పుట:కాశీమజిలీకథలు -02.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కాశీమజిలీకథలు - రెండవభాగము

రాత్రి వేగుజామువరకు రతిక్రీడలం జొక్కి నిద్రాయమత్తులమైతిమి. కాంతా! అంత నిశాంతమ్మున నేను లేచి చూచువరకు నా మనోహరుఁడు శయ్యపైలేఁడు. అప్పుడదరిపడి నలుమూలలు వెదకితినిగాని యెందును గనంబడలేదు. పిమ్మట నావయస్యలంజీరితిని. వారును ప్రాంతమందే వేచియున్నవారు కావున నాపిలుపు వినంబడినతోడనే తటాలునఁ జనుదెంచిరి. వారింజూచి నా వల్లభుఁడెందుఁబోయెనో యెరుంగుదురా అని అడిగితిని. వారేమియు నెరుంగమని చెప్పిరి. మేమందరము లేచి యామేడలో నడుగు మేరయైనను విడువక మిగుల శ్రద్ధతో వెదకితిమి కాని ప్రయత్నంబులేమియు సఫలంబులైనవికావు.

పిమ్మట నేను నిరాశఁజేసికొని యేమియుందోచక నేలంజదికిలబడి వాని చర్యలన్నియుం దలంచుకొనుచు వెక్కి వెక్కి యేడువఁదొడంగితిని. అప్పుడు నా సఖులు చుట్టుకొని అయ్యో ! యిదియేమి చర్య ఈపాటి వియోగము సహింపలేవా? మనమొకటి మరచితిమి. అతండాకాశము నుండి వచ్చెనుగదా! యిప్పుడు సైత మా దారినే పోయి యుండవచ్చును. మరల వెంటనే రాకమానఁడు. దీనికి నీవు చింతింపనేల. అతని యాగమనంబు వీక్షించుచుండుమని నాకు ధైర్యము గరపిరి. ఆ మాటలు విని ధైర్యంబు దెచ్చుకొని యాదినము సాయంకాలము వరకు నాకాశంబు నలుమూలలకు దృష్టి ప్రసారములు జరగించితినికాని యేమియు లాభము లేకపోయినది. ఆకాశంబు జూచువరకు నాకన్నులు చిల్లులుపడినవి అది మొదలు కంటికి నిద్రరాదు. నోటికాహార మింపుకాదు. ఏపనియుం దోచదు సర్వదా అతఁడే కన్నులకు గట్టినట్లుండును. సఖీ! నీతో నేమని వక్కాణింతు. నేఁటికతండుపోయి సంవత్సరమైనది నీతో మాట్లాడుచునే యుంటినికాని నాబుద్ధి యతని అందేయున్నది. ఇప్పటికిసైత మాశవదలక బయలు చూచుట అలవాటుపడినది. నీవు వచ్చినది మొదలు కొంచె మాహారము రుచింపుచున్నయది. ఈ నడుమ మాతండ్రి యీ గొడవ యేమియు నెరుఁగక నన్ను వివాహమాడుమని నిర్బంధింపగా నేమియుంజెప్పక నామనంబున నాటియున్న నామనోహరుని యాకృతిఁ జిత్రపటంబున వ్రాసియిచ్చి యటువంటి పురుషునిఁ దెచ్చినఁ బెండ్లి యాడెదనని చెప్పితిని. అతండు పటమును దేవాలయంబునం గట్టింపఁబోలు. ఇదియే నావృత్తాంతము. ఈ రహస్యము నేనును నా చెలికత్తియలుతప్ప యితరులెవ్వరు నెరుఁగరు. నీవును నా ప్రాణసఖివిగసుక వక్కాణించితిని. నావంటి దురదృష్టవంతురాలి కట్టిప్రియుఁడెట్లు దక్కునని మిక్కిలి పరితపించుచు నతడు తనమెడలో వైచిన పుష్పమాలిక మందసములో భద్రముగా దాచి యుంచినది కావున దానిందెప్పించి చంద్రలేఖకుఁ జూపినది.

అప్పుడు చంద్రలేఖ యాదండ రుచికు డల్లినదానిగా గురుతుపట్టి వికలమతియై యిట్లు తలంచెను ఆహా! ఈ వృత్తాంతమంతయు మిక్కిలి చోద్యముగా నున్నది ఎక్కడి జగన్నాథము? యెక్కడి రుచికుఁడు ? యెక్కడి రామచంద్రనగరము! యెక్కడి యాకాశగమనము! యెక్కడి తిలోత్తమ! ఇట్టి అద్భుతము