పుట:కాశీమజిలీకథలు -02.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కాశీమజిలీకథలు - రెండవభాగము

భళిభళీ! అని మెచ్చుకొనుచు జూచిన సౌధమే చూచుచు బోయిన వీథికే పోవుచు విన్న గానమే వినుచు బెద్దతడవా వీథినే తిఱుగుచుండెను.

ఒకచోట వారాంగనానిమిత్తమునఁ జేసి యిరువురు బ్రాహ్మణులు కలియబడి పోట్లాడుచుండుట చూచి రుచికుఁడును గౌతముఁడును విడిపించిరి. ఆ సందడిలో రుచికుని చేతనున్న పూవుదండలు నలిగి పోయినవి. అప్పుడతండు గౌతముం జూచి అన్నా! దండలు నలిగిపోయినవి. వీనినెవ్వరును గొనరు మాతండ్రి యింటికి వచ్చు వేళ కావచ్చినది. మనమిక నింటికిఁ బోవుదమే ? అని పలికిన అతండును సమ్మతించెను. ఇరువురునుఁ గదలి యింటికి బోవుచుండ నాదారిలో నొక చిత్రసౌధము వారికి నేత్రపర్వము గావించినది.

తద్విశేషములరయుచు నొక్కింత తడవువారందు నిలువంబడిరి. అప్పుడా లోపలినుంచి యొకపూబోఁడి వాకిటకువచ్చి యెవ్వరి నిమిత్తమో పరిశీలింపుచుండెను. అప్పుడా వీధింబడి యొక విటపురుషుండు పోవుచుండ వానింజూచి యా చిన్నది రసికశేఖరా! ఇటుచూడక పోవుచుంటివేమి? నన్ను గురుతుపట్టలేదా యేమి! నీవు కొన్ని దినములు కళత్రముగా స్వీకరించిన దారావళి సఖురాలను. పూవుఁబోణిని. జ్ఞాపకము వచ్చినదా? అని పల్కరించిన అతండటుచూచి యోహో? పూవుబోణి! నీవిందుంటి వేల? ఇది చంద్రలేఖ గృహము గదాయని అడిగిన అప్పడతి యిట్లనియె.

బావా ! నేను ప్రస్తుతము తారావళి యొద్దనుండుటలేదు. దానికిని నాకును విరోధము వచ్చినది. చంద్రలేఖ నాకు జుట్టమగుట నిందుంటిని. మాపనికత్తియ రుచికుఁడు గట్టిన పూవుదండలు దెమ్మనిన అంగడికిబోయి నేఁడు మరియొకరు కట్టిన దండలం దెచ్చినది. రుచికుని దండలుగాని చంద్రరేఖ ధరింపదు. అందునిమిత్తము దాని మరల అంగడికిఁ బంపితిని. దానిపాడ నరయుటకై యిందు వచ్చితిని. దీనికి ఫలము మీదర్శనమని పలికిన నవ్వుచు నావిటశిఖామణి యిట్లనియె.

పూవుబోణి! చంద్రలేఖ యింటికెవ్వరైన సరసులు వచ్చుచున్నారా? దాని కెవ్వరైన గన్నెరికము గావించినారా? అది తల్లి మాట వినక సంతతము విద్యాగోష్ఠియే చేయుచుండునని చెప్పుదురు. ఆ నియమంబులన్నియు నున్న యవియా? లేవా? నాకుఁ దడవులంబట్టి దానిఁజూడవలయునని యున్నది. ఉపాయ మేమని అడిగిన అప్పడఁతి బావా! అది పట్టిన నియమము బ్రహ్మవచ్చి చెప్పినను విడువదు. విద్యారుచికుంగాని పెండ్లియాడదఁట సరసులఁ గన్నెత్తిచూడదు. ఆడపండితులకుగాక యితరులకు గనంబడదు. నీవు దానింజూడఁ గోరితివేని యొక యుపాయము చెప్పెద వినుము. రుచికుని దండలు మాదిరిగాఁ గట్టవలయునని ప్రయత్నము చేయుచున్నది కానిశక్యముకాకున్నది. ఆ రుచికుఁడీ యూరనే నున్న వాఁడట. వానిం దీసికొనివత్తువేని దర్శనము చేయింతునని చెప్పుటయు అతండు నవ్వుచు నాలాగే ప్రయత్నము చేయుదునని పలికి అవ్వలికిఁబోయెను.