పుట:కాశీమజిలీకథలు -04.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15]

సుగుణసాగరుని కథ

113

శరీరములో లేచుటకు శక్తికలిగినది. ఆ లోపల నతని చిటికెన వ్రేలినున్న యుంగరము గురుతుఁ జూచి తనదని తెలిసికొని విస్మయము నొందుచు "అమ్మకచెల్లా! వీఁడే నా హృదయచోరుండు వీని నెక్కడనో చూచినట్లున్నదని మూడు దినముల నుండియు నూహింపుచుంటిని అయ్యో! వీని కిట్టయవస్థ యేమిటికి రావలయు? అక్కటా ! ఒక్క నిమిషము దాటిన వీఁడు జమువీటి కతిథియైపోవునుగదా? పాపమా రక్కసులు నన్నీ పెట్టె కోరమనక పోయిన వీఁడు జీవింపడు. దైవ సంఘటన మెంతవిచిత్రముగా నుండునో అయ్యారే! అని ముక్కుమీఁద వ్రేలిడికొని యాశ్చర్యమందుచు నతనితోఁ బరిచయము గలుగఁ జేసికొని యల్లన నిట్లనియె. ఆర్యా! నీ వెవ్వని కుమారుండవు? జన్మదేశ మెయ్యది? నీ యభిప్రాయమేమి? బ్రహ్మరాక్షసుని పాఠశాలకు శాకమువై యెట్లుపోతివి ? నీ వృత్తాంతము వినఁ గుతూహలమగుచున్నది. వక్కాణింపుమని కోరిన నా పురుషసింహము అతఁడు తనకుఁ జేయునుపకారము లన్నియుఁజూచు చున్నవాఁడు కావునఁ గృతజ్ఞతసూచించు పలుకుల వినుతించుచు నల్లన నిట్లనియె.

సుగుణసాగరుని కథ

వయస్యా! నా జన్మభూమి కాశ్మీరదేశరాజధానియగు విక్రమనగరము. మా తండ్రి పేరు విక్రమసేనుడు. నన్ను సుగుణసాగరుఁడని పిలుచుచుందురు. ఘృతకోశన్యాయంబున నాయందేగుణము లేకున్నను నాకాపేరు వాడుకయైనది. క్రమంబున నేను వేదశాస్త్రపురాణాది విద్యలం జదివితిని. భాషల గ్రహించితిని. లిపులు నేర్చితిని. శస్త్రాస్త్రవిద్యలలో నసమానుండని పేరు పొందితిని. చిత్తరువులు వ్రాయుటలో నన్ను మిగులఁ గొనియాడుచుందురు. చిన్నతనము నుండియు నా కేదియో క్రొత్తవిద్య సంపాదింపవలయుననియే కోరికయై యుండెను. ఇట్లుండ నామేనజవ్వనము పొడసూపినంత మా తండ్రి నాకు వివాహము సేయవలయునని ప్రయత్నముఁ జేయుచుండ నెఱింగి వలదని వారించితిని. అతం డందులకుఁ గారణ మేమని మంత్రులచే నడిగించిన నీ పద్యము వ్రాసి పంపితిని.

సీ॥ కాలహేటజ్వాలఁ ♦ గబళింప నగుఁ గాని
               యతివలతోడ మా ♦ టాడ నగునె
     పులుల మీసముల ను ♦ య్యెలలూగ నగుఁ గాని
               వారిజాక్షులచెంతఁ ♦ జేరనగునె
     దంభోళిహతిసము ♦ ద్దతి కోర్మనగుఁ గాని
              లేమలపల్కు లా ♦ లింప నగునె
     మదనాగ్నిఁ బిడికిట ♦ నొడియంగ నగుఁ గాని
             కుసుమ గంధులపొందుఁ ♦ గోరనగునె