పుట:కాశీమజిలీకథలు -02.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుచికుని కథ

95

న్నాథుని కరుణావిశేషంబున దత్పత్ని గర్భవతియై పదవమాసంబున దివ్యతేజస్సమంచితుండైన కుమారునిం గనియెను. బలదేవుడు వాని సౌందర్యాతిశయంబున కచ్చెరువందుచు బ్రాహ్మణప్రేరణంబున వానికిం రుచికుడని నామకరణము జేసెను.

శిశువుగా నున్నప్పుడు వానిం జూచిన వారెల్ల యౌవనోదయంబున వీడెంత జక్కగా నుండునోయని యక్కఱ పడజొచ్చిరి. యముడు కృతాకృతంబుల విచారింపడుగదా? రుచికుని కైదేడులు రాకముందే తల్లి పరలోక మలంకరించినది. బలదేవుడు పత్నీవియోగశోకంబు గణింపక తల్లి లేని లోపమగుపడకుండ గుమారుని మిక్కిలి గారాబముగా బెనుచు చుండెను. పసితనంబుననే రుచికుడు తండ్రి మాలికలు గట్టుచుండ దానుగూడ నల్లుచుండును. రుచికునకు బూవుబంతులు, మాలికలు, జడలు క్రీడనకములై యొప్పెను. రుచికుని కెనిమిదేడులు ప్రాయము వచ్చినది. మొదలంత ప్రాయముగల గౌతముడను విప్రకుమారునితో మైత్రి గలిగినది బలదేవుడు రుచికునకు గౌతముని సహాధ్యాయునిగా జేసి తన యింటికి నుపాధ్యాయుల రప్పించి పెక్కువిద్యల నేర్పించెను. రుచికుడు మిగుల బుద్దిమంతుడగుట శీఘ్రకాలములో అనేక విద్యల యందు బాండిత్యము గలుగజేసికొనియెను.

మఱియు వానికిగల మాలికానిర్మాణకౌశల మింతింతయని చెప్పనలవి కాదు. ప్రజలు రుచికుడు కృత్రిమపుష్పములతో గట్టిన అలంకారముల దొడవులకు మారుగా ధరించుచుందురు. విశేషించి వారకాంతలు వానిదండలును బంతులును తొడవులును గోరికతో ధరించుచుందురు. దానంజేసి దేశమంతటను రుచికుని ప్రఖ్యాతి యెక్కువగా వ్యాపించినది. గౌతముం డొకనాడు రహస్యముగా రుచికుం జూచి తమ్ముడా! నీవు గట్టిన దండ లంగళ్ళలో విశేషము అమ్మబడుచున్నవి. నీయందు గల ప్రేమచే నీతండ్రి నిన్నిల్లు గదలనీయడు నీమాలికలు నీవు స్వయముగా వేశ్యాంగణమునకు దీసికొనిపోయి అమ్మితివేని నెక్కుడు వెల రాగలదు. మీ తండ్రి గుడికి బోయినప్పుడు రహస్యముగా అంగడికింబోయి దండల నమ్ముకొని వత్తమేయని బోధించిన విని సంతసించుచు రుచికుడు నాడు మంచిమంచిదండలం గట్టి వాడుకప్రకారము తండ్రి స్వామి నర్చింప నాలయమున కరిగినవెంటనే చక్కగా నలంకరించుకొని గౌతమునితో గూడ గణికాంగణంబున కరిగెను.

నానావిధాలంకారశోభితంబులైన గగన మొరయుచున్న మేడలపై గూర్చుండి వేణువీణాపటహమద్దల ధ్వనివిశేషముల కనుకూలముగా మేళగించి మధురస్వరంబులతో గాంధర్వంబు వెలయింపుచున్న వేశ్యామణుల గాంచి రుచికుండు విస్మయముతో గౌతమా! మనవీట నిట్టి వింతలున్నవని యెన్నఁడునుఁ జెప్పితివికావేమి? ఆహా! యిది స్వర్గము కాదుగద! అయ్యారే! ఆ కనంబడువారు. అచ్చరలేమో!