పుట:కాశీమజిలీకథలు -02.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుచికుని కథ

99

ఈ బలదేవునికొడుకు రుచికుఁడను వాఁడు మీయింట నున్నాడఁట. వానిం దీసికొని పోవుటకు వచ్చితిమి. సామమున పంపుదువా? క్రమప్రకారము చేయమా అని బెదరించిన నత్తలోదరి రుచికుఁ డెవ్వఁడో మే మెఱుఁగము. మాయింటికి రాలేదు. క్రమ మేదియో అట్లు చేసికొనవచ్చునని నిర్భయముగాఁ జలికినది. అప్పుడందరు లోపలికి బోయి కరదీపికలఁ దాల్చి దాని యిల్లంతయు వెదకిరి. ఎందును వానిజాడ కనంబడినదికాదు. అంతలో దెల్లవారినది. అప్పుడు గౌతముఁడు పెరటిలోనికిం బోయి నలుమూలలు చూచుచుండ నిష్కుటద్వారకవాటము గనంబడినది. దానితలుపు తీయమని కోరినఁ జంద్రలేఖ యా యుద్యానవనము తనది గాదనియుఁ మరియొకరి తోఁటకుఁ బంపుటకు తన కధికారము లేదనియు దానిముద్ర తనయొద్ద లేదనియుఁ జెప్పి పెద్ద తడవు వాదించినది. గాని రాజభటులు సమ్మతింపక బలాత్కారముగా ముద్ర విడఁగొట్టి యాతోఁటలోఁ బ్రవేశించిరి.

అత్తరి నత్తన్వి హృదయమున దిగులుపడి యేమియు మాటాడక మేడమీఁదికి బోయి పశ్చాత్తాపముఁ జెందుచుఁ బూవుబోణి! మన మనవసరపుకృత్యము గావించి బొంకరులమైతిమి. అయ్యో! ఇంత యేల వచ్చినది పిలిచి నప్పుడే యథార్ధము చెప్పిన ముప్పులేక పోవునుగదా. రుచికుని పిరికితనము జూచి యిట్టిపూనిక వహించితిమి. కానిమ్ము నీవు బోయి యక్కడ నేమేమి విశేషములు జరుగునో చూచి రమ్మని పంపినది. పువ్వుఁబోఁడి పోవువరకు నాతోఁటనంతయు వెదకి రుచికునిం గానక విచారింపుచున్న బలదేవు నూరడింపుచు నీవలకు వచ్చుచుండిరి. ఆవార్త దెలిసికొని పువ్వుబోఁడి వడివడిఁ బోయి చంద్రలేఖ కెరింగించినది. అతండందు లేడను వార్త విని చంద్రలేఖయు మిక్కిలి విస్మయముఁ జెందుచుఁ గాని మ్మామాటఁ తరువాత విమర్శింపవచ్చును. ఇప్పటి కీయవమానము దాటినదికాదా యని సంతసించుచు నక్రమముగాఁ దనయిల్లు బరీక్షించినందులకై యభియోగము దెత్తునని యెదురువారిని బెదరించినది. అప్పుడేమియు మాటాడలేక లజ్జావనతముఖులై వారెల్ల వచ్చినత్రోవంబోయిరి. రాజభటులు గౌతముని యనిమృశ్యకారిత్మమునకు మిక్కిలి నిందించిరి. వార లేగినవెనుకఁ జంద్రలేఖ పువ్వుబోఁడితోఁ గూడికొని యాతోటలోనికి బోయి కొమ్మకొమ్మ చెట్టుచెట్టునందుఁ గొంచెమైన విడువక వెదకినదికాని యెందును రుచికుని జాడగనంబడలేదు.

ఆ తోఁటకు రెండవదారిలేదు. దానిప్రహరి మిక్కిలి యెత్తయినది. అతఁ డందు లేకుండుటకు గారణముఁ దెలియక అక్కలికి మిక్కిలి పరితపించుచు రహస్యముగా పూఁబోణిఁ బంపి యాగ్రామ మంతయు వెదకించినది. కాని యెందును గనంబడలేదు. మరికొన్నిదినము లరిగిన తరువాత నొకనాడు గౌతముడు చంద్రలేఖయొద్దకు వచ్చి యర్చితుండై యల్లన నిట్లనియె. బోఁటీ! నీవు లోకముపాటి యాటవెలఁదివికావు విద్యలచే ననవద్యవై యుంటివి. బలదేవుడు పుత్రవియోగదుఃఖంబునఁ జివికి ప్రాణావశిష్టుఁడై యున్నవాడు. అపాపమేలఁ గట్టుకొనియెదవు. రుచికుని విడిచి పెట్టుము. నీకు