పుట:కాశీమజిలీకథలు -04.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యధికులు. వీనికి మనము పరిచారకత్వము జేయనేల? వీరి కన్న మన మేమిటికిఁ దక్కువవారలమైతిమి?

శివరా - త్రిమూర్తులలో బ్రహ్మ దక్కువవాఁడైనను రాక్షసులలో బ్రహ్మరాక్షసుఁడే యధికుఁడని బేతాళుఁడు శాసనము నిర్మించి యున్నాడు.

విష్ణురా - బేతాళున కట్టిచట్టము నిర్మించుట కేమి యవసరము వచ్చినది.

శివరా - అతండు సర్వభూతప్రేతపిశాచశాకినీఢాకినీరాక్షసాదిగణంబులకు సార్వభౌముండు. సేవ్యసేవకన్యాయములో వీరికి వీరికిఁ దగవులు వచ్చినవి. వానినెల్లఁ పరిష్కరింపుచుఁ గొన్ని శాసనములు నిర్మించెను.

విష్ణురా - అయ్యో ? యెంత మోసము. మన జీవితకాల మెల్ల వీనికి సేవ చేయవలసిన దేనా?

శివరా - విధాయకముగాఁ జేయవలసినదే.

విష్ణురా - అక్కటా ? యీ యిక్కట్టు నా కెట్టు తప్పునో కదా ? వీఁడు కుడుచునప్పుడు వేరు వేరు పక్షి మృగాది మాంసఖండములు పేరులు చెప్పుచుఁ గల్లులో ముంచి నోఁటి కందించుచుండవలయును. నడుమ నడుమ మనుష్యమాంసము నంజుకొనఁ బెట్టవలయును. ఈ పెట్టెడు వానిపొట్టం బెట్టుకొనునుకాని యొకముక్కైన నాకు మిగల్చఁడు నా వృత్తికన్న నీ వృత్తియే లెస్సగా నున్నది.

శివరా - నా పని మాత్రము తక్కువదియా ? ప్రపంచములో నున్న భూత ప్రేత పిశాచాదుల వార్తలన్నియుం దెలిసికొని వచ్చి చెప్పుచుండవలయును. ఒక్క నిమిషమైనఁ గూర్చుండుటకు నవకాశ మున్నదియా ? సేవక వృత్తియే కష్టమైనది. ఏమి చేయుదుము ? బ్రహ్మ మనకిట్లు విధించెను.

విష్ణురా - అదిగో అయోముఖుఁడు వచ్చుచున్నాఁడు. మాటాడకుము.

అని చెప్పుచుండఁగనే యయోముఖుఁడు వియద్గమనంబునఁ బ్రాంతపాదపశాఖలు పెళ పెళ విఱుగ నతిరయంబున వచ్చి యచ్చెట్టుపై వ్రాలెను. అప్పుడు విష్ణురాక్షసుఁడు రక్తమునఁ గాళులు గడిగి చర్మమునం దడి యొత్తుచు మనుష్యకేశరచితచామరంబుల వీచుచుఁ బెక్కుపచారములు సేయఁదొడంగెను. ఆ రాక్షసుఁడు వాడు ప్రకారము పృధుశాఖాంతరమున నమరింపబడియున్న పాషాణపేటికపైఁ గూర్చుండి పరిచారకులతో నేదియో సంభాషించుచున్న సమయంబున నా మందసము క్రిందనున్న కొమ్మలు నాలుగు పెళ పెళ విఱిగి గుభాలున నా పెట్టెతోఁ గూడ నేలం గూలినవి.

ఆ మందసము సుభద్రకు దాపుననే పడినది. ఆ ధ్వని విని సుభద్ర యదరిపడిలేచి కూర్చుండి యదేమియో యని విమర్శింపుచుండ నా మందసముపైఁ గొండవలెఁ గూర్చుండియున్న రాక్షసుఁడు గనంబడెను ? అప్పుడా చిన్నది ఏమియుం