పుట:కాశీమజిలీకథలు -04.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మరాక్షసుని కథ

107

అయ్యో ? నేను మహారాజు కడుపునఁ బుట్టి యింటికడ సుఖంబుండక యన్నలతో దైవమాయఁ దెలిసికొందు నని యేమిటికి దేశాటనముఁ జేయవలయును ? చేసితిమిపో దైవము లేఁడని నిందింపనేల ? దానినే కదా దైవమాయామోహితులమై యున్మత్తులక్రియలఁ దిరుగుచుంటిమి. జగంబంతయు భగవంతుని చేతిలో నున్నది. మహామాయను మించినవాఁ డెవ్వఁడును లేఁడు ఊపిరి విడుచుటకైన జనుఁడు స్వతంత్రుఁడుగాడు. ఆహా ! ఇట్లని యెఱింగినను గ్రమ్మఱమోహం బావేశించుచుండును. ఏమి చేయుదుము. పరమేశ్వరుని శరణుఁ జొచ్చుటకంటె వేఱొక్క సాధనము లేదు. అన్నదమ్ముల విడదీసి యీ మహారణ్యములో నెవ్వఁడు ప్రవేశ పెట్టెనో యాతఁడే యీ యాపద దాటింపవలయు నొరులకు శక్యమా ? యని పరమేశ్వరుని ధ్యానించుచుఁ బరుండినది.

బ్రహ్మరాక్షసుని కథ

అయోముఖుండను బ్రహ్మరాక్షసుఁడు చిరకాలము నుండి యా రావిమ్రాను నాశ్రయించుకొని యుండెను. వానికి శివరాక్షసుడు విష్ణురాక్షసుఁడు నను దూత లిరువురు గలరు. వారితోఁ గూడికొని యాసక్తంచరుఁడా యరణ్యములో నున్న జంతువుల నెల్ల భక్షింపుచుండును. దానంజేసి యాయడవి పశుపక్షిమృగాదిశూన్యమై యున్నది. ఆ దారిని మనుష్యు లెవ్వరును సంచరింపరు. ఆ యశ్వత్థమునకు మూడు యోజనముల దూరములో నెటు చూచినను జనపదం బేదియును లేదు. నాఁటి రాత్రి బ్రహ్మరాక్షసుని కంటె శివవిష్ణురాక్షసులు ముందుగా వచ్చి యిట్లు సంభాషించుకొనిరి.

శివరాక్షసుఁడు - అన్నా ! మనయజమానుఁ డింకను రాలేదేమి. ఆహార పదార్ధములఁ దెచ్చి సిద్ధముగా నుంచితివా ?

విష్ణురా - ఇదిగో యా ఱాతి మందసము జంతుకళేబరములతో నిండించితిని. ఈ దినమున మనుష్య మాంసము గూడ దొరకినది. నేను లేచినవేళ మంచిదే.

శివరా - అట్ల నెద వేమిటికి.

విష్ణురా - అబ్బా ! ప్రతిదినము వీనితో నేను బడెడు నిడుములకు మితి యున్న దా ? రాత్రి వచ్చువఱకుఁ బలు విధములగు జంతువులఁ జంపి తెచ్చి యీ పెట్టె నిండింపవలయును. దానిలో మనుష్య మాంసము కూడ తప్పక యుండవలయునఁట. నే నెక్కడఁ దెత్తును. యీ యడవియంతయు బశుపక్షి మృగశూన్యముఁ జేసితిని. వీని వార్త విని మనుష్యులీ దారి నడచుట మానిరి ఏది లేకున్నను నాకుఁ బ్రహరణములే కదా ? అప్పా! నా కొకటి చెప్పుము. వీఁడు బ్రహ్మరాక్షసుఁడు నేను విష్ణురాక్షసుఁడను నీవు శివరాక్షసుఁడవు గదా ? బ్రహ్మకన్న శివవిష్ణులే