పుట:కాశీమజిలీకథలు -02.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిలోత్తమ కథ

105

దదంగస్పర్శముచేత నామేనెల్ల గగుర్పొడిచి చెమ్మటలు గ్రమ్మి వణఁక జొచ్చినది. పిమ్మట నేను కొంతసేపటికి ధైర్యము దెచ్చుకొని కంఠమున గద్గదికఁ దోపనిట్లంటి.

మనోహరా! నీ వింద్రుఁడవా చంద్రుఁడవా, వసంతుఁడవా, జయంతుఁడవా వీరిలో నెవ్వఁడవు కానిచో నిట్టిరూపము గలిగియుండవు! ఆకాశమునుండి వచ్చుటచే దివ్యుఁడవని తేటయగుచున్నది. మరియుం దేవత లనిమిషులని వాడుకయున్నది. నీయందట్టి విధము లేకునికిఁ గారణమేమో తెలియదు నేను తిలోత్తమయనుదాన. నీపట్టణప్రభువైన శూరసేనుఁడను రాజు కూఁతురను. నేను దివ్య ప్రభావసంపన్నుఁ డగువానింగానిఁ బెండ్లియాడనని నియమము జేసికొంటి. నాకోరిక లీడేర్ప భగవంతుఁడు నిన్ను దయచేసెనని తలంచుచున్న దాన మీ వృత్తాంత మాకర్ణింప నా కెంతేని వేడుక యగుచున్నది. గోప్యము కాదేని నుడువుఁడని మోడ్పుచేతులతోఁ ప్రార్థించితిని.

అప్పుడతండు మందహాసముఁజేయుచు నేమియుమాటాడక నా సఖులపై దృష్టినెరయఁజేసెను. సేనాసన్నగ్రహించి యాసన్నవర్తిసులగు నా చెలికత్తియలనెద్దియో మిషఁబన్ని యవ్వలకుబోవఁ బనిచితిని. తరువాత నాతఁడు తన మెడలోనున్న పుష్పమాలికను నా మెడలో వైచెను. నేను సంతోషములోఁ దాపులు వెదఁజల్లు నా మాలిక ధరియించి మరల నా మెడలోనున్న ముక్తాహారమొకటి తీసి అతని మెడలో వైచితిని. బోఁటీ? పెక్కేటికి వినుము. మన్మథుడు దుర్లంఘ్యశాసనుఁడగుట వసంతసమయము మదజనకమగుట నచ్చోటు రమణీయమైనదగుట నూత్నయౌవన మవినయభూయిష్ట మగుట నింద్రియములు చపలస్వభావంబులగట మనోవృత్తి చంచలప్రకృతియగుట నన్నియుంగూడిన నెట్లుండునో యాలోచింపుము. అంత నప్పురుషపుంగవుండు నాకరం బనురాగంబునం బట్టికొని యల్లనప్రాంతమందున్న తల్పంబునకుందార్చెను. నేనును నేమి అనిన నేమి కోపము వచ్చునోయని భయపడుచు నతండుచేసిన చర్యలకు నొడంబడుచుంటిని. మూడహోరాత్రము లేకరీతి నొకక్షణమైనను విడువకం గ్రీడింప మాకు గడియలాగైననుఁ దోచలేదు నా చెలికత్తెయ లావృత్తాంత మెరిఁగి యుండిరికావున నితరుల నచ్చటికి రానీయక కావలియుండి మా తలిదండ్రులకుఁగూడ నేదియో మిషఁజెప్పి యామర్మమును దెలియనిచ్చిరి కారు నెచ్చెలీ! పిమ్మట జరిగిన వృత్తాంతమేమని వక్కాణింతు నామూడుదినములు నాశృంగారకళానైపుణ్య మంతయు దేటఁబడి నాయొడయునితో నలరితిని.

మఱియు నాసమయంబున నొండొరులకు శృంగారవాగ్రచనావిలాసంబులు మాపుటయేకాని కుశలప్రశ్నావకాశ మింతయుం గలిగినదికాదు. ఒండు రెండు సారులు నాకట్టి యుద్యమము పొడమినదికాని యేమనిన నేమి కోపము వచ్చునో అని యూరకుంటిని. అట్లు సంతోషపారవారవీచికలం దేలియాడుచు మేము మూడవనాఁటి