పుట:కాశీమజిలీకథలు -02.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కాశీమజిలీకథలు - రెండవభాగము

తివి? యీ దుమ్ము నా శిరమ్మున రాయుటకేమి కారణము. చెప్పుమని యడిగినవాఁడు అయ్యో! చంద్రలేఖా? నేనే! యింకను దెలియదా యేమి? నిద్ర మెలకువ రాలేదు. కాఁబోలు. ఈసారి తెలియునులే యని తన చేతిలో నున్న చూర్ణమును మరల దాని నెత్తిమీదఁ జల్లెను.

అప్పుడది మిగుల వెఱపుతో దొంగ దొంగ అని అరచినది. ఆ రొద విని యంతఃపురకాంతలెల్లరును లేచి అచ్చటికి వచ్చిరి. ఆ యలజడిలో నిలువ భయఁపడి బలసింహుఁడు వచ్చినదారిఁబట్టి పారిపోయెను. ఆధ్వని విని తిలోత్తమ లేచివచ్చి దొంగ వచ్చెనా అని అడిగినఁ జంద్రలేఖ బలసింహుని క్రౌర్యమని గ్రహించియుఁ దన్మూలమున నది చిన్నవోవుననితలంచి యేమియు నెరుఁగని దానివలె మాట్లాడినది. అంత నబ్బలసింహుఁడు నంతఃపురములో నల్లరి జరిగినందులకు భయంబు జెందుచు నాసంగతి వెల్లడియైనచో రాజే తన్ను శిక్షించునని వెఱచుచు మంత్రంబును తంత్రంబును నేమియు బ్రయోజనమైనవి కావని మాంత్రికురాలిందిట్టుచుఁ జంద్రలేఖ యొకవేళ మందు తల కెక్కిన వెనుక ననురాగముఁ జెంది తన్ను వెదకికొనుచు మరల వచ్చునేమో యని యాశతో నలుమూలలు బరికింపుచు నే మాత్రము చప్పుడైనను దానిపాదధ్వనితలచి యిటురమ్ము ఇచ్చట నున్నాఁడనని మెల్లగా బలుకుచు నీరీతి నతిప్రయత్నముతో నా రాత్రివేగించెను. ఉదయంబున దన్నుఁ జూడవచ్చిన మంధర గాంచి యేమే! బోఁటీ! నేను వచ్చినతరువాత జరిగిన యంతఃపురవిశేషములేమి? నన్ను గురుతుపట్టలేదుగద. మాంత్రికురాలు నన్ను మాయజేసినట్లు తలంచెదనుసుమీ! అది నాప్రస్తావనయేదైనను నీయొద్ద తెచ్చినదా? నామందు తల కెక్కమినట్లున్నది. కాని యీపాటికి దాని హృదయములోఁ గొంచెము కొంచెమనురాగ మంకురింపుచుండు ననుకొందును. నీవేమని యెదవని బలుఁకగా నది నవ్వుచు నిట్లనియె.

మేలుమేలు, నిన్ను మాంత్రికురాలు చక్కఁగామాయఁజేసినది. దానికి నీయం దెంతమాత్రము నిష్టములేదు నీవూర కాశపడియెద వేటికి? తిలోత్తమతోఁ నీవార్త యేమియు మొదటఁజెప్పక మఱియొక రీతి బొంకినది. అప్పుడు నేనది నీమందు పని చేసినదనుకొంటిని గాని తరువాత నుదయమున నన్నుఁ జూచి కోపంబుతో నిట్లనియె. మంధరా! బలసింహుఁడుచేసినకృత్యము నేను గ్రహించితిని. రాజబంధువుఁడను బుద్ధితో నీసారి కూరకుంటిని. దీనికి నీవు కారకురాలవు. ఇంకొకమాఱు మీరిట్లు చేసితిరేని రాజుగారితోఁ జెప్పకమానను. నీబలసింహుని బుద్ధిగలిగి యుండుమని చెప్పుము. మొదటఁజెప్పిన సంగతి మరచితివా? అంతఃపురచారిణివగు నీ కిట్టిబుద్ధులు తగపు పొమ్ము. అని నన్ను భయపెట్టినది. కావున నీవు చంద్రలేఖపైఁ గల యాశ వదలివేయుము. లేదా మరియొకయుపాయ మాలోచించుకొనుము. తిలోత్తమయుఁ జంద్రలేఖయు రెండుమూడుదినముల కీయూరిప్రాంతములోనున్న యుద్యానవనంబు లోనికిఁ బోయి యందుఁ గొన్నిదినంబులు గ్రీడింతురట. ఈమాటయు వారివలననే నింటి.