పుట:కాశీమజిలీకథలు -02.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

కాశీమజిలీకథలు - రెండవభాగము

గాక అడిగితిని కాను. నాకును గోప్యము కానిచో వక్కాణింపుమని మిక్కిలి వినయముగాఁ బ్రార్ధించినది.

అత్తిలోత్తమయు అమ్మత్తకాశినిమాటలు విని స్వాతంబున నెద్దియో తలంచుకొని అదరిపడి యొక్కంతవడి నేమియుం బలుకకఁ గన్నులంగ్రమ్ము బాష్పములం గోనగోరం జిమ్ముచు నుస్సురని పెద్ద నిట్టూర్పునిగిడ్చి యొక్కింత తలయెత్తి వాల్గంటీ! ఏమంటివి! నావంటి మందభాగ్యురాలి కనురూపవరుఁడెట్లు దక్కును. సమసుఖదుఃఖవగు నీతో నావృత్తాంతము జెప్పవలయునని తలంచుకొనుచు నెప్పటికప్పటి కెద్దియో వినోదమూలమున మరచుదానను నీవు వచ్చినది మొదలు నేనా గోష్టి మరచి నీతో విలాసంబుగా నుండుటచే నించుక యాహారము భుజించుచున్నదాన. అంతకుమున్ను నేను జీవచ్చవంబువలెఁ బడియుండుటయే గాని యొకరితో మాటలాడుటలేదు. ఆచిత్రఫలకంబునంగల మనోహరుని వృత్తాంతము జెప్పెద నాకర్ణింపుము.

మా తండ్రి నాకు యుక్తవయస్సు వచ్చినతోడనే వివాహము చేయవలెనని ప్రయత్నించి అనేక రాజకుమారుల రూపములు వ్రాయించి తెప్పించి నాకుఁ జూపెను. నేనును వారి వారి చరిత్రల సఖీముఖంబుగా విమర్శించి తెలిసికొని వారు సరిపడరని యెవ్వారిని వరించితినిగాను. నాకు మొదటినుండియు దివ్యప్రభావసంపన్నుఁడగు వాని బెండ్లయాడ నభీష్టమైయున్నది. ఇట్లుండునంత నేనొక్కనాఁడు వసంతకాలంబున సాయంసమయంబునఁ జక్కగా అలంకరించుకొని కతిపయప్రియసఖీజనంబు సేవింప నేతల్సౌధోపరిభాగంబునఁ బేరోలగంబునుండి మలయమారుతములు మేనులకు హాయిసేయ నిండువేడుకతో దంత్రీనాదమిళితంబులైన కంఠస్వరము లమరఁ బంచమస్వరంబున విపంచి వాయించుచుంటిని. అట్టిసమయమునం దాకాశమునఁ గలగల యని బంగారుచిరుగంటలధ్వని యొకటి వినంబడినది. దానికి వెఱఁగందుచు మేమందరము తలయెత్తి చూచితిమి. అప్పుడు గౌముదీరుచి నిచయముల బ్రచురమగు దీప్తిపుంజ మొకటి అల్లంత దవ్వునుండి మా కన్నులకు మిరుమిట్లు గొల్పుటయు జడిసి కన్నులు మూసికొని దిగ్గునలేచి దానికి నమస్కరించితిమి.

మరియు నాదీప్తిజాలములు మామేడయంతయు వ్యాపించుటచే నది యెట్టిదియో చూడవలయునని అభిలాష గలిగియున్నను గన్నులు దెరచుట శక్యమైనది కాదు. కొంతసేపు గన్నులఁగప్పికొని యట్టేయుంటిమి కాని క్రమక్రమముగా నా మెరుపు లదృశ్యమైనందున మఱల గన్నులఁదెరచి చూడగా మాయెదుట నొకపురుషుడు నిలువఁబడి యుండెను. అట్టిమోహనాంగుడెదుర నిలువబడినంత వానినాపాదమస్తకమును చూచి వర్ణించుచు బరమేష్టినైపుణ్యమునకు మెచ్చుకొనుచు వాడు తప్పక దివ్యుడని నిశ్చయించి యేమియుం బలుకక వాని పాదంబులంబడి నమస్కరించితిని. అప్పుడా మనోహరుఁడు తన మృదుపాణిపల్లవంబుల నన్ను మెల్లన లేవనెత్తుటయుం