పుట:కాశీమజిలీకథలు -04.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

బున నరుగవలయునని బోధించి యప్పడఁతి నొప్పించెను. వారు నాఁటి రాత్రి యెవ్వరికి దెలియకుండ నొక యరణ్యమార్గంబునం బడి పాదచారులై పోఁదొడంగిరి

అస్వస్థుల చిత్తములు తరళములై యుండును గదా ? అట్లు దారి కాని దారింబడి పోవుచున్న సమయంబున సుభద్ర 'అన్నా ! మన చిత్తములు పూర్వము వలె మన స్వాధీనతలో లేవు సుమీ ? మన మెక్కడికిఁ బోవలయునో యెక్కడి నుండి వచ్చుచుంటిమో మనకు జ్ఞాపకము లేదు. ఎద్దియో మఱచిపోయిన వస్తువును వెదుకుచున్నట్లు తిరుగుచున్నాము. నీ కేమైన స్ఫురణ యున్నదా' యని యడిగిన నతండు 'చెల్లీ ! పాతాళ బిలములోఁ బడినది మొదలు మన మదుల కిట్టి వికారము గలిగినది. ఒక్కొక్కప్పు డంతయు జ్ఞాపకము వచ్చును. అప్పుడు నీతోఁ జెప్పవలయునని తలంచి పిమ్మట మఱచి పోవుదును. ఈ సారి యంతయుం జెప్పెదనులే' యని యుత్తరము జెప్పెను.

వారట్ల య్యరణ్యములో మఱునాఁడు సాయంకాలము వఱకు నడిచిరి. జనపదంబేదియుఁ గనంబడినది కాదు. చీకఁటి పడుచున్నదని కృష్ణుండు ముందుగావడిగా నడచుచుండ సుభద్రయు నోపినంత వేగముగా వెనుక నడువజొచ్చినది. ఒకచోట రెండు దారులు గనంబడినవి. అందు గృష్ణుఁడే దారిఁ బోయెనో తెలియక సుభద్ర నిలఁబడి యన్నా, యన్నా ! యని పిలిచినది కాని యతం డట్టి సమయమున రాత్రి జరిగిన క్రీడావిశేషములఁ దలంచుకొనుచు నడుచుచున్న వాఁడు గావున నాకోకస్తని కేక లేమియు వినబడినవి కావు. పెద్ద దూరము పోవు వఱకు సుభద్ర వచ్చుచున్నదో లేదో యను మాటయు విమర్శింపలేదు. అప్పుడు సుభద్ర కృష్ణుఁ డేదారిని బోయినది తెలిసికొనలేక యొక్కింతసేపు చింతించి దైవము తనకుఁజూపిన మార్గంబునం బడి నడువసాగినది.

అంతలో లోకబాంధవుడు తదీయగమన వ్యధఁజూచి సహింపని వాఁడుంబోలె పశ్చిమ సముద్రమున మునింగెను. తోడనే దదీయహృదయశోకాంధకారమునకు బంధుత్వమును దెలుపుచుఁ జీఁకటులు కాటుక పూసినట్లు నలుదెసల నావరింపఁ జొచ్చినవి. అప్పు డప్పడఁతి వనపక్షిమృగశూన్యంబగు నమ్మాహారణ్యములో గుండె ఱాయి చేసికొని దారి గనంబడినంత సేపు నడిచినది. క్రమంబునఁ జీఁకటి యతిశయింపుచుండెను. అప్పు డయ్యండజయాన మన్నును మిన్నునుం దెలియక నిలంబడి శయనింపఁ దగినతా వరయుచుండ నా దండ నొక రావిమ్రాను పృధులదళసాంద్రములైన శాఖాసమూహములచే దెసల నావరించి మార్గమున వ్యాపించియున్నది. అది నివాసయోగ్యంబని యెంచి యా యించుఁబోడి తదంతికధరణి కరిగి కరతలంబున నందలి జీర్ణవర్ణంబులఁ దొలగించుచు నొక నెలవిరపు పరచుకొని యుసురని నిట్టూర్పు నిగుడించుచు హస్తోపదానముగా శయనించె. అప్పు డాత్మవృత్తాంత మంతయు నంతఃకరణగోచర మగుటయు నిటు తలంచినది.