పుట:కాశీమజిలీకథలు -04.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మరాక్షసుని కథ

109

దోచక మ్రాన్పడియట్లే కూర్చున్నది. పెట్టెపై నున్న బ్రహ్మరాక్షసుం డాచిగురుఁ బోడిం జూచి మూపు లెగరవైచుచు నో హోహో ! నా పుణ్యమేనని జెప్పఁదగినది. కుందేలు వంటయింటికే వచ్చి పడినదికదా ? నా పరిచారకు లెక్కడను మనుష్యులే దొరకరని చెప్పదురు. ఎన్ని మాంసములైనను మనుష్య మాంసమున కెన యగునా ? నేఁడు నా యలసట దీఱుటకుఁ దగిన యాహారము దొరకినదని యుబ్బుచు నోరీ ? నీ వెవ్వఁడవు ? ఈ కారడవి కేమిటికి వచ్చితివి ? పాపము నీవు నాయునికి నెఱుంగవు కాఁబోలునని సాగేదముగాఁ బలికిన విని యక్కలికి యతండు బ్రహ్మరాక్షసుఁడని తెలిసివాని హింపుడిపికొని చావు నిక్కమమని నిశ్చయించి తెగువయై నిట్ల నియె.

మహాత్మా ? నా దేహము నీ కాహారముగాఁ జేసి కృతార్థురాలనని యర్దోక్తిగాఁ బలికి మఱలఁ గృతార్ధుండ నగుదునను తలంపుతో నీ యరణ్యములోఁ బ్రవేశించి మూఁడుదినముల నుండి యీ వృక్షమును వెదకుచుంటిని. నేఁడు దీని క్రిందికి వచ్చి కృతకృత్యుండనైతిని. నా దేహము భక్షించి నీ యభీష్టము దీర్చుకొమ్మని పలికినది. ఆ మాటలు విని యా బ్రహ్మరాక్షస్సు వెఱఁగుపడుచు నో హో నీ మాటలు వినఁగడు చోద్యముగా నున్నవి. లోకములో నే జంతువై నను మరణమునకు వెఱచు చుండును. తన జీవితమునకు భార్యా పుత్రాదుల నర్పించుచుందురు. జీవితాశ యెట్టి యాపదలయందును జీవుల విడువదు. నీ రూపముఁ జూడఁ గడువింతగా నున్నయది కృతార్థురాల ననఁబోయి మార్చితివి. నీ వాఁడుదానవా ? మగవాఁడవా? నీ వృత్తాంతము వినమాకుఁ గుతూహలమగుచున్నది. మఱి రెండు గడియలు నీ కాయుశ్శేష మున్నది. నీ తెఱంగెఱిం గింపుమని పలికిన నక్కలికి యులికిపడుచు జడిసినట్లు తెలియనీయక యల్లన నిట్లనియె.

దేవా ! నేనొక రాజకుమార్తెను స్వయంకృతాపరాధముగా నింటియొద్ద నుండక యన్నలతో దైవమహిమఁ దెలిసికొను తాత్పర్యముతో దేశాటనముఁ జేయ మొదలు పెట్టితిని. నాటంగోలెనన్నియు నిక్కట్టులే యన్నియు నాపదలే యిడుమలతో నా యొడలుకాయలు కాచినది. ఒకటి విడిచినవేఱొకటి తటస్థించుచున్నది. అప్పుడు మరణమే సుఖకరమని తోచినది. అందులకై యెన్నియో ప్రయత్నములు చేసితిని నా ప్రయత్నములు కొనసాగినవి కావు. ఏదియో యంతరాయము వచ్చి బ్రతుకుచుంటిని. అప్పుడు కొందఱు నా యుద్యమము దెలిసికొని నీ కట్టి తాత్పర్యమేయుండినచో నీ యరణ్యములోనికిం బొమ్మని యిందు మీరున్న వృత్తాంతము జెప్పిరి. అప్పుడు సంతసించుచు నిది యనివార్యము గదా ? యని యిచ్చటికి వచ్చితిని. నా పూర్వజన్మపరిపాకంబున మిమ్ము బొడగంటిని. నా మేను వృధగాఁ గాక గృధ్రములుపాలు గాకుండ మీ యట్టి మహాత్ముల కుక్షిం పడుచున్నది. ఇదియే నాకుఁ బదివేలు. స్త్రీవేషముతో దేశాటనము చేయుట కష్టమని పురుషవేషముతోఁ గ్రుమ్మరుదును. సంసార మపారమని యెఱింగియే మన పెద్దలు వైరాగ్యము విషయమై తద్దయు బుద్ధులు గర