పుట:కాశీమజిలీకథలు -02.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలసింహుని కథ

111

నివియే యంతఃపురవిశేషంబులు అని చెప్పియరిగినది. అప్పు డతఁడు హృదయమున రోష మావేశింప నౌరౌరా! రాజపుత్రికతో మైత్రి కాబట్టికదా బోగముతొత్తున కింత మత్తత గలిగినది. కానిమ్ము. దీనిపని పట్టించెదను. ఉద్యానవనమునకుఁ బోవనీ యని తలచి యప్పుడే యాపట్టణంబున గజదొంగలని పేరుపొందిన మర్కటమారీచులను వారియింటికిఁ బోయి యంతకుఁపూర్వమే వారితో మైత్రి గలిగియున్నవాడు కావున వారిని కుశలప్రశ్నవేసెను. వాండ్రును బలసింహుని మిగుల మర్యాదఁజేసి కూర్చున్న వెనుక నాగమనకారణ మడిగిరి.

బలసింహుఁడు తనకథయంతయుం జెప్పి యాచంద్రలేఖ యుద్యానవనములో నిద్రించుచుండ మంచముతోఁగూడ నా ప్రచ్ఛన్నగృహంబునకుఁ దీసికొనిరావలయును. మీకుఁ దగిన పారితోషిక మిచ్చెదను. మీమే లెప్పటికిని మరువనని ప్రార్ధింపఁగా మర్కటమారీచులందులకు సమ్మతించి యప్పుడే యతనిచేఁ బారితోషికమంది సమయ మరయుచుండిరి. అంత మరిరెండుదినములకుఁ దిలోత్తమయుఁ జంద్రలేఖయు నుచితసఖీపరివారము సేవింప బాహ్యోద్యానవనంబునఁ గ్రీడింప నరగిరి. అయ్యుపవనంబునకుఁ జుట్టునుఁ బ్రహరియున్నది. లోపల ననేకవిచిత్రములైన మేడలున్నవి. అందు వారు నిరాఘాటంబుగా విహారంబు చేయుచుఁ గొన్ని దినంబులుండిరి.

వారిగుట్టంతయు మంధరచేతఁ దెలిసికొని బలసింహుఁడు మర్కటమారీచులకుఁ దెలుపగా వాండ్రును నొక్కనాఁడు రాత్రి సమ సహచరులఁ గొందర వెంటబెట్టుకొని యత్తోఁటగోడకు మారుమూలఁ గన్నంబువైచి లోనికిఁబోయి తిలోత్తమయుఁ జంద్రలేఖయుఁ బరుండియున్న మేడ వెదకిపట్టుకొని దాని యుపరిభాగంబున నిద్రించుచున్న వారిద్దరిం గనుంగొని గురుతుపట్టజాలక సంశయించుచు దమకుఁ దోచిన యూహ చొప్పున దిలోత్తమనే చంద్రలేఖ యనుకొని యామె మంచంబును భుజముల నానుకొని మెల్లగా నాగోడలన్నియుం దాటి కన్నము వెంపటబడి నీవలకు వచ్చి గూఢంబుగా బలసింహుఁడు నివసించియున్న రహస్యగృహంబునకుఁ దీసికొనిపోయిరి.

ఆహా! వారిచోరచాతుర్య మెట్టిదో చూడుము. ఎంతదూరము నడిచినను నప్పడఁతికి నిద్రాభంగ మైనది కాదు. బలసింహుఁడు వాండ్రతో మొదట తిలోత్తమాచంద్రలేఖల గురుతులు చెప్పుట మరచిపోయెను. కావున నావిషయమై యనుమానము జెంది వాండ్రు మంచమును తీసికొని వచ్చినతోడనే దీపము పెట్టి చూచి పరీక్షించెను. అత్తరుణి తిలోత్తమయని తెలిసికొనినంత బలసింహునకు మేను వణకజొచ్చినది. కంఠము గద్గదికమైనది. చెమ్మటలు మేనెల్ల గ్రమ్మినవి అప్పుడు వాండ్రతో సన్ననియెలుంగున నోరీ! కొంపముంచితిరే! ఇది నామేనగోడలు, తిలోత్తమ. దీనికి మెలకువ వచ్చెనేని నన్ను గురుతుపట్టును. వేగిరము తీసికొనిపోయి యథాస్థానమం దుంచుఁడు. లేకున్నముప్పువచ్చునని పలుకుచు హస్తసంజ్ఞాపూర్వకముగా వాండ్రను తొందర పెట్టెను.

అప్పు డాచోరులు భయపడుచు బలసింహునిపై విసిగికొనుచు మరల నా