పుట:కాశీమజిలీకథలు -02.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిలోత్తమ కథ

103

ధనము వ్యయపుచ్చి పెక్కువిద్యలు సంపాదించితిని. చదివినవి మాత్రము సాంగంబుగానే చదివితిని. నన్నింతగా నీవు పొగడవలదు. నేను నీకంటె విద్వాంసురాలనుకాను. భవదీయవిద్యామహత్వములు నిన్నటిసభలోనే పౌరులవలన వినియుంటి. నన్ను నీ చెలికత్తియలలో జేర్చికొమ్ము. అదియే నా కోరిక. మరియు అనురూపచరుని బడయకునికి గారణమేమని అడిగితివి. బుద్ధిశాలినివగు నీ కీప్రశ్న కుత్తరము జెప్పుట యనావశ్యకము. అనురూపశబ్దమున కర్థ మెద్దియో విచారింపుము. తగిన వరునింబడయుట దైవికంబు గదా నిన్ను గూడ నేనిట్టి ప్రశ్న అడిగినచో నాయవివేకము తెల్లమగును. కావున నేను నిన్నేమియు అడుగదలచు కొనలేదు. సఖ్యము సాప్తపదీనమని ప్రసిద్ధియున్నది. మనకిప్పుడు నేస్తంబు కలిగినది. ఇటు పైన నొండొరుల అభిలాషల జెప్పుకొనుట కేమి సందేహము! నెమ్మదిమీద అన్నియుం దెలియనగునని పలుకుచు దిలోత్తమ చిత్తంబును దృటిలో దన యధీనము చేసికొనినది రాజనందనయు జంద్రలేఖ పలికిన గంభీరవచనముల కెంతయు సంతసించుచు దన ప్రాణసఖులలో మొదటిదానిగాఁ జేసికొంటినని అప్పుడే వాగ్దత్తము చేసి గాఢాలింగనము గావించెను. అప్పు డిరువురకు నానందబాష్పములు ప్రసవించినవి. శుద్ధాంతకాంతలెల్ల వారి సఖ్యమునకు అనుమోదించిరి.

అది మొదలు వారిరువురు నాహారనిద్రాక్రీడావిహారాదుల నొకనిముష మేని విడువక యేకదేహమె ట్లట్లు వర్తింపుచు సంతతము విద్యాగానవినోదంబులతోఁ బ్రొద్దులు బుచ్చుచుండిరి. ఇట్లు కొన్నినాళ్ళు జరిగిన వెనుక నొక్కనాడు చంద్రలేఖ తిలోత్తమతో నేకాంతనిశాంతమందు గూర్చుండి యిష్టాగోష్టివిశేషంబుల సంభాషించుచు అల్లన నిట్లనియె.

సఖీ! మనమిప్పుడు నూతనయౌవనములో నుంటిమి గదా. ఇట్టి సమయంబునఁ బతిహీనులమైయుండుట లోకగర్హితమై యున్నది. అడవిగాచిన వెన్నెలవలె మన ప్రాయమంతయు వృధాగాఁ బోవుచున్నది. నాకుఁబోలె నీకు సైతమును రూపవరుడు లభింపమికి వింతగా నున్నది. నాది నీచజాతియగుట మా కులములోని పురుషుడు విద్యారూపములు గలిగియుండరు. అన్యకులకునిఁ బెండ్లి యాడుట శాస్త్రనిషిధము గదా కులవృత్తిమై వర్తించు నా యట్టిదాని కాదరణీయమేమో నీవే చెప్పుము. ఇవి అన్నియుఁ దిలకించియే నేనిట్టి కన్యావ్రతముతో నుంటిని. నీవు రాచపట్టివి. మీకులములో విద్యారూపప్రతాపవిహీనులు పుట్టనేపుట్టరు. నీవు కోరితివేని తగిన మనోహరుడు లభింపక మానఁడు. అదియునుంగాక నీవొక సుందరుని యాకృతిపటంబున వ్రాసి అట్టివానిం దెచ్చిన బెండ్లియాడుదునని చెప్పి యంటివఁట ఆ చిత్రఫలకమున నేనును గుడిలోఁ జూచితిని. అందున్న పురుషుఁ డెవ్వడు? వాని నెటు లెరింగితివి? అట్టివానిం నెప్పుడేనిం జూచియుంటివా? లేక నీ యూహవలననే అట్లు వ్రాసితివా! ఈ వృత్తాంతమువిన నాకు వచ్చిన నాటనుండియుఁ గోరికగా నున్నది. సమయము