పుట:కాశీమజిలీకథలు -02.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలసింహుని కథ

109

కోరిన ధనమిత్తునని పలికెను. ఆ మాంత్రికురాలు వాని మాటలు విని మిగుల సంతసించుచు నోహో ఇది యెంతపని. ఆ కాంత నీచేతిలోనిదానిగాఁ దలంపుము. నా ప్రజ్ఞావిశేషంబు చూచి నీవే సంతసింతువు. నాకిచ్చు సొమ్మెంతయో చెప్పుము. దానిలో సగము ముందుగా నీయవలయును. తరువాత బహుమతితోఁ గూడ తక్కిన సగము నిచ్చెదవుగాని యిప్పుడే యాయోషధి సిద్ధము చేసి నీ కిచ్చెదనని చెప్పుటయు సంతసించి బలసింహు డిట్లనియె.

దేవీ? నేను పెద్దల చాటువాఁడనని యెరుంగుదువు గదా అట్లైనను ముందు నీకు రెండువేల నిష్కము లిచ్చెదను. తరువాత నాయీవి చూచుదానవుగదా. ఈ మాత్రమునకు సంతసింపుము నీ యుపకార మెప్పటికి మరువనని బ్రతిమాలఁ దొడంగుటయు నర్ధాంగీకార సూచనము జేయుచు కానిమ్ము తెమ్ము. సొమ్మున కేమి మాటకావలయును గదా యని పలికెను. బలసింహుఁ డప్పుడే పోయి యాసొమ్మంతయుం దెచ్చి రహస్యముగా దానికిచ్చెను. అదియు సంతసంబుతోఁబుచ్చుకొని స్నానము చేసి రమ్మని యొక మంత్రముపదేశము చేసి యిట్లనియె.

శ్లో॥ శివశిరసిస్థితమాల్యం జీవంజీవక మయూరయోరస్థి
      వామక రేణగృహీతం వాత్యావర్తోద్దితం పత్రం.

రాజపుత్రా? ఏతదాద్వనేకశ్లోకసమ్మతమగు నీ చూర్ణమును నేనుపదేశించిన మంత్రమును జపించుచు నీవు కోరిన చంద్రలేఖ శిరముమీదఁ జల్లుము. నీకుఁ గుక్క లాగున వశ్యయై నీవున్న చోటునకు వచ్చి సంతతము నిన్ను విడువకుండునని చెప్పి యాచూర్ణ మిచ్చి యంపినది.

అతఁడా చూర్ణమునుఁ బదిలముగా మూటఁగట్టుకొని యయ్యోగిని చెప్పిన చొప్పున నా మంత్రమును జపించుచు సంఖ్యాపూర్ణమైన వెనుక చంద్రలేఖ శిరంబున నోషధీచూర్ణము జల్లుట కవకాశము వెదకుచు నొక్కనాఁడు రాత్రి యంతఃపురరక్షకులకు మిక్కిలి రొక్కము పంచిపెట్టి యెట్టకేలకు మందరతోఁగూడ చంద్రలేఖ యున్న మేడలోనికిఁబోయెను. మంధర చంద్రలేఖ పండుకొనియున్న గది యెరిగియున్నది. కావున నచ్చోటికిఁ దీసికొనిపోయి యతని కా నాతిం జూపినది. చంద్రలేఖ గాఢముగా నిద్రఁబోవుచుండుట పరికించి శిరమున కా చూర్ణము విసరినతోడనేఁ దనతోఁ గుక్క లాగున వచ్చునను నమ్మకముతో నా చూర్ణము తీసి దాని తలపై రుద్దెను.

అప్పుడా చంద్రలేఖ యదరిపడి లేచి కన్నులు నులిమికొనుచు నెదుర నిలువంబడిన బలసింహుని జూచి భయపడి యెవ్వఁడవు నీ వని యడిగినది. అతండును హ్రాం, హ్రీం, క్లీం, హు, మ్మని యా మంత్రమును జపించుచు నా చూర్ణంబును మరలఁజల్లుచు నేను. నేను రమ్ము. రమ్ము, అని పలుకఁగా నక్కలికి యలికిపడి యోహో! నేననఁగా నేమి నీ వెవ్వఁడవు యీ యర్ధరాత్రంబున నిచ్చటి కేల వచ్చి