పుట:కాశీమజిలీకథలు -02.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము కథ

91

అవిఘ్నమునకు వెఱచుచు అత డంతర్థానంబు నొందెను. ఈయంగము లెవ్వడు బూర్తి జేయగలడని దుఃఖించుచు బశ్చాత్తాపంబున దల్లడిల్లజొచ్చెను. అప్పుడు భగవంతు డతని స్వప్నములో గనంబడి అనఘా నీవు చింతింపకుము. నేనిట్టి రూపముతోనే పుడమియందు జగన్నాధస్వామియను పేరుచే నొప్పుచుందును నీకీర్తి భూమియందు స్థిరముగా నుండును. నీ భక్తికి మెచ్చితిని అని చెప్పెను.

అట్టి కల తెఱంగెల్లరకు జెప్పి యాస్వామికి దనయందుగల ప్రేమాతిశయమునకు సంతసించుచు నింద్రద్యుమ్నుడు శుభలగ్నమున స్థాపన జేయదలంచి అట్టి లగ్నమును దెలిసికొనుటకై యోగబలంబున బ్రహ్మలోకమునకు బోయెను. అందు ద్వారమందు నిలిచి ద్వారపాలకునిచే దనరాక బరమేష్టికి విన్నవించిన అతండు లోనికి రప్పించుకొని నీవు వచ్చినపని యేమని అడిగెను. ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మకు నమస్కరించి అయ్యా నేను! జగన్నాధస్వామిని బ్రతిష్ఠ జేయదలచుకొని యాలయంబుల గట్టించితిని. అందులకు ముహూర్తము మీవలన బెట్టించుకొనవలయునని వచ్చితినని చెప్పెను. ఆ మాటలు విని చతురాననుండు నవ్వుచు నోహో ! ముహూర్తమునకై యింత దూరము వచ్చితివా చాలులే అన్నియునైనవి పోపొమ్మని యానతిచ్చెను.

పిమ్మట నామనుజపతి మరల జగన్నాధమునకు వచ్చి చూడ నా స్వామి వేరొకయాలయంబున స్థాపింపబడి అద్భుతములైన యుత్సవముల ననుభవింపు చుండెను. అందు దన్నెరింగిన వారెవ్వరును లేరు. కాలవ్యత్యయము మిక్కిలి గనంబడుచున్నది. దానికి తొందరయు నాశ్చర్యమును జెందుచు నా యాలయములోనికి బోవ నావల్లభుని గావలివారలాటంక పెట్టుటయు అయ్యో ! ఇదియేమి కర్మము. నేను మహారాజునను సంగతి గురుతెరుంగక వీండ్రు తోసివేయుచున్నారే! మవారందరు నెందు బోయిరో ? అని తలంచుచు వారితో నేను చక్రవర్తిని యీ వేల్పులు నాయిష్టదైవములు నన్ను ద్రోచివేసెదరేల ? అని యెన్ని విధముల జెప్పుకొనినను అతని మొర వినినవారు లేరు.

అప్పుడతడు సముద్రతీరమునకుబోయి భక్తివిశ్వాసపురస్సరముగా నాస్వామిని ధ్యానించిన నాభక్తరక్షకుం డంతరిక్షగతుండై రాజా! నీవు చింతింపకుము. నేను గారణాంతరమున నీవు రాకమున్న నిందు బ్రతిష్టింపబడితిని. నీయాలయమునకు గూడ నేటేట నొకసారివచ్చి యుత్సవముల నొందుచుండెదను. నీకీర్తి చిరకాలము బుడమియందు నిలుచును. నీవు స్వర్గసుఖముల ననుభవింతువుగాక నీ బంధువులందరు