుండు ఔరా ! “యిది యెక్కడి బాంధవ్యము. మీరు భ్రాంతి పడుచున్నారు. మీరెవ్వరు? నేనెవ్వఁడను. బాపురే జోద్యముగా నున్నది. మీ యల్లుఁడ నేనుగాను వేఱయున్నాఁడు వెదకి తెప్పించుకొండని" పలికిన నారాజు మాన్పడి, యోహో? యీతని కేదియో యనుమానము గలిగినది. నాశత్రువు లెవ్వరో బోధించియుందురు. నాపుత్రికచారిత్ర యెఱుంగక యీతండిట్లనుచున్నాఁడు. అగ్గికి జెదలుపట్టునా యని తలంచి వెండియు నిట్లనియె. నాకు నీవల్లుఁడవు. నీకు నేను మామను. ఈ బంధుత్వము వలదన్నను పోవదు. నీ వేదియో లోనంబెట్టుకొని పైకి వేఱొకలాగున మాటలాడుచున్నావు . మా కులము కడుపవిత్రమైనది. మేమట్టివారముకాము నీ యల్లుఁడు వేఱొకడుండెనని యెత్తిపొడిచితివి. కులశీలాదులఁ బరిశీలింపక వీధింబడి పోవువానికిఁ బిల్లనిచ్చుటనేఁగదా యిట్లనుచుంటివి. కానిమ్ము ఎప్పటి కేది విధియో తప్పదుగదా యని పలికెను ఆ మాటలన్నియు విని యతండు వృశ్చిక దష్టమైన వానరముభంగిఁ జిరాకుపడుచు నేమియు నుత్తరముఁజెప్పక తటాలునలేచి యెక్కడికోపోవఁ బ్రయత్నముచేయుచున్న సమయంబున నతని రెండుచేతులు పట్టుకొని యా రాజు నీవు కోపించిపోయినను బోవనిత్తుమా ? రారమ్ము మా యపరాధము సైరింపుమని పలుకుచు బలాత్కారముగా నతని నొకయాందోళికంబునం గూర్చుండఁబెట్టి కోటలోనికిఁ దీసికొనిపోయెను.

వారు తనకుఁ కావించు నుపచారములుచూచి యతండు వెఱగుపడుచు "అయ్యో ? వీరు నన్నల్లునిఁగా భావించుచున్నారు. ఇట్టి మూఢులెందైనం గలరా ? ఇప్పుడు నేనేమి చేయుదును. వీరికి నేనల్లుఁడ నెప్పుడై తిని. నేనే మఱచిపోతినా ? కాదు. అది చంద్రకాంతమను పట్టణము ఇదియదికాదుగదా ? యెట్లగును అని యనేక ప్రకారములఁ దలపోయుచుండెను.

నాఁటి సాయంకాలమున నతని బలాత్కారముగా రత్నమాల యంతఃపురమునకుఁ దీసికొనిపోయిరి. రత్నమాలయుఁ జక్కగా నలంకరించుకొని బతిరాక నిరీక్షించుచున్నది. కావున నప్పుడెదురుబోయి పాదంబులఁ గడుగఁబోయిన నతండు సమ్మతింపక తప్పించుకొనిపోయి యా గదిలో నొకపీఠంబునఁ దలవాల్చుకొని కూర్చుండెను. అప్పుఁడా రత్నమాల దాపున నిలఁబడి క్రేగంటి ప్రసారము లతనిపై బరగించుచుఁ బైటచెరఁగు చేతంబూని నిదానించి చూచుచు నతండే తన భర్తయని నిశ్చయించి పాణేశ్వరా! నాయందు మీ కాగ్రహము వచ్చినదఁట నేనేమి తప్పు జేసితిని. మా తండ్రికి వేఱొక యల్లుఁడున్నట్లు సూచించినారఁట. అది నాకు హృదయ శూలముగాకపోవునా? నేను త్రికరణములచేతను మిమ్మే భర్తగాను దైవం గాను నమ్మియుంటిని నాతోఁ జెప్పకయే నాఁటి వేకువజామున మీరరిగినది మొదలు నేను నిద్రాహారములు మాని మీ నిమిత్తమే చింతింపుచుంటిని. నిజము విచారింపుఁడు. తప్పుచూపి దండింపుఁడు అంతియకాని యూరక కోపించిన నేమిచేయుదుమని