పుట:కాశీమజిలీకథలు -02.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కాశీమజిలీకథలు - రెండవభాగము

పొందుచుఁ గంతు, వసంతాదుల మించియున్న రుచికునింగాంచి యక్కాంచనగాత్రి హర్షపులకితగాత్రియై మోహావేశముజెందుచు లేచి వాని నుచితపీఠంబునం గూర్చుండ నియమించి స్వాగతపూర్వకముగా నిట్లనియె.

ఆర్యా! నిన్నుజూడక పోయినను నీవుగట్టిన దండలు నీపరిచయము గలుగఁజేసినవి. ఈవిద్యయొక్కటియే యక్కజమనుకొనుచుంటిమి. రూపమంతకంటె వింతగానున్నది. నీవీవిద్య నెక్కడ సంపాదించితివి? నీకు గురువులెవ్వరు? నీకులశీల నామంబు లెట్టివని పలుకుచు శృంగారవిలోకనములతని మొగంబున వెలయించి వాని హృదయమును స్మరవికారము నొందించినది. రుచికుడు తదీయవిభ్రమవిలోలచిత్తుండై యున్మత్తుండువోలె వక్తవ్యాంశము నెఱుంగక యేమేమో చెప్పదొడంగెను. వాని చిత్తచాంచల్య మరసి యమ్మత్తకాశిని చిత్తజునివంటి యాప్తుండెందును లేడుగదాయని సంతసించుచు నాతడే తన మనోహరుడని నిశ్చయించుకొని మనసుచే వరించి యవ్విషయ మెఱుకపడనీయక కపటముగా మాటాడుచు సంగీతము పాడి మోహము గలుగఁ జేయుచుఁ చందనతాంబూలాది సత్కారంబుల బరిహాసపూర్వకముగాఁ గావించుచు వానిం శృంగారలీలాజలధి వీచికలఁ దేలిఁయాడజేయుచుండెను.

అంతలో వీధిద్వారముదాపున నేదియో సందడి వినంబడినది. అది ఏమని విచారింపుచున్నంత రాజభటులు తలుపుతీయుఁ డని అఱచిరి ఆ రొదవిని రుచికుం డదరిపడి అయ్యో! ఇఁక నేమియున్నది. గౌతముఁడు పోయి మాతండ్రి నిచ్చటికిఁ దీసికొనివచ్చెను నే నొక్క నిమిషము గనంబడినిచో మాతండ్రి మిక్కిలి పరితపించును. కదలక కదలక యిల్లు కదలి యంత అల్లరిపా లయితినేమి? ప్రమాదము వచ్చినది. నీప్రియవాక్యముల విని నేను వెనుకటి కథలు మరచితిని. న న్నొకచోట దాచి యవమానము రాకుండఁ గాపాడుమని వేడుకొనుటయు నవ్వుచు నాచంద్రలేఖ యిట్లనియె. రుచికా! నీవు వెఱవకుము. మాయింట దాగినవానిని బరమేశ్వరుఁడు పట్తుకొనలేడు. నీతండ్రిమాట లెక్కయేమని పలికి అతనికొక గుప్తమందిరము చూపినది. అది మా తండ్రి వెదకక మానడు. మరియొక రహస్యస్థలము చూపుమని అడిగెను అమ్ముదితయుఁ దనయింటనున్న గూడ ప్రదేశము లన్నియుఁ జూపించినది కాని అతండంగీకరింపక వేరొకటిలేదా అని అడుగుచుండును. చివరకది తనయింటినిఁ జేరియున్న యొక యుద్యానవనము జూపి దానికి రెండవదారిలేదనియుఁ బదిదినములు వెదికినను నందున్న గనంబడరనియుం జెప్పి వానినందొక మందిరమున నుండ నియమించి యా దొడ్డితలుపు బిగించి యీవలకు వచ్చినది.

అంతలో రాజభటుల యార్పులతిశయించి చంద్రలేఖ హృదయభేదకము గావించినవి అక్కలికి వెఱచుచుఁ దలుపులు దీయించినది. అందు గౌతముఁడును బలదేవుఁడును రాజభటులతో నిలువంబడియుండిరి. వారినిఁ జూచి చంద్రలేఖ యీ అర్ధరాత్రము మీ అందఱు మాయింటి కేమిటికి వచ్చితిరని అడిగిన రక్షకభటు లిట్లనిరి.