పుట:కాశీమజిలీకథలు -02.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిలోత్తమ కథ

107

లెప్పుడునుఁ గనివిని యెఱుంగము. రుచికునికి వియద్గమనశక్తి కలిగియున్నట్లు తోచుచున్నది. తన్మూలంబున నతఁ డాతోఁట గోడ దాటిపోయెను కాబోలు. అట్టిశక్తి రుచికునికిఁ గలిగియున్నచో నతని బాల్యస్నేహితుఁడైన గౌతముఁ డెరుఁగడా? యెఱింగి యుండిన నాతో నేమిటికిఁ జెప్పకుండును కావున నదియును నిశ్చయింపరాదు. కానిమ్ము మరికొన్నిదినములు నేనిందుండెద నెప్పటికేని మరల నాదివ్యుఁ డిందులకుఁ రాకుండునా? వచ్చినంబట్టుకొనిన సర్వము నతనివలఁన దెలియనగునని యీరీతిఁ బెక్కుతెఱంగులఁ దలపోసి యారహస్యమేమియుఁ దిలోత్తమకుఁ దెలుపక మరల దానితో నిట్లనియె.

బోఁటీ! వచ్చినవాని కులశీలనామంబులు దెలియకుండ మగనిగా వరించుట కొంచెపుసేతకాదా! వరించితివివో! నడుమ అడిగినందప్పా? అప్పురుషుండును నీ తెఱఁగెరుఁగకుండ నీవువోలె నూరక నీతో గ్రీడించుటయుఁ జిత్రముగా నున్నది. కానిమ్ము కడచిన పనికి వగచిన ప్రయోజనములేదు మరల నంత డెప్పటికేని రాఁగలఁడని నాకునుం దోచుచున్నది. నీవు చింతిల్లకుము. నేనును దీనిని గురించి ఆలోచించుచుండెద నని పలుకుచు నెట్టకే దాని దుఃఖము బోఁగొట్టినది. నాఁటఁగోలెఁ దిలోత్తమకువలెఁ జంద్రలేఖకును దివ్యదృష్టి యభీష్టమైనది.

బలసింహుని కథ

ఇట్లుండునంత నారాజు బావమరది బలసింహుఁడను వాఁడు చంద్రలేఖ యాయూరిలో సభఁ జేసిననాటనుండియు దానిని వలచియున్నవాఁడు గావున విరాళిం గుందుచు మరల దానిం జూచి మాట్లాడవలయునని యెన్నియో ప్రయత్నములు చేసెను. కాని యప్పల్లవపాణి యెల్లప్పుడు తన మేనకోడలు తిలోత్తమ యంతఃపురమున నివసించి యుండుటచే శక్యమైనదికాదు.

బలసింహుఁడు ప్రతిదినమున వేశ్యను వశపరచుకొనుట కెన్నియో తంత్రంబులు మంత్రంబులు క్రియలు జరుపుచుండుటచే నాసంగతి గ్రహించి పూవుఁబోడి తన యజమానురాలగు చంద్రలేఖతో వాని వలపు పొలుపును మంత్రతంత్రప్రయోగరీతియుం జెప్పిన నప్పడతి అంతగా విశ్వసించినదికాదు. ఒకనాఁడు బలసింహునిచే బోధింపబఁడి మంధరయను పరిచారిక యేకతమ చంద్రలేఖ యొద్దకుఁ బోయి రహస్వముగా నిట్లనియె.

యువతీ! నీతో నొకరహస్యము చెప్పవచ్చితిని. అదియుఁ నీకు సుఖప్రదమైనదని సాహసించితిని. మరియొకలాగునఁ దలంపకుమా, మారాజుగారి బావమరిది బలసింహుడు నిన్ను సభలోఁ జూచినది మొదలు మదనశరముల కెరయైయున్నవాఁడు.