పుట:కాశీమజిలీకథలు -02.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కాశీమజిలీకథలు - రెండవభాగము

అతని వైభవము నిదివరకే వినియుండవచ్చును. శూరసేనుండు సైత మతనికి జడియుచుండును. మా రాజుగారికిఁ బుత్రసంతతి లేనందున నీ రాజ్యమతనిదిగా భావింపుము. మారాణికి బలసింహుని యందు మిక్కిలి యక్కటికము గలిగియున్నది. పిన్ననాట నుండియు నతని నామెయే పెంచినది పెక్కేల నామెకు బలసింహునియందుఁ దిలోత్తమయెడకన్న నెక్కుడు మక్కువ గలిగియున్నది. రూపంబున నీకు దగినవాడు. అట్టి పురుషుఁడు నినుఁ జేపట్టఁ దలఁచికొన్నవాడు. నీవును వారాంగనవుగదా. దీని కేమికొదవయయ్యెను. సంతతము నీ విద్యారూపంబులకే యచ్చెరువందుచుండు. వేయినేల తన ప్రాణము నీయధీనము చేయుదునని చెప్పుమనియె. యొప్పుకొనినం జక్కగా నుండునని నాకు దోచెడిని. కుసుమకోమలమైన యీ జవ్వనమంతయు వృధఁజేయకుము. మా రాజపుత్రిక నున్మత్తగా నెంచికొంటిమి. నీవును నట్టి వెర్రిత్రోవంబడక నా చెప్పిన చొప్పున నొప్పుకొనుము. నీకు మేలయ్యెడినని మరియుం బెక్కు విధముల దన చాతుర్యమంతయుం దేటఁబడ బోధించినది. ఆ మాటలన్నియు విని చంద్రలేఖ మందహాసము సేయుచు నోహో! మందరా! నీవు మందరయంత దానవగుదువు. నాహితంబు కోరి చెప్పినందుల కెంతయు సంతసించితిని. కాని యట్టి యుద్యమము నాకు గలుగలేదు. ఊరక నావిషయమై విరాళిఁగుందుట బలసింహునికిఁ దగదని నుడువుము మరియు నేను వారకాంతనైననుఁ బరాయతనై యుంటినిగాని స్వైరిణిగాను. నా ప్రాణవల్లభుఁడు దేశాంతరమందున్నవాడు కావున నీ వీమాటలం బోయి చెప్పుము. మరియెప్పుడును నేసందేశమును నాయొద్దకుఁ దీసికొని రాకుము. పోపొమ్ము. అని తిరస్కారపూర్వకముగాఁ బలికినది.


అప్పుడు మంధర చిన్నవోయి మారుమాట పలుకక యలుకమెయి వచ్చినదారిం బోయి బలసింహున కంతయుం జెప్పి యప్పా! యిప్పు డప్పడఁతి రాజపుత్రిక సాంగత్యంబు కలిగెనని మిగుల గర్వముతో నున్నది. నిన్నును నన్నును లెక్క సేయునా? యని కేరడమాడినది. అప్పుడుబలసింహుని చిత్తంబున లజ్జాక్రోధంబు లుత్తలపెట్టినవి గాని చంద్రలేఖపయింగల వలపుపెంపునం జేసి యవి వెంటనే యణగిపోయినవి. తరువాత నతఁడు మంధరకొక పారితోషికమిచ్చి ఓసీ? యింత మాత్రమునకు నీవు విరక్తిఁ బొందకుము. మత్తకాశినుల చిత్తంబులు క్షణక్షణమునకు మారుచుండును. నీకు మరియుం బారితోషిక మిచ్చువాఁడ. సర్వదా యాచంద్రలేఖ చిత్తంబును గనిపెట్టి యంతరముననే తిరుగుచుండుము. సమయమరసి నాతోఁ జెప్పుము. కోపముసేయక నిదానించుమని యెన్నియో బుద్ధులు గరపి దానింబంపెను.

పిమ్మట బలసింహుఁ డేమియుందోచక యంతకంతకుఁ గంతుసంతాపము మీరుటయు నా పట్టణంబులో శకునంబులు సెప్పునట్టి యొక యోగియొద్దకు రహస్యముగాఁబోయి తాను వారకాంతను వలచుటయు నది తన్ను నిరాకరించుటయు లోనుగా నగు కథ యంతయుం జెప్పి యప్పూఁబోణి తనకు వశ్యమగునట్లు చేయుదువేని నీవు