పుట:కాశీమజిలీకథలు -02.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కాశీమజిలీకథలు - రెండవభాగము

చిరకాలమగుటచే లోకాంతరగతులైరి. నీ విక్కడనుండి పోయి పెద్దకాలమైనది. దేవమానమున బట్టి నీకేమియుం దెలియకున్నది. నాకంబున రాకకై వేచియున్న నీభార్యను గలిసికొనియెదవు లెమ్ము. అదిగో! నీకొరకు దేవలోకమునుండి విమానము వచ్చుచున్నది. దాని నెక్కి పొమ్మని పలికి యూరకుండెను. గగనతలమునుండి యేతెంచిన భగవద్వచనములు విని యారాజు వింతసంతసముతో నున్నంత నా దేవయానము వాని మ్రోల నిలిచెను. అతడు భక్తిపూర్వకముగా దాని నధిష్టించి యందున్న దివ్యాంబరాభరణములు ధరించి దేవదూతలు సేవింప స్వర్గమునకు నిర్గమించెను.

గోపా ! దానంజేసి యా జగన్నాధుని రూపమట్లున్నది. సుభద్రాదేవి యాయన భార్య, బలభద్రుడు శేషుడు దీనినే బుద్ధావతారమని చెప్పుదురు. ఈస్వామి నారాధించిన వారిపాపము లగ్నివలన దూలికవోలె హరించును. ఇతండు కలివేళ బ్రత్యక్షదైవము. మన పూర్వపుణ్యవిశేషంబున నిద్దేవుని సేవలభించినది. నీ ప్రశ్నంబున కిదియే యుత్తరము వింటివిగద! ఇంక లెమ్మని పలికిన, వాడు మిక్కిలి సంతోషించుచు నాస్థలమహిమ కచ్చెరువందుచు బలుమారా కధావిశేషముల దలపోసికొనుచు గురునితో గూడ గావడియెత్తుకొని నడుచుచుండ నిరువురును దరువాతి మజిలీ చేరిరి.

శ్లో॥ సమ్రత్వేనోన్న మంతః పరగుణకథనైస్వాన్‌గుణాన్ ఖ్యాపయంతః
     స్వార్థాన్ సంపాదయంతః వితతపృదుతరారంభయత్నాః పరార్థే
     క్షాంత్యైవాక్షేప రూక్షాక్షరముఖరముఖాన్ దుర్జనాన్ దుఃఖయంతః
     సంతస్సాశ్చర్యచర్యా జగతిబహుమతాః కన్యనాభ్యర్చనీయాః