పుట:కాశీమజిలీకథలు -04.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చింతాకులస్వాంతుండై యొక చెట్టు కిందఁ గూర్చుండెను. ఇంతలోఁ బ్రొద్దుగ్రుంకినది. యా కటికి చీఁకటిలో నెటుపోవుటకుం దోచక నేలం బండుకొనియెను. అప్పుడు సుభద్రకుఁబోలె నాతనికిఁ దమవృత్తాంతమంతయు స్ఫురణకు వచ్చినది. ఆ రాత్రి నిద్రఁబోవక తమ చరిత్రముం దలంచుకొనుచు దైవమహిమ కచ్చెరువందుచు నతండు తెల్లవాఱినతోడనే తనయన్నను మధుమంతమున విడిచివచ్చితిమనియు నందేయున్నాడను నిశ్చయముతో బయలుదేరి కతిపయప్రయాణంబుల నారాజధాని కరిగెను

అతం డాపట్టణపు వీథిలో నడచుచుండ రాజభటులు చూచి వంగివంగి సలాములుచేయఁ దొడంగిరి. ఉద్యోగస్థు లోరగాఁ దొలంగు చుండిరి. సామంతులు నమస్కారములు చేయుచుండిరి. మంత్రులు కుశల మడుగఁజొచ్చిరి. పౌరులు వెంట వెంటఁ దిఱుగఁజొచ్చిరి. అది యంతయుంజూచి యతండు వింతపడుచు అయ్యో ? ఇది యేమి చిత్రము ? వీరందఱు నన్నెఱింగినట్లు మాటాడెదరు. ఈ పరిచయ మెక్కడిదో నాకుఁ దెలియదు. వీరి యభిప్రాయమేమియో నే నెఱుంగనని పలుతెఱంగులఁ దలంచుచు నావీధింబడి పోవుచుండెను. ఇంతలో ముఖ్యామాత్యుండు వచ్చి నమస్కరించి దేవా ! మీరు పరదేశస్థులవలె వీధులం దిరుగుచున్నా రిదియేమి? మీరాకవిని పరమసంతోషముతో మీ మామగారి యేనుగుఁ పై నెక్కించి తీసికొనిరమ్మని నన్నుఁ బుత్తెంచిరి. పోవుదమురండు మమ్ము మఱచితిరాయేమి ? యని పలికిన వెఱఁగుపడి యతండు మా మామగారెవ్వరు ? మీమాటలేమియు నాకర్థము కాలేదని యుత్తరముఁజెప్పెను.

అప్పు డామంత్రి "ఇది మధుమంత మనుపట్టణము ఈ పట్టణపు రాజుగారే మీ మామగారు. ఆయన కూతురు రత్నమాలను మీరు వివాహమాడితిరి. నేనాయన మంత్రిని. ఇదియే మీకును మాకునుగల బంధుత్వము. వేగము పోదుమురండు మీ మాయలకు మేము లోఁబడమని పలికిన విని యతండు బాగుబాగు మేలుమేలు. మీ మాటలు కడు విపరీతములుగా నున్న యవి. నన్నెవ్వనిఁగానో భావించి మీరు మాటలాడుచున్నారు. మిమ్ము నేనెఱుంగ నాకీవైభవములతోఁ బనిలేదు పో పొండని పలికినఁ జిన్న వోయి యయ్యమాత్యశేఖరుండు మాఱుమాట బలుకక రాజుగారియొద్దకరిగి యిట్లనియె. దేవా ! దేవరయల్లునింగాంచి తమ సందేశంబును విన్నవించిరమ్మని ప్రార్దించితిని. ఆయన కేమిటికో కోపమువచ్చినది. మొగమెఱుంగనివానితో మాటలాడినట్లు మాటలాడెను. మనయింటికి రారఁట నేనెంతయో బతిమాలితిని కార్యము లేకపోయినది. దేవరయేవెళ్ళి పిలిచిన వచ్చునేమోయని పలికిన నాభూపతి యప్పుడే యశ్వగజాందోళికాది వాహనములతో నరిగి యతండొక మఠములోనుండ దండకుంజని యల్లన నిట్లనియె.

ఆర్యా ! మేమేమి తప్పుచేసితిమి ? మాయింటికిరాక జోగివలె నీమఠముల వెంబడిఁ దిరుగనేటికి. చాలుచాలు. రారమ్ము సరివారు నవ్వుదురని పలికి